ఆ రెండు సమస్యలపైనే అత్యధిక దరఖాస్తులు.. అందరికీ న్యాయం చేస్తాం: మంత్రి సీతక్క

by Y.Nagarani |   ( Updated:2024-10-15 16:23:59.0  )
ఆ రెండు సమస్యలపైనే అత్యధిక దరఖాస్తులు.. అందరికీ న్యాయం చేస్తాం: మంత్రి సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీభవన్ లోని మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి మంగళవారం 160 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో భూ సమస్యలు, కొత్త అంగన్ వాడీ కేంద్రాలు, ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాలు, భూ కబ్జాలు, 98 డీఎస్సీ అభ్యర్ధులకు టీచర్ ఉద్యోగాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల తొలగించాలని ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి రిక్వెస్టులు అందాయి. దీంతో పాటు బీఆర్ఎస్ హయాంలో తమపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ఉద్యమకారులుగా తమను గుర్తించాలని, కోర్టు కేసులో పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీని త్వరగా పూర్తి చేయాలని, కుటుంబ అంతర్గత సమస్యలను పరిష్కరించాలని పలువురు పబ్లిక్ మంత్రిని కోరారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అడ్డగోలుగా చేసిన నియామకాలపై విచారణ చేపట్టాలని మంత్రి సీతక్కకు వినతి పత్రాల ద్వారా నివేదించారు. వెంటనే పలువురు జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు మంత్రి సీతక్క ఫోన్లో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను ప్రజా భవన్, మంత్రుల కార్యాలయాలకు వెళ్లి చెప్పుకుంటున్నారని, గతంలో ఈ పరిస్థితి లేదని వెల్లడించారు. గాంధీ భవన్ లో జరిగే ముఖా ముఖి కార్యక్రమం ద్వారా ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలు చెప్తున్నారన్నారు. జర్నలిస్టు సోదరుడు సుభాష్ అకాల మరణం బాధాకరమని, ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాల్లో సుభాష్ చురుగ్గా పాల్గొనే వారన్నారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఇక గాంధీభవన్ కు వచ్చిన అన్ని వినతులు తీసుకున్నామని, త్వరలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. దామగుండం ప్రాజెక్టుకు జీవో ఇచ్చింది బీఆర్ఎస్ నే అని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా , ప్రతిపక్షంలో మరోలా మాట్లాడటం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందన్నారు. బీజేపీది గాడ్సే సిద్ధాంతం అని, కాంగ్రెస్ ది గాంధీ సిద్ధాంతమని, రెండూ ఎప్పటికీ ఒక్కటి కావని నొక్కిచెప్పారు.

మరోవైపు గురుకులాలకు తాళాలు వేసే పరిస్థితి కేటీఆర్ వల్లనే వచ్చిందని మంత్రి సీతక్క వివరించారు. పెండింగ్ బిల్లులు అన్నీ కేసీఆర్ హయం లోనివేనని వెల్లడించారు. గురుకులాలు మూత పడుతున్నాయని బీఆర్ ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. గత ప్రభుత్వం హయంలో లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని త్వరలోనే క్లియర్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించి ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. గురుకులాలు మూత పడే పరిస్థితి ఉండదన్నారు. ఆదిలాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ చేశామని, పార్లమెంట్ లో సీటు ఓడిపోవడం కొంత యాక్టివిటీ తగ్గిందన్నారు. ఇప్పుడు మళ్లీ తిరిగి మొదలు పెడతామని సీతక్క వివరించారు.

Advertisement

Next Story

Most Viewed