- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ మెట్టు దిగడానికి కారణం అదేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ ఒక మెట్టు వెనక్కి తగ్గింది. సుప్రీంకోర్టులో గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నది. ఈ విజ్ఞప్తితో రెండు రోజుల క్రితం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. త్వరలో నంబరింగ్ కావాల్సి ఉంది. కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర షెకావత్ గతేడాది అక్టోబర్ 6వ తేదీన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా చేసిన సూచనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సానుకూలంగా స్పందించారు.
సుప్రీంకోర్టులో కేసు వేసిన కారణంగానే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించడానికి ఇబ్బంది ఎదురవుతోందని, దాన్ని ఉపసంహరించుకున్నట్లయితే పరిష్కరిస్తామని ఆ సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు కేసును ఉపసంహరించుకోవడంతో పరిష్కరించే బాధ్యతను కేంద్రం చేతిలోకి నెట్టారు. ఎప్పటికి పరిష్కారమవుతుందో గానీ ఒకవేళ పరిష్కరించని పక్షంలో మళ్ళీ కోర్టును ఆశ్రయించక తప్పదని తాజా రిట్ పిటిషన్‌లో తెలంగాణ స్పష్టం చేసింది.
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కారం కావడానికి సుప్రీంకోర్టులోని పిటిషన్ అడ్డంకిగా ఉందనుకుంటే దాన్ని ఉపసంహరించుకుంటామని సీఎం కేసీఆర్ గతంలోనే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటివరకు తేల్చుతుంది, ఎలా పరిష్కరిస్తుందనే అంశం ఎలా ఉన్నా బాధ్యతను మాత్రం కేంద్రం కోర్టులోకి విసిరారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా బేసిన్లో తెలుగు రాష్ట్రాల నీటి వాటా మొత్తం 811 టీఎంసీలు. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల చొప్పున రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతో అవగాహన కుదిరింది. అయితే తెలంగాణ అవసరాలకు ఎక్కువ నీరు అవసరమని, బేసిన్ విస్తీర్ణం కూడా ఎక్కువేనని, ఆ నిష్పత్తి ప్రకారమే కేటాయింపులు జరపాలని దీర్ఘకాలంగా వాదిస్తున్నది.
జల వివాదం కోసం ప్రస్తుతం పనిచేస్తున్న జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కేవలం ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు మాత్రమే చేసే అధికారం ఉన్నందున మొత్తం నీటి పంపకాల ప్రక్రియను, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టం (1956)లోని సెక్షన్ 3 ప్రకారం తెలంగాణ కేసు వేసింది. దీనిపై విచారణ ఇంకా మొదలుకాకముందే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై సత్వర పరిష్కారం గురించి కేంద్ర జలవనరుల మంత్రికి వివరించారు. కేంద్ర మంత్రి సూచన మేరకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులోని పాత కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుని ఆ మేరకు అప్లికేషన్ దాఖలు చేసింది.
సెంట్రల్ కోర్టులోకి బంతి
పిట్టపోరు.. పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా… తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. అయితే దీని వెనక రెండు రాష్ట్రాల పరిస్థితిని కేంద్రం ఏదో ఒక రూపంలో అడ్వాంటేజ్‌గా తీసుకునే ప్రయత్నం దాగి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను కేంద్రం రాజకీయ కోణంలో వాడుకుంటున్నదనే ప్రచారం ఉండనే ఉంది.
కేంద్ర ప్రభుత్వం గోదావరి-కావేరి నదుల అనుసంధానికి చేస్తున్న ప్రయత్నానికి విఘాతం కలగకుండా ఉండేందుకు రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాన్ని వాడుకునే అవకాశం లేకపోలేదన్న అనుమానం ఉంది. తెలుగు రాష్ట్రాలు పరస్పరం నదీ యాజమాన్య బోర్డులకు ఫిర్యాదులు చేసినా పరిష్కారం దొరకడంలేదు. మళ్ళీ కేంద్ర జలవనరుల శాఖ దగ్గరకే చేరుకుంటున్నాయి. ఇంతకాలం తెలంగాణకు కనీసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఒక భరోసాగా నిలిచినా ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోవడంతో మొత్తం భారం, నమ్మకం కేంద్రం మీదనే పెట్టుకున్నట్లయింది.
