దారి చూపిన తెలంగాణ.. ప్రధాని నోటి వెంట కేసీఆర్ విధానాలు

by Shyam |   ( Updated:2021-05-16 11:50:30.0  )
దారి చూపిన తెలంగాణ.. ప్రధాని నోటి వెంట కేసీఆర్ విధానాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వారాలుగా నిర్వహిస్తున్న ‘ఇంటింటి సర్వే‘ ఇప్పుడు దేశం మొత్తానికి దారి చూపుతోందని రాష్ట్ర వైద్యారోగ్య వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. వైద్యారోగ్య మంత్రిత్వశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన ‘ఇంటింటి ఫీవర్ సర్వే‘, ‘కరోనా మెడికల్ కిట్‘ లాంటివి ఇప్పుడు ప్రధాని కూడా వివిధ రాష్ట్రాలతో పంచుకుంటున్నారని, అన్ని రాష్ట్రాలూ గ్రామ స్థాయి నుంచి అమలు చేయాల్సిందిగా సూచనలు చేశారని ఈ వర్గాలు గుర్తుచేశాయి. గతేడాది కరోనా తొలి వేవ్‌లో ‘కంటైన్‌మెంట్ జోన్‘ విధానంలో తెలంగాణ మొదటి అడుగు వేస్తే దేశమంతా అదే అమలైందని, ఇప్పుడు ‘ఇంటింటి సర్వే‘ కూడా ‘డోర్ టు డోర్‘ పేరుతో అన్ని రాష్ట్రాల్లో అమలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల మొదలు రాజధాని నగరం వరకు ఇంటింటి సర్వే జరుగుతూ ఉందని, దీని ద్వారా కరోనా నిర్ధారణ పరీక్ష దాకా వెళ్ళకుండా ముందే జాగ్రత్త పడే వీలు కలిగిందని వైద్యారోగ్య శాఖ ఉన్నాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గ్రామాల్లో ‘ఆశా‘ వర్కర్లు, ఏఎన్ఎంలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నర్సులు ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారని, వారి సేవలను కరోనా కట్టడి కోసం వినియోగించుకోవాలన్న సీఎం ఆలోచన మంచి ఫలితాలను ఇచ్చిందని వివరించారు. ఇంటి దగ్గరే లక్షణాలను పసిగట్టి ముందుగానే అవగాహన కలిగించినందున వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్త పడినట్లయిందని పేర్కొన్నారు.

‘ఇంటింటి సర్వే‘తో మంచి ఫలితాలు వచ్చాయి : డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, ప్రజారోగ్య శాఖ

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఫీవర్ సర్వే మంచి ఫలితాలనే ఇచ్చింది. జీహెచ్ఎంసీతో పాటు గ్రామీణ స్థాయి వరకు ఇది అమలవుతోంది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సేవలను కరోనా సెకండ్ వేవ్‌లో సమర్ధవంతంగా వినియోగించుకోగలిగాం. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోడానికి ముందే లక్షణాలను పసిగట్టి, దానికి తగిన మందులు వాడడం, ఇతరులకు సోకకుండా ఐసొలేషన్‌లోకి వెళ్ళిపోవడం వైరస్ వ్యాప్తి కాకుండా ఆపగలిగాయి. ప్రభుత్వమే ఎనిమిది రకాల మాత్రలను కరోనా మెడికల్ కిట్ పేరుతో ఇచ్చినందున వాటిని వాడినవారు ఆస్పత్రుల దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండాపోయింది. ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రధాని మోడీ పలు రాష్ట్రాలతో ప్రస్తావించి అమలు చేయాల్సిందిగా సూచించారు. తెలంగాణ విధానం మొత్తం దేశానికే ఉపయోగపడడం సంతోషంగా ఉంది.

Advertisement

Next Story