ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి..కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ

by Shyam |
krisna water board
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ ఇటీవల వరుస లేఖలు రాస్తున్న తెలంగాణ ఇరిగేషన్ డిపార్టుమెంట్ తాజాగా కృష్ణా బోర్డుకు మరో లేఖ రాసింది. ఏపీలోని ముచ్చుమర్రి దగ్గర ఉన్న కేసీ (కర్నూల్-కడప) కెనాల్, మల్యాల దగ్గర హంద్రీనీవా ఎత్తిపోతల కేసీ కెనాల్‌‌ను కలిపే లింక్ కెనాల్, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు అందించే బనకచర్ల దగ్గరి ఎస్కేప్ ఛానెల్ ద్వారా కృష్ణా జలాలను తరలించడాన్ని తక్షణం ఆపివేసేలా చొరవ తీసుకోవాలని ఆ లేఖలో తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మూడు ప్రాజెక్టులూ అక్రమమైనవేనని, శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను ఏపీ తరలిస్తూ ఉన్నదని, తక్షణం ఆ ప్రక్రియకు బ్రేక్ వేయాలని కోరారు.

నిజానికి ఈ మూడు ప్రాజెక్టులకు తరలుతున్న నీరంతా కృష్ణా నది బేసిన్‌కు వెలుపల ఉన్న ప్రాంతాలకేనని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి మధ్య కుదిరిన ఒప్పందం మొదలు 1970వ దశకంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వరకు ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉందని, నిర్దేశించిన కోటాకంటే ఎక్కువ నీటిని తరలిస్తూ ఉన్నదని ఆ లేఖలో ప్రస్తావించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి 1944, 1951లలో కుదిరిన ఒప్పందాలకు భిన్నంగా అదనపు నీటిని తరలిస్తోందని గుర్తుచేశారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కేసీ కెనాల్‌కు కేవలం 10 టీఎంసీల నీటి కేటాయింపులు మాత్రమే ఉండేవని, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌కు 17.1 టీఎంసీల కేటాయింపు ఉన్నదని, సమైక్య రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1980వ దశకంలో ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కేసీ కెనాల్‌కు 39.90 టీఎంసీల కేటాయింపు జరిగిందని మురళీధర్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఇందులోనుంచే 8 టీఎంసీలను శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్‌కు ఇచ్చేలా 1981లో సమైక్య ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. ఈ ఉల్లంఘనలను ప్రస్తుతం జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఉంచామని, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కేసీ కెనాల్‌కు పది టీఎంసీల కంటే ఎక్కువ వాడకుండా ఆర్డర్లు ఇవ్వాల్సిందిగా కోరామని తెలిపారు.

కేసీ కెనాల్‌కు 1981 నుంచి 39.90 టీఎంసీల కేటాయింపు జరిగినా అందులో ఎస్ఆర్‌బీసీకి 8 టీఎంసీలు పోయినా మిగిలింది 31.90 టీఎంసీలు మాత్రమే. అయినా 1972 నుంచి 2007 వరకు సగటున 54.53 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం వాడుకుంటోందని సంవత్సరాలవారీగా లెక్కలను ఆ లేఖలో మురళీధర్ రావు ప్రస్తావించారు. గరిష్ఠ స్థాయిలో 72.09 టీఎంసీలను వాడుకున్నదని పేర్కొన్నారు. మరోవైపు ఆర్డీఎస్‌కు 15.90 టీఎంసీల కేటాయింపు ఉన్నా 5 టీఎంసీలు కూడా వాడుకోలేకపోయిందన్నారు. 2017 నుంచి ఫంక్షనింగ్‌లోకి వచ్చిన ముచ్చుమర్రి ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌లో 798 అడుగుల నీటి మట్టానికి దిగువ నుంచి కూడా ఏపీ నీరు తరలిస్తూ ఉన్నదని పేర్కొన్నారు.

కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు ఈ వివరాలను తెలియజేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాల్సిందిగా ఆ లేఖలో తెలంగాణ ఈ-ఇన్-సీ కోరారు.

Advertisement

Next Story

Most Viewed