RS ప్రవీణ్ కుమార్‌ను టార్గెట్ చేసిన సర్కార్.. నిఘా వేసి వారికి వార్నింగ్.?

by Anukaran |
RS Praveen Kumar, cm kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : దళిత వాడల్లో నిఘా వర్గాలు మాటు వేశాయి. ఎస్సీ కుటుంబాల వ్యక్తిగత సర్వే అంటూ వివరాలు సేకరిస్తున్నా.. దీనిలో భారీ స్కెచ్​ వేశారు. ఈ సర్వేలో స్వేరో స్టార్స్​ వివరాలను సేకరిస్తున్నారు. ఒక్కో కుటుంబాన్ని పరిశీలిస్తున్న నిఘా వర్గాలు సదరు కుటుంబంలో రాజకీయపరమైన వివరాలను తీసుకుంటున్నారు. ఓవైపు రెవిన్యూ, పంచాయతీరాజ్​, ఎలక్ట్రిసిటీ, పంచాయతీ కార్యదర్శులు ఆర్థిక పరిస్థితులపై సర్వే చేస్తుంటే ఇంటలీజెన్సీ వర్గాలు మాత్రం లోతైన వివరాలను తీసుకుంటున్నారు. ప్రధానంగా ఐపీఎస్ మాజీ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో లింకులపై పరిశీలిస్తున్నారు.

దళిత వర్గాల్లో ప్రవీణ్ ముద్ర..

గురుకులాల కార్యదర్శిగా పని చేసిన కాలంలో బహుజన వర్గాల్లో బలమైన పట్టు సాధించారు. విద్యాపరమైన అంశాల్లో దళితులకు అండగా నిలిచారు. చాలా మందిని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోని పేరొందిన విద్యాసంస్థల్లో చేర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్​ కుమార్​ నేతృత్వంలో పురుడుపోసుకున్న స్వేరో స్టార్స్​ గ్రామీణ ప్రాంతాలకు పాకింది. ప్రస్తుతం తేలుతున్న అంశాల ప్రకారం ప్రతి పది కుటుంబాల్లో ఆరు కుటుంబాలు ఆయనతో ఏదో విధమైన బంధాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్రంలో 34 లక్షల మంది సభ్యులతో స్వేరో సంస్థ వేళ్లూనుకుంది. ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలిసిందే. ప్రస్తుతం ప్రవీణ్​ కుమార్​ ఐపీఎస్​కు రాజీనామా చేయడం, ప్రభుత్వంపై దూకుడుతో విమర్శలకు దిగడం తెలిసిందే. దీనికి గ్రామస్థాయి నుంచి కూడా మద్దతు వస్తోంది.

ఫాలోయింగ్​ను తేల్చేందుకే..?

ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాడని భావించినప్పటికీ.. ఆయన తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. దీంతో ఆయనకు దళిత వర్గాల్లో ఉన్న పట్టుపై కేసీఆర్​ కన్నేసినట్లు తెలుస్తోంది. బహుజనవాదాన్ని ఎత్తుకుంటున్నా.. ఎక్కువగా దళిత వర్గాల్లోనే ఫాలోవర్స్​ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్వేరో స్టార్స్​ పేరిట ఆయన వెనక వెళ్లేదెవరు, ఎలాంటి పరిస్థితులు వస్తాయనే అంశాలపై ఫోకస్​ పెట్టినట్లు సమాచారం.

దళిత బంధు వంటి ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలు చేస్తున్నా దానిపై విమర్శలు చేస్తుండటంతో ప్రవీణ్​ కుమార్​ టార్గెట్​గా మారారు. దళితులకు ఇలా ఉచితాలు అవసరం లేదని, దళిత బంధు ఒక మాయ అంటూ ఆ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నారు. మరోవైపు విద్యావంతులైన యువతీ, యువకులు ప్రవీణ్​ కుమార్​కు అండగా ఉండటం కూడా గులాబీ బాస్​కు తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. ఈ వర్గాలను ఆయనకు దూరం చేయాలనే ప్లాన్​ వేస్తున్నారు. దీనిలో భాగంగా నిఘా వర్గాలతో కీలకమైన సర్వేకు ఆదేశాలిచ్చారు.

