ప్రతి సెగ్మెంట్‌లో వంద పడకల ఆస్పత్రి!

by Mahesh |
ప్రతి సెగ్మెంట్‌లో వంద పడకల ఆస్పత్రి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే అంశాన్ని గత ఎన్నికల టైంలో బీఆర్ఎస్​తన మేనిఫెస్టోలో పెట్టింది. దీన్ని ఇప్పుడు అమలు చేయాలని చూస్తున్నది. అయితే ఇప్పటికే మెడికల్ కాలేజీలున్న అసెంబ్లీ సెగ్మెంట్‌లకు దీని నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. వంద పడకలు లేని చోట కొత్తవి నిర్మించాలని, హెడ్​క్వార్టర్స్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉంటే వాటిని అప్‌గ్రేడేషన్ పేరిట వంద పడకలకు పెంచాలని చూస్తున్నది.

ఈ మేరకు సర్కారు.. వైద్యారోగ్యశాఖను వివరాలు కోరింది. స్టేట్ వైడ్‌గా సుమారు 50కు పైగా నియోజకవర్గాల్లో కొత్తగా ఆస్పత్రులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటికే టీవీవీపీలో ప్రణాళిక మొదలు కానున్నది. రెండు మూడు రోజుల్లో ఆఫీసర్లు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించనున్నారు.

ఎందుకీ నిర్ణయం ?

రాష్ట్రంలోని అనేక జిల్లాలకు వైద్య సేవలు దూరంగా ఉన్నాయి. 100కు పైగా కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ సరైన వైద్యం అందడం లేదు. ఏజెన్సీ ఏరియాలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజక వర్గాల్లో వైద్య సేవలు ఆలస్యమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రి ఉండేలా ప్రభుత్వం ప్లాన్​ చేస్తున్నది. గత ఎన్నికల మేనిఫెస్టో‌లోనూ పెట్టినందున ఎమ్మెల్యేల నుంచీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. ప్రతి రోజూ వైద్యాధికారులకు ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణాలపై సర్కార్​దృష్టి సారించింది.

Advertisement

Next Story

Most Viewed