నాడు మోడీ… నేడు కేసీఆర్

by Anukaran |
నాడు మోడీ… నేడు కేసీఆర్
X

నోట్ల రద్దు సమయంలో రోజుల తరబడి ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు క్యూ కట్టి అనుభవించిన బాధలు ప్రజలకు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు పది వేల రూపాయల వరద సాయం కోసమూ హైదరాబాద్ నగరంలో అదే సీన్ రిపీట్ అవుతోంది. మూడు రోజులుగా ‘మీ సేవ’ కేంద్రాల దగ్గర జనం బారులు తీరుతున్నారు. సాయం అందలేదుగానీ ఒక వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయింది. పలు చోట్ల కుమ్ములాటలు కూడా జరిగాయి. చివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను నిలిపివేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతీ బాధిత కుటుంబానికి గడప దగ్గరికే వచ్చి నగదు సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. అది మాటల వరకే పరిమితమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్​వెలువడిన తర్వాత కూడా బాధితుల వివరాలను ప్రభుత్వం స్వీకరించడం, సాయం అందించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. తక్షణమే ఆ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్ విడుదలతోనే నియమావళి అమలులోకి వచ్చినందున సాయం పంపిణీ దానిని ఉల్లంఘించడమే అవుతుందని కమిషనర్ పార్ధసారధి స్పష్టం చేశారు.

తొలుత ఇది కోడ్ పరిధిలోకి రాదని, ఆన్-గోయింగ్ స్కీమ్ అని పేర్కొన్నా, ఆ తర్వాత సవరించారు. దీంతో వరద సాయం పంపిణీ అర్ధంతరంగా ఆగిపోయింది. వరదలతో ఇబ్బంది పడిన బాధిత కుటుంబాల లెక్కలన్నీ తమ దగ్గర ఉన్నాయని, వారందరికీ సాయం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి కేటీఆర్ చాలా నమ్మకం కలిగించారు. నెల రోజులు దాటినా తమకు సాయం అందలేదంటూ మొరపెట్టుకునేవారి సంఖ్య వేలల్లోనే ఉంది. ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే సాయం జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బాధితులంతా అక్కడికి పరుగులు పెట్టారు. దరఖాస్తుల వెల్లువ తట్టుకోలేక కంప్యూటర్ సర్వర్ సైతం ఆగిపోయింది.

అమలుకాని నిబంధనలు

వరద సాయం పంపిణీ కోసం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించినా అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయలేదు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలైన సొమ్మునే ప్రభుత్వం నగదు రూపంలో పంచుతూ టీఆర్ఎస్ ఇస్తున్న సాయం అనే అభిప్రాయాన్ని కలిగించింది. అధికారులకు బదులుగా స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నేతలు పంపిణీ చేస్తుండడంతో ఇది పార్టీ ఇస్తున్న పచ్చనోట్లే అనే ముద్ర పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓట్లకు పంచుతున్న నోట్లు అనే విమర్శలు వెల్లువెత్తాయి.

నిజానికి వరదల కారణంగా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు ఇబ్బంది లేకుండా, నగదు ఇవ్వడం ద్వారా తక్షణం వారు నిత్యావసరాలను సమకూర్చుకోడానికి వీలుగా ఉంటుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. సుమారు నాలుగున్నర లక్షల మందికి పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పంపిణీ ప్రక్రియ ఆగిపోయిందంటూ జీహెచ్ఎంసీ అధికారులు వారం రోజుల క్రితం ప్రకటించారు. బాధితులు చాలామంది జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు, ఎమ్మెల్యేల ఇండ్ల ముందు నిరసన చేయడంతో ప్రభుత్వం గడువు పొడిగించింది. దీపావళి పండుగ సమయానికి ముగిసిపోయినట్లు ప్రకటించింది. ప్రజల నుంచి నిరసనలు, వ్యతిరేకత ఆగకపోవడంతో ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టత ఇచ్చింది.

పరిశీలన లేకుండానే

సోమవారం ఒక్క రోజే రూ.55 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళ, బుధవారాలలోనూ దరఖాస్తు చేసుకోవడం ఆగలేదు. ఎలాంటి పరిశీలన లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి పది వేలు మంజూరవుతున్నాయనే అభిప్రాయం రావడంతో ప్రజలు లక్షల సంఖ్యలోనే క్యూ లైన్లలో నిలబడడం మొదలుపెట్టారు. ఒక్క రూపాయి దరఖాస్తు ఫారం 20 రూపాయలకు, రూ.45 సర్వీసు చార్జి రూ.150 వరకూ పెరిగింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ అవకతవకలను నిలువరించడంలో విఫలమైంది.

ఇప్పటికీ ఎంతమందికి సాయం అందిందో, ఇంకా ఎంతమందికి అందాల్సి ఉందో ప్రభుత్వం లెక్కలను వెల్లడించడంలేదు. ఈ ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా అమలు చేయలేకపోయిది. వరదలకు ఇబ్బంది పడని కుటుంబాలకు సైతం స్థానిక అధికార పార్టీ నేతలు నగదు సాయం అందించడంతో నిజమైన బాధితులకు సాయం అందకుండా పోయింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ పథకం అర్ధంతరంగా ఆగిపోవడంతో బాధితులకు ప్రభుత్వం సాయం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల్లో అధికార పార్టీకి ఇది ఎలాంటి ఇబ్బంది కలిగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed