Chhattisgarh: మైనింగ్‌కు వ్యతిరేకంగా నిరసన.. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఉద్రిక్తత

by vinod kumar |
Chhattisgarh: మైనింగ్‌కు వ్యతిరేకంగా నిరసన.. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పర్సా బొగ్గు గని పనుల నిమిత్తం అధికారులు చెట్ల నరికివేత కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. అయితే దీనికి వ్యతిరేకంగా స్థానికంగా ఉండే గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ప్రజలు రాళ్లు, బాణాలతో దాడి చేయగా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు, నలుగురు గ్రామస్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులపై పదునైన ఆయుధాలతో దాడి చేశారని ఎస్పీ యోగేష్ పటేల్ తెలిపారు. అయితే హస్దేవ్ అరణ్యలో చెట్ల నరికివేత జరుగుతోంది. దీనిని స్థానిక గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

కాగా, కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల డెవలపర్-కమ్-ఆపరేటర్ (ఎండీఓ) పథకం కింద పర్సా కోల్ బ్లాక్‌ను రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ కి కేటాయించింది. అయితే మైనింగ్ ప్రాజెక్టు వల్ల 700 మంది నిర్వాసితులవుతున్నారని, 840 హెక్టార్ల దట్టమైన అడవులు నాశనమవుతాయని, అంతేగాక దాదాపు 95,000 చెట్లు నరికివేయబడతాయని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ పత్రాల ఆధారంగా పర్సా బొగ్గు గనికి అటవీ, పర్యావరణ అనుమతులు ఉన్నాయని, ఈ గనిని తక్షణమే రద్దు చేయాలని ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ అనే సంస్థ డిమాండ్ చేస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లో ఐదో షెడ్యూల్‌ రద్దు చేశారా: ప్రియాంకా గాంధీ

ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. దేశవ్యాప్తంగా గిరిజనులను అణచివేయడం బీజేపీ విధానంగా మారిందని విమర్శించారు. శతాబ్దాలుగా అడవులకు యజమానులుగా ఉన్న ఆదివాసీలు అదానీ గనుల కోసం వెళ్లగొట్టబడుతున్నారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌ను రద్దు చేశారా? అని ప్రశ్నించారు. హస్దేవో అటవీ ప్రాంతంలో చెట్లు నరకొద్దని కాంగ్రెస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఈ తీర్మానానికి బీజేపీ కూడా మద్దతిచ్చిందని, కానీ ప్రస్తుతం ఆదివాసీలు వ్యతిరేకించినా మైనింగ్ ఆపకపోవడం దారుణమని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed