ఫసల్ బీమా సంగతేంది.. పంటల నష్టం ఇచ్చేదెవ్వరు..?

by Anukaran |   ( Updated:2021-08-12 00:16:26.0  )
fasal bima yojana
X

దిశ, తెలంగాణ బ్యూరో : “అమ్మ పెట్టదు.. అడుక్కతిననీయదు..” అన్నట్టుగా రైతులకు పంటల పరిహారం రాకుండా రాష్ట్రం అడ్డు పడుతోంది. అన్నింటికీ రైతుబంధే పరిష్కారం అన్నట్టుగా రైతుబంధు, రైతుబీమాతోనే కాలం వెళ్లదీస్తోంది. రాష్ట్రం నుంచి వాటా చెల్లించకపోవడంతోనే రైతులకు పరిహారం విడుదల చేయలేదంటూ కేంద్రం పార్లమెంట్​లో స్పష్టం చేసింది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం నుంచి వాటా చెల్లింపుపై స్పష్టత లేదని పేర్కొంది. ప్రభుత్వాల మధ్య ఇది వివాదంగా మారుతున్నా.. రైతులకు మాత్రం నష్టాలు మిగుల్చుతోంది. వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం దక్కకుండా చేస్తోంది. 2018 నుంచి 2020 యాసంగి సీజన్​ వరకు రైతులు నష్టపోయిన పంటలకు రూ. 1949 కోట్లు రాకుండా పోయాయి.

నోటిఫికేషన్​ కూడా లేదు..

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎ్‌ఫబీవై) పథకానికి తెలంగాణ నుంచి వాటా చెల్లించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయకపోవటం, పంటల బీమా దిశగా రైతులను ప్రోత్సహించకపోవటంతో క్రాప్‌ ఇన్స్యూరెన్స్‌ అమలుకావడం లేదు. కేంద్రం 2016 సంవత్సరం వానాకాలం సీజన్‌ నుంచి ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను అమలు చేస్తోంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ తరఫున నోటిఫికేషన్‌ జారీచేసేది. గత ఏడాది పీఎంఎఫ్​బీఐలో కేంద్రం నిబంధనలు మార్చేసింది. పీఎంఎ్‌ఫబీవై పథకంలో చేరటాన్ని రాష్ట్రాల ఇష్టాఇష్టాలకు వదిలేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ పథకంలో రైతులు చెల్లించే ప్రీమియం పోగా మిగిలిన ప్రీమియం మొత్తంలో రాష్ట్రం 50 శాతం, కేంద్రం 50 శాతం చెల్లించాలనే నిబంధన ఉంది. దీన్ని ప్రభుత్వాలు చెల్లించడం లేదు. కేవలం రైతు వాటా ప్రీమియమే కంపెనీలకు చేరుతోంది.

రైతుల తరఫున చెల్లించే ప్రీమియం వాటా ధనాన్ని ప్రభుత్వం ఆర్థిక భారంగా భావించింది. 2018 లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ. 386.74 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇందులో రాష్ట్ర వాటా రూ.193 కోట్లు, 2019 ఖరీఫ్‌, రబీ కలిపి రూ.638.40 కోట్ల వాటా ధనం ఉండగా… రాష్ట్ర వాటాగా ఉన్న రూ. 319 కోట్లు చెల్లించలేదని కేంద్రం నివేదికల్లో వెల్లడించింది. ఈ రెండేండ్లలో రూ. 513.50 కోట్లు చెల్లించకపోవడంతో ప్రధానమంత్రి ఫసల్​ బీమా యోజన రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఈసారి దీనికోసం కనీసం ఇంకా నోటిఫికేషన్​ కూడా జారీ చేయడం లేదు.

ప్రకృతి విపత్తులతో నష్టాలు..

రాష్ట్రంలో రైతులకు బీమా వర్తింపచేస్తున్న ప్రభుత్వం.. పంటల బీమాకు మాత్రం రూపాయి ఇవ్వడం లేదు. దీంతో ప్రతిఏటా వందల కోట్ల పంటలు నష్టపోతూనే ఉన్నారు. రైతులకు పంట చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండటంలేదు. ప్రతి సీజన్‌లో ఏదో ఒక రకంగా ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పంటలకు బీమా ఉంటే రైతులకు భరోసా ఉంటుంది. కానీ ఎలాంటి ఇన్సూరెన్స్​ చేయకుండా రైతులు పంట సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

రూ. 1949.77 కోట్లు పెండింగ్​..

కాగా 2018-19 ఖరీఫ్‌, యాసంగి సీజన్లకు సంబంధించిన రూ. 960.10 కోట్ల పంట నష్ట పరిహారం రాష్ట్ర రైతులకు రావాల్సి ఉంది. అదే విధంగా 2019–20లో వానాకాలం, యాసంగి సీజన్లలో వర్షాలతో రూ. 989.67 కోట్లు విలువైన పంటలు నష్టపోయారు. వీటికి సంబంధించిన క్లెయిమ్స్​ ఆగిపోయాయి. ప్రభుత్వం వాటా చెల్లించి ఉంటే రైతులకు ఈ నష్టపరిహారం అందేది. దీనిపై గతేడాది డిసెంబర్​లో ఆదిలాబాద్​ జిల్లా రైతులు ప్రగతి భవన్​ను ముట్టడించారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

రైతుబంధు ఇస్తే చాలా..?

రాష్ట్రంలో రైతులకు కేవలం రైతుబంధు ఇచ్చి, రైతుబీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అంతే మినహా పంటలకు ఇన్సూరెన్స్​, నష్టపోతే ఇన్​పుట్​ సబ్సిడీ వంటి వాటికి మంగళం పాడారు. 2014లో నుంచే ఇన్​పుట్​ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్​ బీమా వాటాను చెల్లించడం లేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రైతుబంధు ఇస్తే చాలా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

వర్షాలతో నష్టపోయినా పరిహారం లేదు : గుర్రాల లక్ష్మారెడ్డి, రైతు, కొండపల్కల, కరీంనగర్​ జిల్లా.


2019లో వర్షాలతో ఆరు ఎకరాల పంట నాశనమైంది. వరి పొట్ట దశలో ఉండగా వర్షం పడటంతో మొత్తం నేలవాలింది. పెట్టుబడులు కూడా నష్టపోయాం. అప్పటికే క్రాప్​ లోన్​ తీసుకుని ఇన్సురెన్స్​కు డబ్బులు చెల్లించాం. ప్రధానమంత్రి ఫసల్​ బీమాలో రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతో నష్టపరిహారం రావడం లేదు.

అరకొర సాయం చేసి చేతులు దులుపుకుంటున్నారు..

రైతుబంధు అంటూ సీజన్​లో ఎకరాకు ఐదు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. వాళ్లిచ్చే సాయం ఎటూ చాలదు. పెట్టుబడులు భారీగా పెరిగాయి. కానీ రైతుబంధు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోతే ఎవరిది బాధ్యత. కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ది కూడా లేదు. ప్రధానమంత్రి ఫసల్​ బీమాపై నిర్ణయం తీసుకోవాలి-

గుర్రాల.వెంకట్​రెడ్డి, రైతు, ఎంపిటిసి, కొండపల్కల

Advertisement

Next Story

Most Viewed