ఆర్టీసీ భూముల పందేరం.. వేల కోట్ల విలువైన ఆస్తులపై పెద్దల కన్ను

by Shyam |   ( Updated:2021-07-16 00:24:30.0  )
Cm KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులను సాకుగా చూపిస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ భూములు, ఆస్తుల అమ్మకాలపై దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. మొన్నటి వరకు ప్రభుత్వ భూములను వేలం వేసి దాదాపు రూ. 50 వేల కోట్ల రాబడికి లెక్కలేసిన సర్కారు.. ఇప్పుడు నగరాల్లోని నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ ఆస్తులపై పడింది. దీనిలో భాగంగా కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన ఆస్తుల వివరాలు సమర్పించాలని సూచించారు. దీనిలో ముందుగా ఆర్టీసీ ఆస్తులపైనే పడ్డారు. కేబినెట్ చర్చ జరిగిందో.. లేదో కానీ ఆర్టీసీకి సంబంధించిన ఆస్తుల వివరాలను సిద్ధం చేస్తున్నారు. అటు ప్రభుత్వం నుంచి కూడా దీనిపై ఆదేశాలు వచ్చినట్లు అధికారులు ఆఫ్​ది రికార్డుగా చెప్పుతున్నారు.

ముంపు సాకు..!

తెలంగాణ పల్లెల్లో సామెత ప్రకారం.. కుక్కను చంపాలంటే పిచ్చికుక్కగా ముద్ర వేసి కొట్టి చంపితే చాలు.. అన్నట్టుగా మారింది ఆర్టీసీ వ్యవహారం. నష్టాలు, అప్పులతో తెలంగాణ ఆర్టీసీని నిండా ముంచుతున్నట్లు ప్రచారం చేయడంలో ప్రభుత్వం సఫలమవుతూనే ఉంది. అందుకే ఆర్టీసీ కార్మికులకు వేతనాలను కూడా సరైన సమయంలో ఇవ్వడం లేదు. ప్రతినెలా 15వ తేదీ దాటిన తర్వాత కూడా ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో ఆర్టీసీకి 364 బస్‌ స్టేషన్లు, 97 డిపోలు, 24 డివిజన్లు, 11 రీజియన్లు ఉన్నాయి. 10,400 బస్సుల్లో రోజుకు 98 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. కానీ, ఇప్పుడు కొంతమేరకు తగ్గినా ఇటీవల కొంత మేరకు పుంజుకుంటోంది.

అయితే, దీనికి అనుగుణంగా ప్రభుత్వం బస్సుల సంఖ్యను సైతం తగ్గిస్తోంది. పల్లె వెలుగు బస్సులను రోజుకు రెండు ట్రిప్పులకే పరిమితం చేస్తోంది. కరోనా సెకండ్​వేవ్ లాక్‌డౌన్​తర్వాత కొన్ని గ్రామాలకు మొత్తానికే బస్సులను బంద్ చేసింది. ఎందుకంటే నష్టాలు.. బస్సులను తిప్పలేమంటూ చెబుతున్నారు. దీనికి తోడుగా అప్పుల కుప్ప పెరుగుతోంది. 2015లో ఆర్టీసీ విభజన సమయంలో రూ. 2017 కోట్ల అప్పులు ఉండగా.. ఇప్పుడు అదనంగా రూ. 2080 కోట్లు చేరాయి. ప్రస్తుతం రూ. 4097 కోట్ల అప్పుకు చేరింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 928.67 కోట్ల నష్టం రాగా.. గతేడాది కరోనా కారణంగా నష్టం రెండింతలైంది. పాత అప్పులతో పాటుగా కరోనా నష్టమే దాదాపు రూ. 3 వేల కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

ఆదుకోవడం కాదు.. అప్పులిప్పించడమే

ఆర్టీసీని ఆదుకుంటామని బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వడం లేదు. బడ్జెట్ కేటాయింపులు యథాతథంగా కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. 1500 కోట్లు ఇస్తామని చెప్పినా.. ఇంకా రూపాయి ఇవ్వలేదు. అంతేకాదు.. బ్యాంకుల నుంచి రూ. వెయ్యి కోట్లు అప్పు ఇప్పించేందుకు ప్రభుత్వం గ్యారంటీ వహిస్తోంది. దీంతో ఆర్టీసీ అప్పు మోయలేనంతగా పెరగనుంది. మరోవైపు రాష్ట్రంలో ఆర్టీసీకి రావాల్సిన వివిధ రీయింబర్స్ మెంట్ సకాలంలో ఇవ్వడంలేదని, రూ. వెయ్యి కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీఎస్ఆర్టీసీకి బకాయిలు రావాల్సి ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఆస్తులపై నివేదికలు..

