తెలంగాణలో వారింకా పరదేశీయులే..

by Ravi |   ( Updated:2021-07-31 03:31:14.0  )
తెలంగాణలో వారింకా పరదేశీయులే..
X

‘ఏటా ప్రవేశపెడుతున్న అంకెల గారడీ బడ్జెట్ సంచారజాతులకు ఏమి చేసిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో వారి జీవన ప్రమాణాలపై సమగ్ర అధ్యయనం జరుగలేదు. ఆర్థిక ఫెడరేషన్లు, లెక్కల చిట్టా పద్దులు కాకుండా బీసీ కమిషన్ తరహాలో సంచార జాతుల కమిషన్ వేయాల్సిన అవసరం ఉంది. బంగారు తెలంగాణలో కూడా సంచార జాతుల పిల్లలు విద్యాపరంగా వృద్ధిలో లేరు. కనీసం నిలువ నీడలేని దైన్య పరిస్థితి. ఇప్పటికీ అడవి జంతువులను వేడాడి జీవనం సాగిస్తున్నారు. అందుకే పథకాల, రాజకీయ ప్రయోగశాల పేరున్న తెలంగాణలో సంచార జాతుల కోసం ఓ ప్రత్యేక కమిషన్ కానీ, కార్పొరేషన్ నియమించి ఈ జాతులను న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది.’

‘అన్నార్థులు, అభాగ్యులుండని ఆ నవయుగమదెంత దూరం’ అన్న దాశరథి పాటను సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో పదేపదే పాడుకున్నారు. రాష్ట్రమొస్తే ‘అన్నార్థులు, అభాగ్యులుండని తెలంగాణను ఆవిష్కరించవచ్చని’ అన్నారు. ఆత్మగౌరవంతో బతకాలని, సామాజిక విప్లవం రావాలని కేసీఆర్ అనేక సందర్భాలలో చెప్పుకొచ్చారు. రాష్ట్రమొచ్చి ఏడేండ్లు అయినా సంచార జాతుల జీవితాలు మారకపోవడం విచారకరం. ఇప్పటికీ పరదేశీయులుగానే పిలువబడుతున్న సంచార జాతులు ఈ సమాజానికి దూరంగానే ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇవాళ రకరకాల పథకాలు, సంస్కరణలతో ముందుకు పోతున్నదని, కులానికో స్కీం ఉందని చెప్పుకుంటున్న క్రమంలో, ‘దళితబంధు’ తెరమీదకు వచ్చింది. ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తే ఈ పథకం దళిత జనోద్ధరణకు ఎంతగానో ఉపకరిస్తుందన్నది వాస్తవం. అందుకే రాజకీయ పార్టీలన్నీ ఈ పథకాన్ని స్వాగతిస్తున్నాయి. ఇదే సమయంలో, దళితబంధు తరహాలో కాకపోయినా ఇంకా అస్పృశ్యతలో మగ్గుతున్న తమను కూడా చేరదీస్తారనే ఆశతో సంచార జాతులు ఎదురు చూస్తున్నాయి. సంచార జాతులు ఈ సమాజాన్ని మేల్కొలిపేవి. యావత్ జనాన్ని జాగృతం చేసేవి. తెలంగాణలో వాటి ఉనికి సజీవంగా ఉన్నప్పటీకీ, ఆ జాతులను చేరదీయకపోవడం బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాల కోసం ఎంబీసీ కార్పొరేషన్ (మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్-అత్యంత వెనుకబడినవర్గాలు) ఏర్పాటు చేసినా అందులో సంచార జాతులకు న్యాయం జరుగలేదని చెప్పాలి.

వారూవీరూ వేరువేరు..

సంచార జాతులు వేరు, ఎంబీసీలు వేరు. సంచార జాతుల సంస్కృతి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఎంబీసీల కన్నా వైవిధ్యభరితంగా ఉంటాయి. సంచార జాతులు అనగానే మొదట గుర్తుకొచ్చేది బాలసంతులు. వారు తొలి పొద్దునే వచ్చి గంట కొడుతూ, పాట పాడి, భిక్షాటన చేసి వెళ్లిపోతుంటారు. ప్రస్తుతం వీరి వృత్తి అంతరించిపోయింది. నగరీకరణ, పట్టణీకరణ ప్రభావం పల్లెలలోకి పాకి బాలసంతులు వృత్తికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ కులాలవారు చిరు వ్యాపారాలు చేస్తూ డ్రైవర్లుగా, క్లీనరుగా పనిచేస్తున్నారు. ఇక బుడుబుక్కలవారు కిర్రుమనే శబ్దంతో గ్రామాలలోకి ఉదయాన్నే వచ్చి మనల్నీ యాక్టివ్ చేసి, భిక్షాటన చేసి వెళ్లిపోతారు. ఇప్పుడీ వృత్తి మాయమైపోయింది. ఈ సామాజికవర్గం కూడా చిరు వ్యాపారాలు లేదా సంచార జీవనంతోనే బతుకుతున్నారు. ఆ తర్వాత ఫకీర్లు వచ్చి పాటలు పాడుతూ వెళ్లిపోతారు. ఫకీరులు వెళ్లగానే హరిదాసులు ఆధ్యాత్మిక వ్రవచనాలు చేస్తూ వస్తుంటారు. జనం మేల్కొని ఊరంతా రెడీగా ఉన్న సమయంలో పూసవెర్ల, పూసల కులానికి చెందినవారు ఆడవారికి అలంకృత వస్తువులు తీసుకొస్తారు. బొట్టు, కాటుక, అద్దాలు, దువ్వనెలతో ఆడవాళ్ల అవసరాలు తీర్చుతారు. విలేజీ బ్యూటీపార్లర్లు, కంగన్ హాళ్లు వారి పొట్ట కొట్టాయి. మందులవారు ఆయుర్వేద ఎచ్చాలతోవచ్చి సేవలందించేవారు. గంగిరెద్దులవారు ఉదయాన్నే వచ్చి విన్యాసాలతో దీవెనలిచ్చి వెళ్తుటారు. ఇలా రోజులో సగ భాగం సంచార జాతి కులాల పాత్ర ఉంటుంది.

