పొట్టకూటి కోసం పోతే కరోనా సోకింది

by Shyam |
పొట్టకూటి కోసం పోతే కరోనా సోకింది
X

దిశ, న్యూస్ బ్యూరో:
పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన పేద యువకులు కరోనాను వెంట బెట్టుకుని వచ్చారు. డబ్బులు సంపాదించారో లేదో గానీ వైరస్‌ను మాత్రం పుష్కలంగా అంటించుకున్నారు. ఇప్పుడు కొద్దిమంది క్వారంటైన్‌లో, మరికొద్దిమంది చికిత్స కోసం ఆస్పత్రుల్లో ఉన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక విమానాల్లో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న వీరు తమ కుటుంబాల దగ్గరికి వెళ్ళలేక కరోనాతో సహజీవనం చేస్తున్నారు. శంషాబాద్‌లో దిగిన మొత్తం 458మందిలో అధికారికంగా 143 మందికి, అనధికారికంగా 170 మందికి కరోనా ఉన్నట్లు తేలింది.కొద్దిమంది తిరుమలగిరిలోని మిలిటరీ వెల్‌నెస్ సెంటర్‌లో క్వారంటైన్‌లో ఉంటే మరికొద్దిమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకెతమంది కరోనా బారిన పడతారో అనేది ఇప్పుడు వారిని ఆందోళనకు గురిచేస్తోంది. వీరంతా పేదలే కావడంతో తెలంగాణ ప్రభుత్వమే వీరి రోజువారీ అవసరాలను తీరుస్తోంది.

కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ సౌదీ అరేబియాకు వెళ్ళారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి ఏజెంట్ల చేతుల్లో మోసపోయారు. టూరిస్టు వీసాతో వెళ్ళి అక్కడ ఉపాధికోసం వెతుకులాట ప్రారంభించారు. ఈలోగా ఆరు నెలల గడువు తీరిపోయింది. చివరకు అక్కడి చట్టాలకు చిక్కి జైలుపాలయ్యారు. ఉద్దేశపూర్వకంగా ఏ నేరం చేయకుండానే జైళ్ళల్లో మగ్గుతున్నారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో జైల్లో ఉన్న వారందరికీ అంటుకుంటుందన్న భయంతో సౌదీ ప్రభుత్వం వారిని ‘ఆమ్నెస్టీ’ పేరుతో కేసులేవీ లేకుండా తక్షణం సొంత దేశానికి వెళ్ళిపోవాల్సిందిగా హుకుం జారీ చేసింది.ఈ వైరస్ బాధ లేకపోతే ఎన్నేండ్లు వారు అక్కడి జైళ్ళలో మగ్గేవారో.

దేశం కాని దేశంలో ఇంతకాలం వారి బాగోగులు ఎవ్వరికీ పట్టలేదు. కరోనా కారణంగా ఆ దేశ ప్రభుత్వం వీరిని వదిలించుకోవాలని భావించి ఆమ్నెస్టీ అవకాశం కల్పించింది. సరిగ్గా ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్కీమ్‌లో భాగంగా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి తీసుకొచ్చింది. అలా కొన్ని విమానాల్లో వీరంతా హైదరాబాద్ చేరుకున్నారు. సౌదీ నుంచి వచ్చిన 458 మందిలో కేవలం 17 మంది మాత్రమే తెలంగాణకు చెందినవారు. మిగిలినవారంతా వివిధ రాష్ట్రాలకు చెందినవారు. అందరూ పేదలే. క్వారంటైన్‌లో భాగంగా వీరి ఆరోగ్యస్థితిని పరిశీలిస్తున్న క్రమంలో కొద్దిమందిలో కరోనా లక్షణాలు బైటపడ్డాయి. పరీక్షలు చేయడంతో మొదటి రోజున 33 మందికి, రెండో రోజున 49 మందికి, మూడో రోజున మరో 49 మందికి.. ఇలా మే 27 నాటికి మొత్తం 143 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

నిజానికి హైదరాబాద్ చేరుకోగానే వీరిని వారివారి సొంత రాష్ట్రాలకు తెలంగాణ ప్రభుత్వం పంపించాల్సి ఉంది.కానీ పద్నాలుగు రోజుల క్వారంటైన్ నిబంధన ఉండడంతో ఇక్కడే ఉంచాల్సి వచ్చిందని, పరీక్షలు చేస్తున్న క్రమంలో పాజిటివ్ సంఖ్య పెరుగుతూ ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. క్వారంటైన్‌లో ఉంచకుండా వీరికి ప్రయాణ సౌకర్యం కల్పించినట్లయితే వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. సౌదీ నుంచి వచ్చినవారిలో దాదాపు మూడవ వంతు మంది కరోనా బారిన పడడంతో మిగిలినవారంతా బిక్కుబిక్కుమంటున్నారు. స్వంత దేశం వచ్చామన్న తృప్తే తప్ప అటు కుటుంబాన్ని చేరుకోలేక, ఇటు కరోనా పాజిటివ్ పేషెంట్లుగా ఆసుపత్రుల్లో దినదిన గండంగా గడపలేక బాధలు అనుభివిస్తున్నామని వైద్యారోగ్య సిబ్బందితో మొరపెట్టుకుంటున్నారు.

Advertisement

Next Story