వేధిస్తున్నారా.. మీకు అండగా సైబర్ క్రైం

by Anukaran |   ( Updated:2021-08-31 22:04:18.0  )
crime police
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం మహిళలపై అరాచకాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆకతాయిలను ఎంత కట్టడి చేయాలని చూసినా ఎక్కడో ఓ చోట మహిళలు, యువతులపై అసభ్యంగా ప్రవర్తిస్తుండటం దర్శనమిస్తూనే ఉన్నాయి. వీటిని నిర్మూలించేందుకు కఠినమైన చట్టాలు తెచ్చి కొంత మేర తగ్గించగలిగారు. అయితే ఆఫీసులో అధికారులు, కాలేజీల్లో సీనియర్లు, సహచరులు, సోషల్ మీడియాలోని ఫ్రెండ్స్ ఇతర వ్యక్తులు వాట్సప్, ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తూ మిస్ బిహేవియర్‌గా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరి భరతం పట్టి, రక్షణ కల్పించేందుకు పోలీసులు దృష్టి సారించారు.

యువతులు, మహిళలు ఉద్యోగం చేసే ప్రాంతాల్లో అధికారులమంటూ పెత్తనం చలాయిస్తూ తనకింద పనిచేసే మహిళలను సోషల్ మీడియాలో ఇబ్బంది పెడుతూ చాటింగ్ చేస్తున్నారు. వారికి ఇష్టం లేకపోయినా జాబ్ పోతుందన్న భయంతో బాధితులు ఎవరికీ చెప్పడం లేదని పోలీసులు గుర్తించారు. దీనితోపాటు ఆత్మహత్యలు, హత్యలు వివిధ కేసుల్లో దర్యాప్తు చేయగా ఇలాంటి కారణాలే బయటపడినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇకనుంచి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు, వీటిని ముందుగానే గుర్తించేందుకు పోలీసులు సమాయత్తమయ్యారు. దీనికోసం సోషల్ మీడియా వేదికగా మహిళలు ధైర్యంగా వారి సమస్యలను పోలీసులకు తెలిపే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురయితే 94906 17444 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. బాధితులు చేసే ఫిర్యాదులను గోప్యంగా ఉంచడమే కాకుండా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితుడికి కౌన్సిలింగ్ ఇవ్వడం, వినకపోతే కేసులు పెట్టడం వంటివి చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed