పురపోరుపై ఎస్​ఈసీ అధికారిక ప్రకటన ఇదే…

by Anukaran |   ( Updated:2021-04-22 05:51:01.0  )
పురపోరుపై ఎస్​ఈసీ అధికారిక ప్రకటన ఇదే…
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న మినీ పుర పోరును యదాతథంగా నిర్వహించేందుకే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఎస్​ఈసీకి అధికారిక ఆదేశాలిచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ పుర ఎన్నికలను షెడ్యూల్​ ప్రకారమే నిర్వహిస్తున్నట్లు ఎస్​ఈసీ ప్రకటించింది. అధికారికంగా దీనిపై ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారధి విడుదల చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పుర ఎన్నికలను వాయిదా వేయాలని అటు ప్రతిపక్షాలు, పలురాజకీయ పార్టీలు ప్రభుత్వానికి, కోర్డుకు, గవర్నర్​కు కూడా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. గురువారం కూడా కాంగ్రెస్​ నేత షబ్బీర్​ అలీ హైకోర్టులో లంచ్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేశారు.

లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి విజ్ఞప్తి చేసుకోవాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. కానీ ఈ పిటిషన్​ను కోర్టు విచారణకు స్వీకరించలేదు. పుర ఎన్నికల ప్రక్రియ దాదాపు 70 శాతం పూర్తి కావడం, కరోనా నిబంధనలను అనుసరిస్తూ ప్రచార గడువును తగ్గించడం వంటి చర్యలుతీసుకున్న ఎస్​ఈసీ… ప్రభుత్వ సూచనలతో యధాతథంగా ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు, మరో 8 మున్సిపాలిటీల్లో 8 వార్డులు, జీహెచ్​ఎంసీలోని లింగోజీగూడ డివిజన్​కు ఉప ఎన్నికలను యధాతథంగా నిర్వహిస్తున్నట్లు ఎస్​ఈసీ పార్థసారధి ప్రకటించారు. కాగా పుర ఎన్నికల్లో భాగంగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసి, గుర్తులను కేటాయించారు. అదేవిధంగా బ్యాలెట్​ పత్రాల ముద్రణకు సైతం ఆదేశాలిచ్చారు.

కొవిడ్​ నిబంధనల ప్రకారం మినీ పురపోరులో ప్రచారపర్వాన్ని మరింత తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ప్రచారాన్ని పోలింగ్​కు 48 గంటల ముందు ముగించాల్సి ఉండగా… దాన్ని 72 గంటలకు పెంచారు. ఈ లెక్కన మున్సిపల్​ ఎన్నికల ప్రచారం ఈ నెల 27న సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. అదే విధంగా ప్రచారపర్వం, పబ్లిక్​ మీటింగ్​, వీధుల్లో ప్రచారం, స్థానిక సమవేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలను ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని ఎస్​ఈసీ ఆదేశించింది.

Advertisement

Next Story