రేవంత్‌పై ముప్పేట దాడి.. ఏలేటి‌ని నడిపిస్తున్నదెవరు..?

by Sathputhe Rajesh |
రేవంత్‌పై ముప్పేట దాడి.. ఏలేటి‌ని నడిపిస్తున్నదెవరు..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ ముఖచిత్రం ఎన్నికల ముందు ఒక్కసారిగా మారిపోతున్నది. వర్గపోరు పార్టీని ఇప్పటికే రెండుగా చీల్చిందని పార్టీలో ప్రచారం జరుగుతుండగా... గతంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వర్గాలు ఇప్పుడు ఏకమవుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పార్టీలోని అనేకమంది సీనియర్లు ఇప్పుడు ఏకం అవుతుండడం చూస్తే.. ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అత్యంత జూనియర్ అయిన రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించడాన్ని పార్టీలో అనేకమంది సీనియర్లు బహిరంగంగానే వ్యతిరేకించారు.

అదే క్రమంలో మరో జూనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముందుగా రేవంత్ రెడ్డితో కలిసి ఉండేవారు. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహేశ్వర్ రెడ్డితో విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుండి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని అనేకమంది సీనియర్ నేతలను కలుస్తూ వర్గ పోరుకు ఆజ్యం పోస్తూ వస్తున్నారు. అదే స్థాయిలో సీనియర్లు మహేశ్వర్ రెడ్డిని ప్రోత్సహిస్తుండడం వెనుక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

ఏలేటిని నడిపిస్తున్నది ఎవరు..?

రేవంత్ రెడ్డికి దీటుగా జోడోయాత్రను ప్రారంభించిన ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి యాత్ర వెనుక ఉన్నది ఎవరన్న ప్రశ్న మొదలైంది. రాజకీయపరంగా మొండి అన్న పేరున్న మహేశ్వర్ రెడ్డి తనను రాజకీయంగా ఎవరైనా ముట్టుకుంటే అంటుకుంటాడన్న పేరు ఉంది అయితే రేవంత్ రెడ్డితో కొంతకాలంగా ఆయనకు విభేదాలు ఉన్నప్పటికీ జోడోయాత్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవడం వెనుక ఆయన ఒక్కరి నిర్ణయం లేకపోవచ్చునని కొందరు సీనియర్లు ఆయనను బలంగా ప్రోత్సహిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

మరోవైపు భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని చెబుతున్నారు. వాస్తవానికి గత రెండు ఎన్నికల్లో నిర్మల్ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయిన మహేశ్వర్ రెడ్డి తన నియోజకవర్గంలోనే ఎక్కువ సమయాన్ని గడపలేదని కార్యకర్తలకు కొంత దూరం అయ్యారని ప్రచారం ఉంది. ఎన్నికలకు మరి ఎంతో సమయం లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నియోజకవర్గాన్ని వదిలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో జోడోయాత్రను చేపట్టడానికి కారణాలు ఏమిటన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

కలిసి వస్తున్న శత్రువులు...

మహేశ్వర్ రెడ్డి యాత్రకు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉప్పు నిప్పుగా ఉన్న సీనియర్లు ఇప్పుడు కలిసి వస్తుండడం రకరకాల ఊహాగానాలకు తెరలేపుతోంది. నల్గొండ జిల్లాలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా మహేశ్వర్ రెడ్డి చేపట్టిన యాత్రకు కలిసి వస్తుండడం కూడా చర్చనీయాంశం అవుతుంది. రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న జగ్గారెడ్డి హనుమంతరావు మధుయాష్కి తదితరులు కూడా శనివారం ఆయన యాత్రకు వస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తనను బలంగా వ్యతిరేకించిన ప్రేమ్ సాగర్ రావు సైతం ఇప్పుడు ఏలేటితో జత కట్టారు. మరోవైపు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా శుక్రవారం ఏలేటి యాత్రకు హాజరై వెళ్లారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే కాంగ్రెస్‌లో గతంలో శత్రువర్గాలుగా ఉన్న అనేకమంది నేతలు ఒకటవుతున్నారు. రేవంత్‌ను టార్గెట్ చేయడమే తాజాగా ఏలేటి జోడోయాత్ర లక్ష్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story