మరోవైపు కారణాలేమైనా ఆర్టీసీ ఆస్తులపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. పాత నివేదికలన్నీ మళ్లీ బయటకు తీశారు. ప్రభుత్వం అడగడంతోనే ఈ నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న అప్పులు, ఆస్తులు, వాటి విలువలన్నీ లెక్కలేస్తున్నారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. దాదాపు రూ. వెయ్యి కోట్ల బస్‌‌ భవన్‌తో పాటుగా రాష్ట్రంలో 97 బస్‌‌ డిపోలు, 364 బస్టేషన్లు, 14 దవాఖానలు, రెండు జోనల్‌‌ వర్క్‌‌ షాపులు, ఒక బస్‌‌ బిల్డింగ్‌‌ యూనిట్‌, రెండు టైర్‌‌ రిట్రీడింగ్‌‌ షాపులు, ఒక ప్రింటింగ్‌‌ ప్రెస్‌, ట్రాన్స్‌‌పోర్టు అకాడమీ ఉంది.

ప్రాథమిక లెక్కల ప్రకారం ఆర్టీసీకి దాదాపు రూ. 60 వేల కోట్ల విలువైన ఆస్తున్నాయి. ఒక్కో డిపో సుమారు 5 నుంచి 10 ఎకరాల విశాల స్థలంలో ఉండగా.. బస్‌‌ స్టేషన్లు సుమారు రెండు నుంచి నాలుగు ఎకరాల్లో ఉన్నాయి. హైదరాబాద్ ​నడిబొడ్డున రూ. వెయ్యి కోట్ల విలువ చేసే బస్‌‌ భవన్‌‌, అదే స్థాయిలో ఎండీ ఆఫీసు, ఒక గెస్ట్‌‌ హౌజ్‌‌ ఉంది. దీంతో, ముషీరాబాద్ పరిధిలోనే ఆర్టీసీకి రూ. 1500 కోట్ల విలువ చేసే భూములున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో రెండెకరాల్లో ఆర్టీసీ కల్యాణ మండపం, తార్నాకలో కార్పొరేట్‌‌ తరహా ఆసుపత్రి, అత్యంత విశాలంగా ఎంజీబీఎస్‌‌, జేబీఎస్‌‌ బస్టాండ్లు, గోషామహల్‌‌ డోమ్‌..‌ ఆర్టీసీ విలువైన స్థలాల్లో అతి ముఖ్యమైనవిగా ఉన్నాయి. కరీంనగర్‌‌, వరంగల్‌‌ పలు జిల్లాల్లో కీలకమైన ప్రాంతాల్లో కలుపుకుని రూ. 60 వేల కోట్లకుపైగా విలువైన ఆస్తులున్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు.

పెద్దలు కన్నేశారు..

మరోవైపు ఆర్టీసీ ఆస్తులపై ఇప్పటికే మంత్రులు, ప్రభుత్వానికి సలహాలిచ్చే పెద్దలు కన్నేశారు. కూకట్‌పల్లి డిపో పరిధి కోసం ఓ నిర్మాణ సంస్థ చాలా రోజుల నుంచే ప్రయత్నం చేస్తోంది. దాన్ని లీజుకు ఇచ్చే అవకాశాలను సైతం ప్రభుత్వానికి సూచించింది. అంతేకాకుండా తమ సంస్థ తరఫున ఆర్టీసీకి కొన్ని ఎలక్ట్రికల్ బస్సులను సైతం అద్దెకు పెట్టింది. ముషీరాబాద్ డిపో పరిధిలోని ఆర్టీసీ భూమిపై ఓ మంత్రి తనయుడు, ఓ పార్లమెంట్​ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం. అటు నిర్మల్‌లో ఆర్టీసీ భూమి ఓ ఎమ్మెల్యే చేతిలో బంధీగా ఉంది.

కరీంనగర్‌లో ఆర్టీసీ విలువైన భూమిలో ఓ మల్టీప్లెక్స్ ఉంది. అది ప్రస్తుతం లీజులో ఉండగా.. దాన్ని సొంతం చేసుకునేందుకు ఓ మాజీ ఎంపీ కన్నేశారు. ఇలా ఆర్టీసీ భూములను దక్కించుకునేందుకు పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్ భేటీలో కూడా దీనిపై చర్చించడం, ఆస్తుల లెక్కలు తీయాలని ఆదేశించడం, ఆదేశాలు రావడమే తరువాయి ఆర్టీసీ అధికారులు కూడా నివేదిక సిద్ధం చేయడంతో ఆర్టీసీ అమ్మకంపై అనుమానాలు బలపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed