Dogs Attack :విధి కుక్కల దాడి.. బాలుడి పరిస్థితి ఎలా ఉందంటే..?

by Bhoopathi Nagaiah |
Dogs Attack :విధి కుక్కల దాడి.. బాలుడి పరిస్థితి ఎలా ఉందంటే..?
X

దిశ, పర్వతగిరి: రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. ఒంటరిగా కనిపించే చిన్నారులపై విరుచుకుపడుతున్నాయి. మూకుమ్మడి దాడులతో మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. వీధి కుక్కల దాడులపై ఒకవైపు ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్నా.. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఈ క్రమంలో వీధి కుక్కల దాడులు పర్వతగిరి మండలానికి పాకాయి. బుధవారం ఉదయం మండల కేంద్రానికి చెందిన బాసాని మనోజ్ కుమారుడు విహాన్ ఉదయాన్నే ఇంటిముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. ఈ దాడిలో విహాన్‌కు తీవ్రగాయాల పాలయ్యాడు. ముక్కు, కనురెప్ప, తలపై దాడి చేసి గాయపరిచాయి. విహాన్ అరుపులు విన్న తల్లిదండ్రులు పరుగున వచ్చి కుక్కలను చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

అధికారుల నియంత్రణ ఏది..?

కాగా, పర్వతగిరి మండలంలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయని, దీంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నామని ప్రజలు వాపోతున్నారు. తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లే వారిని సైతం కుక్కలు భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో ప్రజలు వాకింగ్‌కు సైతం వెళ్లకుండా మానేశారంటే వాటి బెడద ఎలా ఉందో అర్థం అవుతుంది. శునకాలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయడంతోపాటు రేబిస్‌ టీకా ఇవ్వాల్సి ఉన్నా మండల అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మండలంలో కుక్కల బెడదను నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed