గొల్లకురుమల్లో చిగురిస్తున్న ఆశలు

by Shyam |
గొల్లకురుమల్లో చిగురిస్తున్న ఆశలు
X

దిశ ప్రతినిధి, మెదక్: గొల్ల కురుమలు ఆర్ధికంగా ఎదగాలనే ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్ గత మూడు సంవత్సరాల క్రితం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లా కొండపాక వేదికగా నాటి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి, ప్రస్తుత ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావుతో కలిసి సీఎం కేసీఆర్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు, ఒక్క పొట్టెలు చొప్పున అందించారు. మొదటి విడతలో గొర్రెలు పంపిణీ చేయడంలో కొన్ని అక్రమాలు జరిగాయని పలువురు ఆరోపించడంతో పంపిణీకి బ్రేక్ వేశారు. మళ్లీ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గొర్రెల కోసం డీడీలు కట్టిన వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో సుమారు 20 వేల మంది లబ్ధి చేకూరగా.. రెండో విడతలో సుమారు 10 వేల మందికి లబ్ది చేకూరనుంది. ఇప్పటికే వీరంతా గత రెండు ఏండ్ల క్రితమే డీడీలు కట్టారు. ఇంకా కట్టని వారు కూడా మరో మూడు, నాలుగు వేల వరకు ఉంటారని పశు సంవర్ధక అధికారులు అంచనా వేస్తున్నారు. మొదట డీడీ కట్టిన గొల్ల కుర్మలకు సబ్సిడీ గొర్రెలు అందనున్నాయి.

75 శాతం సబ్సిడీ..

ఒక్కో గొర్రెల యూనిట్లో 20 గొర్రెలు, ఒక్క పొట్టేలు ఉంటాయి. దీనికి సుమారు రూ. లక్షా 25 వేల ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో లబ్ధిదారులు 25 శాతం వాటాగా రూ.31,250 చెల్లిస్తే 75 శాతం సబ్సిడీగా ప్రభుత్వం రూ .93,750 చెల్లిస్తుంది. గొర్రెలకు కావాల్సిన దాణా, గడ్డి విత్తనాలను అందించడంతో పాటు ప్రతి యేటా నట్టల నివారణ మందు కూడా ఉచితంగా అందిస్తుంది. వివిధ కారణాలతో మృతి చెందిన గొర్రెలకు ఇన్సురెన్స్ సౌకర్యం కూడా కల్పించింది.

పంపిణీపై ఆశలు..

రాష్ట్ర ప్రభుత్వం గొల్లకుర్మలు ఆర్ధికంగా .. ఆత్మగౌరవంతో బతకాలని గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చాలా మంది మొదటి విడతలోనే గొర్రెలు వస్తాయని అప్పులు చేసి మరీ డీడీలు కట్టారు. పలు కారణాల వల్ల చాలా మందికి గొర్రెల యూనిట్లు అందలేదు. దీంతో చేసిన అప్పులు పెరిగిపోయాయి. దీనికి తోడుమధ్యలో పలు కారణాలతో ఆగిపోవడం, మొన్నటి వరకు కరోనా లాక్‌డౌన్ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల యూనిట్లను పంపిణీ చేయలేదు. దీంతో గొల్లకుర్మలు చాలా ఆర్ధికంగా నష్టపోయి అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డారు. గ్రహించిన సీఎం కేసీఆర్ వీలైనంత త్వరగా రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో మళ్లీ గొల్ల కుర్మల ఆశలు చిగురిస్తున్నాయి. ఎప్పుడెప్పుడూ పంపిణీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పక్క జిల్లాలో పంపిణీ షూరు కాగా ఈ నెలాఖరులోగా… లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా గొర్రెల పంపిణీని ప్రారంభించేందుకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. కాగా రెండో విడతలోనైనా మొదటి విడత లాగా కాకుండా అర్హులైన వారికే గొర్రెలను అందించాలని గొల్లకుర్మల సంఘం సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed