జానపద కళల పరిరక్షణకు నాల్గంచెల వ్యూహం

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-17 16:44:44.0  )
జానపద కళల పరిరక్షణకు నాల్గంచెల వ్యూహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: చారిత్రకంగా మాత్రమేకాక సాంస్కృతికంగానూ తెలంగాణకు వేలాది సంవత్సరాల వైభవం ఉన్నదని, ఆదిమ మానవుడి తొలి ఆనవాళ్లు పాండవుల గుట్ట ప్రాంతంలో లభించాయని రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ పేర్కొన్నారు. ఇప్పటివరకూ మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బెట్కా ప్రాంతంలోనే తొలి మానవ సంచారం ఉన్నట్లుగా చరిత్రలో రికార్డయిందని, కానీ దానికన్నా ముందే తెలంగాణలో ఉన్నట్లు ఆధారాలు లభించాయని వివరించారు. ఆదిమ కళల ఆవిష్కరణ అప్పుడే మొదలైందన్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రారంభమైన అంతర్జాతీయ భారతీయ సభ వేడుకలకు ప్రసంగకర్తగా మామిడి హరికృష్ణ ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నారు. అందులో భాగంగా ఈ ఐదు రోజుల ఈవెంట్‌లో గురువారం స్వయంగా హాజరై తెలంగాణ సాంస్కృతిక గొప్పదనాన్ని, ప్రాచీన జానపద కళారూపాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాలుగంచెల వ్యూహాన్ని వివరించారు. జతీయ స్థాయి సెమినార్‌లో భాగంగా డాక్టర్ మామిడి హరికృష్ణ జానపద గిరిజన కళారూపాలపై ప్రత్యేక ప్రసంగం చేశారు.

చిందు యక్షగానం, ఒగ్గుకథ, శారదా కథ, కోలాటం, బోనాలు, బతుకమ్మ, గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, ధింసా తదితర అనేక జానపద, గిరిజన, ఆదివాసీ కళారూపాలు తెలంగాణ గడ్డమీదనే పురుడు పోసుకున్నాయని, వేలాది సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అవి ఈ ప్రాంత ప్రజల జీవన విధానంలో అంతర్భాగం అయ్యాయన్నారు. ఈ కళలు అంతరించిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో నాలుగంచెల వ్యూహంతో కాపాడుకుంటున్నదన్నారు. గ్రామీణ వృత్తి కళలను సంరక్షించుకోడానికి కొత్త తరానికి నేర్పడంపై దృష్టి పెట్టిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణను కల్పిస్తున్నదని, వీటిని నేర్చుకున్న తర్వాత ప్రదర్శించడానికి కళాకారులకు తగిన అవకాశాలను కల్పిస్తున్నదన్నారు. వృద్ధాప్యంలో ఉన్న కళాకారుల సంక్షేమం, సంరక్షణ కోసం (‘పద్మ’ అవార్డు గ్రహీతలకు) ప్రతి నెలా నగదు రూపంలో రూ. 25 వేల చొప్పున పింఛన్‌ను అందజేస్తున్నదన్నారు. కళలను ప్రోత్సహించడంపైనా ప్రత్యేక పాలసీని తీసుకొచ్చిందని, ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు వన్ టైమ్ ప్రోత్సాహకంగా రూ. 25 లక్షలను అందిస్తున్నదన్నారు.

నిరంతరం జానపద, గిరిజన, ఆదివాసీ కళల వ్యాప్తికి, వాటి అభివృద్ధికి ఈ విధానం దోహదపడుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఈ విధానం మంచి ఫలితాలనిస్తుందని, ప్రభుత్వం తీసుకున్న చొరవకు తెలంగాణ తరఫున హాజరైన డాక్టర్ మామిడి హరికృష్ణను ఆ కార్యక్రమానికి హాజరైన పలువురు అతిథులు అభినందించారు. ప్రాచీన కళారూపాల అభివృద్ధికి, వికాసానికి, తెలంగాణ కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రభుత్వ సహకారంతో తెలంగాణలోని అరుదైన జానపద, ఆదివాసీ, గిరిజన కళారూపాలకు ప్రాధాన్యత లభిస్తుందని, మరికొన్ని కాలాలపాటు ఉనికిలో ఉండడానికి దోహదపడుతుందని వారు వ్యాఖ్యానించారు. కేవలం తెలంగాణ రాష్ట్రానిక మాత్రమే ఈ కళలు పరిమితం కాకుండా వివిధ వేడుకల సందర్భంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ ప్రదర్శితమవుతున్నట్లు వివరించారు. అంతర్జాతీయ వేదికల మీద కూడా ఈ కళారూపాలకు మంచి ఆదరణ లభించినట్లు గుర్తుచేశారు.

కేంద్ర నాటక అకాడమీ నిర్వహిస్తున్న ఐదు రోజుల వేడుకలకు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. వీరితో పాటు వివిధ శాస్త్రీయ, సంగీత నృత్యకారులు, జానపద గిరిజన సాహిత్య, సంస్కృతి పరిశోధకులు, రచయితలు, నర్తకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ కృషికి జేజేలు పలికారు. అన్ని రాష్ట్రాలూ జానపద, గిరిజన, ఆదివాసీ కళాకారుల వికాసం కోసం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టేలా ఆయా ప్రభుత్వాలకు సూచించనున్నట్లు సభాముఖంగా తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed