- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దక్కన్ ఆసుపత్రిపై వేటు
దిశ, న్యూస్‌బ్యూరో: పేషెంట్ల నుంచి బలవంతంగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వ చర్యలు మొదలయ్యాయి. సోమాజిగూడలోని దక్కన్ ఆసుపత్రికి కరోనా పేషెంట్లకు చికిత్స అందించే అనుమతిని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ రద్దు చేసింది. ఇకపైన కొత్తగా కరోనా పేషెంట్లను చేర్చుకోరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే అడ్మిట్ అయి చికిత్స పొందుతున్న పేషెంట్లను ఇబ్బందులకు గురిచేయరాదని, ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉల్లంఘించినట్లయితే ఆ ఆసుపత్రికి ఇచ్చిన లైసెన్సును కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఒక కుటుంబం మొత్తాన్ని కరోనా పేరుతో కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులు లక్షలాది రూపాయలు వసూలు చేసి చిదిమేసిన పాపంలో దక్కన్ ఆసుపత్రి కూడా ఒకటి. డబ్బులు చెల్లిస్తే తప్ప మృతదేహాన్ని ఇచ్చేది లేదని దబాయించడంతో ఆ కుటుంబ సభ్యుడొకరు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు. కరోనా నిర్ధారణ పరీక్షలో నెగెటివ్ అని రిపోర్టు వచ్చినా ఆ విషయాన్ని దాచిపెట్టి పాజిటివ్ పేషెంట్లు ఉండే వార్డులో పెట్టి చికిత్స అందించి లక్షల రూపాయల బిల్లు వేసింది. చికిత్స వద్దంటూ యాజమాన్యానికి మొరపెట్టుకుని డిశ్చార్జి చేస్తే వెళ్ళిపోతానని బతిమాలినా ఆ పేషెంట్ ఆవేదన అరణ్య రోదనే అయింది. చివరకు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రి యాజమాన్యం ప్లాన్ బెడిసికొట్టింది. ఈ ఆసుపత్రి అనైతిక చర్యలు ట్విట్టర్ ద్వారా చివరకు మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్ళడం, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు చెప్పడం, ఆ తదనంతరం వైద్యారోగ్య శాఖ అధికారులు ఆ ఆసుపత్రిపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయడం, చివరకు ఆ ఫిర్యాదులు నిజమేనని తేలడంతో ప్రస్తుతానికి కరోనా ట్రీట్‌మెంట్ ఇచ్చే అనుమతిని రద్దు చేయాలన్న నిర్ణయానికి దారితీసింది.
నగరంలోని మరికొన్ని కార్పొరేటు ఆసుపత్రులపై కూడా ఇలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై కూడా ప్రభుత్వం ఇదే తరహా నిర్ణయం తీసుకుంటుందా అని బాధితులు ఎదురుచూస్తున్నారు. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్‌లు వందలాది ఫిర్యాదులు వస్తూ ఉన్నందున వాటి ఆధారంగా జరిగిన దర్యాప్తు, సమర్పించే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతీరోజు సగటున 120 ఫిర్యాదులు కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వస్తున్నాయని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు. నగరంలోని పదికి మించిన కార్పొరేటు ఆసుపత్రులపైనా, యాభైకు పైగా ప్రైవేటు ఆసుపత్రులపైనా బాధితుల నుంచి ఈ వాట్సాప్ నెంబర్‌కు పిర్యాదులు వచ్చినట్లు ఆ శాఖ సిబ్బంది ఒకరు తెలిపారు. చాలా ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులపై ప్రస్తుతం వైద్య అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారని పేర్కన్నారు. అయితే ఇప్పటివరకు దక్కన్ ఆసుపత్రిపై మాత్రమే ప్రభుత్వం చర్య తీసుకుంది. ఫిర్యాదులు వచ్చిన మరికొన్ని కార్పొరేటు ఆసుపత్రులపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు లేవు. ఇందులో మెజారిటీ ఆసుపత్రుల యాజమాన్యం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. అలాంటి ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనే చర్చ కూడా సామాన్య ప్రజానీకంలో మొదలైంది.