బీఆర్ఎస్‌లో భారీ ‘కుదుపు’.. కీలక సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు డుమ్మా..!

by Satheesh |
బీఆర్ఎస్‌లో భారీ ‘కుదుపు’.. కీలక సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు డుమ్మా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిస్ అయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ మారేవారు మారారని, ఇక మారేవారు లేరని, ఉన్నవారందరూ పార్టీలోనే ఉంటారని పార్టీ అధిష్టానం పేర్కొంటుంది. కానీ స్పీకర్‌ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు కేవలం 15 మంది మాత్రమే వచ్చారు. సమాచారం ఇచ్చినప్పటికీ మిగిలినవారు గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కొంతమంది పార్టీని వీడుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది.

సమాచారమిచ్చినా ఎమ్మెల్యేల గైర్హాజరు!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా వేదికగానూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం స్పీడప్ అయింది. దానికి అడ్డుకట్ట వేయకుంటే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం కేటీఆర్‌ను రంగంలోకి దించింది. కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్‌ను కలిసి ప్రొటోకాల్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటుపడేలా ఒత్తిడి పెంచుతుంది. అందుకోసం స్పీకర్‌ను కలిసేందుకు పార్టీ ఎమ్మెల్యేలంతా రావాలని సూచించినట్టు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 39 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించగా, కంటోన్మెంట్ బైపోల్‌లో ఓటమిపాలైంది. దాంతో సంఖ్య 38కి పరిమితం కాగా, అందులో 10మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇక మిగిలింది 28 మంది. ఇందులో 15 మంది పార్టీ ఇచ్చిన సమాచారం మేరకు అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌ను కలిశారు. మరో 13 మంది హాజరుకాలేదు. అందులో కేసీఆర్ మినహా మిగిలిన అందరిపై పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.

ఆబ్సెంట్ అయిన వారిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. వీరి పార్టీ మార్పుపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

పార్టీ మార్పులకు చెక్ పెట్టేలా ప్లాన్

ఇప్పటికే ఫలానా ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు.. ఫలానా ఎమ్మెల్యే కాంగ్రెస్ టచ్‌లో ఉన్నాడనే ఆరోపణలు వస్తుండటంతో వాటికి చెక్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం డిసైడ్ అయింది. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి రావాలని అందరికీ సూచించినట్టు సమాచారం. ముందస్తు సమాచారమిచ్చినా 13 మంది ఎమ్మెల్యేలు రాకపోవడం, అందులో ఎక్కువగా ఆరోపణలు వస్తున్న వారే ఉండటం గమనార్హం. పార్టీలోని ఓ సీనియర్ ఎమ్మెల్యే మాత్రం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలకు రావాలని సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు.

అయితే గ్రేటర్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారా..? ఎలాగైనా పార్టీ మారుతారనే డిసైడ్ అయి చెప్పలేదా..? అనేది సర్వత్రా చర్చకు దారి తీసింది. ఇది వెంటనే తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి ఒకటి రెండ్రోజుల ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి సమాచారం ఇచ్చినా రాలేదా..? అని లీడర్లే చర్చించుకుంటున్నారు. పార్టీలోని ఎమ్మెల్యేలంతా ఐదారుగురు తప్ప మిగిలినవారంతా పార్టీని వీడటం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో తాజా ఘటన బలం చేకూరినట్టయింది.

డైలమాలో ద్వితీయస్థాయి నేతలు

ఎమ్మెల్యేల పార్టీ మార్పుతో బీఆర్ఎస్ రోజురోజుకూ బలహీనమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించేవారే కరువవుతున్నారు. కేడర్, ద్వితీయస్థాయి నేతలు సైతం డైలమాలో పడ్డారు. ఈ తరుణంలోనే ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చినా రాకపోవడంపై రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ప్రొటోకాల్ సమస్యను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు వచ్చారని పార్టీ పేర్కొంటుంది. అయితే పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, కోవాలక్ష్మి తదితరులు సైతం వారి నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు.

వీరు సైతం రాకపోవడం చర్చనీయాంశమైంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్, దుబ్బాక, సనత్‌నగర్ ఎమ్మెల్యేలకు సైతం సమాచారం ఇవ్వలేదా..? ఇచ్చినా రాలేదా..? అసలు రాకపోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? అనేది కూడా నేతలు చర్చించుకుంటున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కేడర్ ఆందోళన చెందుతోంది.

ఇప్పటికే పార్టీ వరుస ఓటములతో నైరాశ్యంలో ఉండటం, మరోవైపు పార్టీ కార్యక్రమాలు లేకపోవడం, ఇంకోవైపు ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటం ఇప్పటికే పార్టీని కుంగదీస్తున్నది. తాజాగా స్పీకర్‌ను కలిసే కార్యక్రమానికి ఉన్న పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతమంది రాకపోవడంతో పార్టీలోని కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులను డిఫెన్స్‌లో పడేసినట్టు అయింది. అయితే గైర్హాజరైన ఎమ్మెల్యేల్లో ఎంత మంది పార్టీలో ఉంటారనేది పార్టీలో సర్వత్రా చర్చకు దారితీసింది.

Advertisement

Next Story