ఇప్పటికీ అక్కడక్కడా..

ఇప్పటికీ కొన్ని పల్లెలలో ఈ వాతావరణం కనిపిస్తున్నది. ఉదయం పది గంటలకల్లా గారడోళ్ల విన్యాసాలు ప్రారంభమవుతాయి. పగటి బాగోతాలు వేసేవారి కోసం చూస్తుంటారు. సాధనాశూరుల విన్యాసాలు కూడా పగలే ఉంటాయి. సాయంత్రం మొదలయ్యే రకరకాల పురాణ కథలతో, చిందు యక్షగానంతో ఊరు నిద్రలోకి జారుకుంటుంది. కులాల ఔన్నత్యాన్ని చాటుకుంటూ పురాణ కథలు చెప్పేవారు కూడా సంచార జాతులలో భాగమే. ఆడవాళ్లు భిక్షాటన చేస్తూ కుటుంబాలను సాకుతారు. మగవారు అటవీ జంతువుల వేటకు పోతారు. ఇక దాసర వృత్తి కూడా భిక్షాటనే. వీధి ప్రదర్శనలు, దువ్వెనలు తయారు చేసే దొమ్మరలు, శివాలయాలలో పూజలు చేస్తూ సాంప్రదాయక భిక్షాటన చేసే జంగంల వృత్తి అంతరించిపోయింది. మూలికా వైద్యం నిర్వహించే జోగి, కనికట్టు విద్య, శ్మశానాలకు కాపలా ఉండే కాటిపాపలవారు, శరీరం కోసుకుని రక్తం చిందిస్తూ భిక్షాటన చేసే మొండి కులాలవారు సైతం చిరు వ్యాపారాల వైపు మొగ్గు చూపారు. యాదవుల కథలు, రెడ్లు, ఇతర కులాల చరిత్ర చెబుతూ, గోత్రాలు వివరించే పిచ్చికుంట్లవారు వృత్తిని ఏనాడో మరిచారు. పాములు, ముంగీసలు, కోతులను ఆడించే పాములవారు కనిపించడం లేదు. డప్పులు కొట్టి భిక్షాటన చేసే పంబాలోళ్లు పత్తా లేకుండాపోయారు. దేవతల ప్రతిమలను నెత్తికెత్తుకుని ఊరేగే పెద్దమ్మ దేవరలు, ఎల్లమ్మలు, ముత్యాలవాండ్లు ఆ వృత్తికే దూరమయ్యారు. వైశ్యుల ఆశ్రితకులమైన వీరభద్రీయ వీరముష్టులు మచ్చుకైనా ఆ వృత్తిలో లేరనే చెప్పాలి. భిక్షాటనే ప్రధాన వృత్తిగా గల మొండిపట్ట, పరిముగ్గుల, కంజరభట్ట, కైకాడి, కాశీకాపుడి ఆ వృత్తికి దూరమై అంగడిలో అమ్మకాలు చేస్తున్నారు. వేర్లు, కాయలు, వనమూలికలతో ఉండే మందులోళ్లు, జ్యోతిషమే వృత్తిగా ఉన్న జోషి నందివాల, నైజం సర్కారుకు ఆయుధాలు తయారుచేసిన సిక్లిగర్‌లు, కనుమరుగయ్యారు. బండలు కొడుతూ బతికే వడ్డెర్ల జీవన పరిస్థితి కూడా దారుణంగా ఉంది.

సమగ్ర అధ్యయనం జరగాలి..

ఏటా ప్రవేశపెడుతున్న అంకెల గారడీ బడ్జెట్ సంచారజాతులకు ఏమి చేసిందో ఆత్మపరీశీలన చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో వారి జీవన ప్రమాణాలపై సమగ్ర అధ్యయనం జరుగలేదు. ఆర్థిక ఫెడరేషన్లు, లెక్కల చిట్టా పద్దులు కాకుండా బీసీ కమిషన్ తరహాలో సంచార జాతుల కమిషన్ వేయాల్సిన అవసరం ఉంది. బంగారు తెలంగాణలో కూడా సంచార జాతుల పిల్లలు విద్యాపరంగా వృద్ధిలో లేరు, కనీసం నిలువ నీడలేని దైన్య పరిస్థితి. ఇప్పటికీ అడవి జంతువులను వేటాడి జీవనం సాగిస్తున్నారు. అందుకే పథకాల, రాజకీయ ప్రయోగశాల పేరున్న తెలంగాణలో సంచార జాతుల కోసం ఓ ప్రత్యేక కమిషన్ కానీ, కార్పొరేషన్ నియమించి ఈ జాతులను న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది.

-గుంటిపల్లి వెంకట్
9494941001

Advertisement

Next Story