రెండు రాష్ట్రాలూ నిర్మిస్తున్న దాదాపు పదిహేను ప్రాజెక్టుల వివరాలు ఇప్పటికే ఆయా నదీ బోర్డుల యాజమాన్యాల ద్వారా కేంద్రానికి చేరుకున్నాయి. ఆ ప్రాజెక్టుల డిజైన్, శంకుస్థాపన, నిర్మాణం, డీపఆర్, ప్రారంభోత్సవం, ఖర్చు, వాటి వల్ల సాగులోకి వచ్చిన భూమి తదితరాలన్నీ కేంద్రం దగ్గర ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు రెండేండ్లుగా వివిధ ప్రాజెక్టులు, ఉల్లంఘనలు, నీటి కేటాయింపులు, వినియోగం తదితరాలపై కేంద్రానికి లేఖలు రాయడం, ఆరోపణలు చేయడం, ఫిర్యాదులు మొదలుపెట్టాయి.
సమస్యలను సుహృద్భావ వాతావరణంలో తామే పరిష్కరించుకుంటామని, కేంద్రం జోక్యం అవసరం లేదని ఇరు రాష్ట్రాల సీఎంలు గతంలో కాస్త ధీమాగానే చెప్పుకున్నారు. కానీ ఆ పరిస్థితి లేకటపోవడంతో నదీ యాజమాన్య బోర్డులకు, జలశక్తి మంత్రిత్వ శాఖలకు ఫిర్యాదు చేయక తప్పలేదు. సరిగ్గా దీన్నే కేంద్ర ప్రభుత్వం అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నది. కేంద్రం జోక్యం చేసుకుంటే రెండు రాష్ట్రాల ప్రాజెక్టులు రిస్కులో పడే ప్రమాదం ఉందని ఇంజినీర్లకు బలమైన అనుమానం ముందు నుంచీ ఉంది.
సుప్రీంకోర్టులోని పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకోవడంతో కేంద్రం చేతికి తాళాలిచ్చినట్లయిందన్న వాదనలు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారమైంది ట్రిబ్యునళ్ళ దగ్గరే. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఎలా పరిష్కారమవుతుందనే ఆసక్తికరంగా మారింది. ఏ రాష్ట్రాల మధ్య కూడా జలాల కేటాయింపులను ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వాలు ఖరారు చేయలేదు. ఇప్పుడు కేంద్రమే పరిష్కరిస్తుందా లేక కొత్త ట్రిబ్యునల్ వేస్తుందా అనేదానిపై క్లారిటీ లేదు. కేంద్రం నుంచి ఎలాంటి హామీ లేకుండా పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకోవడం చివరకు జుట్టును కేంద్రం చేతికి అందించడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దక్షిణ తెలంగాణకు దిక్కేది?
ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కాళేశ్వరం లాంటి భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టును కట్టినా దక్షిణ తెలంగాణ ప్రజలకు మాత్రం ఆ స్థాయిలో అసంతృప్తి ఉండిపోయింది. ఇకపైన ఫోకస్ దక్షిణ తెలంగాణపైనే అని టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించక తప్పలేదు. సీఎం కేసీఆర్ సైతం ఇటీవల పలు సాగునీటి రివ్యూలలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇరవై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శ్రీశైలం దగ్గర కనీస నీటి మట్టంపై వివాదం జరుగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులోని పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకోవడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే అనుమానాలు లేకపోలేదు. కృష్ణా నదిలో శ్రీశైలం దగ్గర 400 టీఎంసీలు మాత్రమే లభ్యమౌతాయని, గోదావరి నుండి 900 టీఎంసీలు తీసుకొచ్చి కృష్ణా బేసిన్లో ఎత్తిపోస్తే రెండు రాష్ట్రాల అవసరాలు తీరిపోతాయనే వాదనను రెండు రాష్ట్రాల సీఎంలు గతంలో చర్చించుకుని ఒక అవగాహనకు వచ్చారు.
ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారనేది నిపుణులను వేధిస్తున్న ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన సమయంలో కృష్ణా జలాల విషయంలో పూర్తి భారం కేంద్ర మీదనే పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు.