పీవీకి మంత్రుల నివాళులు

by Shyam |
పీవీకి మంత్రుల నివాళులు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహరావు శత జయంతి వేడుకలను పలువురు మంత్రులు ప్రారంభించి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆదివారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో పీవీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల మాట్లాడుతూ భారత రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసి ప్రగతి ఫలాల కోసం చెట్లను మనకు అందించిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానం సుస్థిరం చేసిన స్థితప్రజ్ఞుడు పీవీ అని కొనియాడారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ను కాపాడుతూ మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేండ్లు నిలబెట్టిన మహానేతను ఆ పార్టీ పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు.

అటు హన్మకొండ జేఎన్ స్టేడియం బస్టాండు వద్ద పీవీ శత జయంతి ఉత్సవాల్లో మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు, నగర మేయర్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, కెప్టెన్ లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ తొలి తెలుగు ప్రధాని పీవీ నరసిహరావు తెలంగాణ పేరును ప్రపంచ నలుమూలల వ్యాపింప చేశారని కొనియాడారు. దేశం అన్నిరంగాల్లో అభివృద్దికి పీవీనే కారణమని, ఆయనకు భారత రత్న రాకపోవడం‌ బాధాకరమన్నారు. కరీంనగర్‌‌‌లో పీవీ శత జయంతి ఉత్సవాల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని మాట్లాడుతూ పీవీ చొరవల్లే తాను ఇంజినీరింగ్ చేయగలిగానన్నారు. పీవీ సీఎంగా ఉన్నప్పుడు భూ సంస్కరణలు, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story