ప్రస్తుతం ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాలు, ఆర్థికపరమైన అంశాలపై సర్వే చేస్తున్నట్లు చెప్పుతున్నా.. నిఘా వర్గాలు మాత్రం రాజకీయ కోణంలో ఆరా తీస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఈ వివరాలు తీసుకుంటున్నాయి. గ్రామంలోని దళిత వాడలో ఎన్ని కుటుంబాలున్నాయి, ఆ కుటుంబాలతో రాజకీయాలకు సంబంధాలున్నాయా, చదువుకునే వారు ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడ చదువుతున్నారు, గురుకులాల్లో చదివితే ప్రవీణ్​ కుమార్​ ప్రాబల్యం ఉందా అనే సమగ్రమైన వివరాలు సేకరిస్తున్నారు.

సమావేశాలకు వెళ్తున్నారా..?

ప్రస్తుతం ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ వరుసగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు దళిత వర్గాల నుంచి ఎంతమంది వెళ్తున్నారు, విద్యావంతులు వెళ్తున్నారా, రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే యువతీ, యువకులు వెళ్తున్నారా అనే సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి. ఇటీవల ప్రవీణ్​ కుమార్​ సమావేశానికి వెళ్లిన ఇద్దరు జూనియర్​ పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసిన విషయం తెలిసిందే.

ఇలా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ, కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​లో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ప్రవీణ్​కుమార్​ వెంట ఉంటున్నారనే వివరాలను తీసుకుంటున్నారు. మరోవైపు ఆర్​ఎస్​పీతో తిరుగుతున్న నేతలకు సైతం అధికార పార్టీ నుంచి వార్నింగ్​ సైతం వార్నిగ్​లు వెళ్తున్నాయి. ఇటీవల ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో స్వేరో స్టార్స్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లి తన పాటలతో గళమెత్తడమే కాకుండా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమని ప్రకటించిన ప్రముఖ కళాకారుడిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

ఉమ్మడి పాలమూరుకు చెందిన సదరు గాయకుడు అధికార పార్టీ కార్యక్రమాల్లో సైతం ప్రముఖంగా కనిపిస్తున్నాడు. కానీ ఇటీవల ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​కు మద్దతు ఉంటూ పాటలు పాడుతుండటంతో ఆయన్ను టార్గెట్​ చేశారు. అంతేకాకుండా ఉమ్మడి పాలమూరు, కరీంనగర్​ జిల్లాలకు చెందిన పలువురు నేతలను సైతం సదరు మంత్రులతో హెచ్చరించినట్లు ఆర్​ఎస్​పీ శిబిరంలో చర్చ నడుస్తోంది.

లక్షల్లో అభిమానులు..

ఇక ఇప్పటి వరకు నిఘా వర్గాల పరిశీలనలో ప్రవీణ్​ కుమార్​కు దళిత వర్గాల్లో అభిమానుల సంఖ్య లక్షల్లో ఉన్నట్లు తేలింది. ఈ నివేదికను ప్రాథమికంగా కేసీఆర్​కు చేరవేసినట్లు విశ్వసనీయ సమాచారం. స్వేరోస్టార్స్​ రూపంలో ఆయనకు పట్టు ఉందని, కీలకమైన వర్గాలు ఆయన అభిమానులుగా ఉన్నాయని వెల్లడించారు. అయితే రాజకీయంగా ప్రవీణ్​కు ఎంత మేరకు కలిసి వస్తుందనే అంచనాకు రాలేకపోతున్నట్లు పేర్కొన్నారు.

నేడు బీఎస్పీలో చేరిక..

కాగా ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ నల్లగొండ వేదికగా బీఎస్పీలో చేరుతున్నారు. లక్షలాది మంది స్వేరోలతో కలిసి ఆయన నీలి కండువా కప్పుకోనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఆదిలాబాద్​ నుంచి అలంపూర్​ వరకు పర్యటన చేయనున్నారు. బహుజన వర్గాలే లక్ష్యంగా ప్రవీణ్​ కుమార్​ పర్యటన ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed