సెప్టెంబరు 17.. చరిత్ర మరచిన సర్కార్.. కాలగర్భంలోకి వీరుల ‘వెయ్యి ఉరుల’మర్రి

by Anukaran |   ( Updated:2021-09-15 22:27:01.0  )
సెప్టెంబరు 17.. చరిత్ర మరచిన సర్కార్.. కాలగర్భంలోకి వీరుల ‘వెయ్యి ఉరుల’మర్రి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సెప్టెంబరు 17.. ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంది.. అందులోనూ నిర్మల్ పట్టణం వైపే అంతా చూస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఏటా డిమాండ్ చేస్తుండగా.. ఈ సారి ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానే రంగంలోకి దింపుతోంది. నిర్మల్ పట్టణాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

తెలంగాణ, భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఇక్కడే బీజం పడిందనే విషయం బయట వారికే కాదు.. ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. భవిష్యత్తు తరాలకు ఇంకా ఏం తెలుస్తుంది. వెయ్యి మంది వీరుల అమరత్వానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన వెయ్యి ఉరులమర్రి.. కనీస అభివృద్ధికి నోచుకోకపోవటం.. పోరాట యోధుడు రాంజీ విగ్రహం నిర్లక్ష్యానికి గురి కావటమే అసలు కారణం.. తాజాగా అమిత్ షాకు దిశ చూపినా.. ఇకనైనా దశ మారుతుందో లేదోననే చర్చ సాగుతోంది.

ఆదివాసీ యోధుడు రాంజీ గోండు పోరాటం అసాధరణం, అసామాన్యం. నిజాం, బ్రిటీష్ వ్యతిరేక పోరాటానికి బీజం నిర్మల్.. స్వాతంత్ర్య సంగ్రామానికి బాటలు వేసిన ప్రదేశం.. ఒకే సారి వెయ్యి మంది యోధులు ఉరిగొయ్యల ఉరితాడును ముద్దాడిన చోటు.. మాతృభూమి కోసం ప్రాణాలను వదిలిన వెయ్యి మంది వీరుల గడ్డ.. కొమురం భీమ్‌ వంటి ఎంతోమంది వీరులకు స్ఫూర్తినిచ్చిన పోరుగడ్డ. ఇప్పటికీ ఇక్కడున్న గుట్టలు, చెరువులు, బురుజులే నాటి సంగ్రామానికి సజీవ సాక్ష్యాలు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్నా.. చరిత్ర పుటల్లోకి చేరలేదు. నాటి నుంచి నేటి దాకా పాలకులు పట్టించుకోలేదు. ఆదివాసీ యోధుడు రాంజీ గోండు పోరాటం, వెయ్యి మందిని ఉరి తీసిన ఊడలమర్రిని గుర్తించిన వారు లేరు. వారి చరిత్ర ఇప్పటి తరం వారికే తెలియకపోగా.. భవిష్యత్తు తరాలకు ఏం తెలుస్తుందనే ప్రశ్న ఉద్భవిస్తోంది.

విగ్రహం, స్థూపమే స్మారకాలై మిగిలినై..

వెయ్యి మంది వీరుల బలిదానానికి సజీవ సాక్ష్యమైన మహా మర్రిచెట్టుకు వెయ్యి ఉరుల మర్రిగా పేరొచ్చింది. కొన్నేళ్ల క్రితం ఆ మర్రిచెట్టు గాలివానకు నేలకొరిగింది. ప్రస్తుతం మొదలు మాత్రమే మోడుగా మిగిలింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నాక.. వివిధ సంఘాల నాయకులు 2007 నవంబర్‌ 14న వెయ్యి ఉరుల మర్రి సమీపంలో ఓ స్థూపాన్ని నిర్మించారు. 2008 నవంబర్‌ 14న నిర్మల్‌లోని చైన్‌గేట్‌ వద్ద రాంజీ గోండు విగ్రహం ఏర్పాటు చేసి అంతటితో దీన్ని వదిలేశారు. నిర్మల్ పట్టణంలోని చైన్‌గేట్‌ వద్ద విగ్రహం నిలువెత్తు నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచింది. ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోకపోగా.. తాగుబోతులకు అడ్డగా మారింది. అసలు ఈ విగ్రహం ఎవరిదో.. చరిత్ర ఏంటో చాలా మంది యువతకు తెలియకపోవటం ఇక్కడి దౌర్భాగ్యం. ఇక వెయ్యి ఉరుల మర్రి వద్ద స్థూపం మాత్రమే ఉంది. ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.

అమరులైనా.. అందరికీ తెలియదే..

అమరులు అంటే.. చనిపోయినా అందరి మనస్సుల్లో బతికి ఉండేవారు. అలాంటిది ఇంతటి ఘన చరిత్ర ఉన్నా.. నేటితరం స్థానికుల్లోనే చాలామందికి ఇది తెలియకపోవడం విచారకరం. రాంజీ గోండు, వెయ్యి ఉరుల మర్రి గురించి భావితరాలకు తెలిసేందుకుగాను.. నిర్మల్‌ సమీపంలో రాంజీ గోండు పేరిట మ్యూజియం ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొన్నారు. ఇందుకు కేంద్ర పర్యాటక శాఖ కొన్ని నిధులు కూడా మంజూరు చేయగా.. కొన్ని రోజుల తర్వాత హైదరాబాదులో ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వాలు ఇచ్చిన మాట కూడా కాలగర్భంలో కలిసిపోయింది. చరిత్ర మూలాలు మరిచిపోవటంతో.. భావితరాలకు తెలిసేదెలా అనే ప్రశ్న ఏర్పడింది. నాటి వీరుల గాథలు, వారి అసమాన ప్రాణత్యాగాల గురించి పట్టించుకునే తీరిక పాలకులకు లేకుండా పోయింది. కనీసం జిల్లా అధికారులు కూడా దృష్టి పెట్టడం లేదు. చాలా మంది జిల్లా అధికారులకు వెయ్యి మంది వీరుల పోరాటం గురించి అవగాహనే లేదు. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అమరులకు స్థానం కల్పించలేదు.

పర్యాటక ప్రాంతంగా పరిఢవిల్లేనా..

ఏళ్లు గడుస్తుంటే.. ఘనమైన చరిత్రకు చెదలు పడుతుంటే.. ఇంకెన్నాళ్లకు స్పందిస్తారన్న ప్రశ్నలు మాత్రం జిల్లావాసుల నుంచి వస్తూనే ఉన్నాయి. రాంజీ గోండు ఆదివాసీ తెగకు చెందినవారు. అలాంటిది ఇద్దరు ఆదివాసీ ఎంపీలు గొడాం నగేశ్(టీఆర్ఎస్), సోయం బాపురావు(బీజేపీ) ఉండి కూడా కనీసం పట్టింపు లేకుండా వ్యవహరించారు. ఇక రాష్ట్ర మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామమైన ఎల్లపెల్లి దారిలోనే వెయ్యి ఉరుల మర్రి స్థూపం ఉండగా.. జిల్లా కేంద్రం నడిబొడ్డునే రాంజీ గోండు విగ్రహముంది. ఆయన కూడా అభివృద్ధి చేయక పోవటం గమనార్హం. తాజాగా అమిత్ షా పర్యటనకు దిశ చూపిన వెయ్యి ఉరుల మర్రి.. దశ మారేనా అనే చర్చ సాగుతోంది. అదీకాక కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీయే ఉండటంతో ఆశలు చిగురిస్తున్నాయి. ఇక అమిత్ షా పర్యటనపైనే అందరి దృష్టి పడింది.

Advertisement

Next Story

Most Viewed