- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంట్రాక్టర్లకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్..
దిశ, లోకేశ్వరం: గతంలో కాంట్రాక్టర్ అంటే సమాజంలో పలుకుబడి, పరువు మర్యాదలు ఉండేవి. కాంట్రాక్ట్ పనుల కోసం డబ్బులు వడ్డీకి ఇచ్చేందుకు వరుసలో ఉండి ఎర్ర తివాచీ పరిచేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం వల్ల కాంట్రాక్టర్ల పరిస్థితి విపరీతంగా దిగజారిపోయింది. అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్తే వామ్మో.. కాంట్రాక్టర్ అప్పు ఇచ్చేది లేదని ముఖం మీదే చెప్పేస్తున్నారు. తెలంగాణలో కాంట్రాక్టర్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు.
నిర్మల్ జిల్లాలో రూ.800 కోట్లు పెండింగ్
గత కొంత కాలంగా ప్రభుత్వం ఆర్థిక శాఖపై అడుగడుగునా ఆంక్షలు విధిస్తుండటంతో నేటి వరకు జిల్లాలో దాదాపు రూ.800 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. ముఖ్యంగా రోడ్లు భవనాలు, మిషన్ కాకతీయ, నీటిపారుదల శాఖ, ఉపాధి హామీ, తదితర శాఖల నిధులతో చేపట్టిన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లులు గత నాలుగైదు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యారు. దీంతో కొంతమంది కాంట్రాక్టరు స్థిరాస్తులు అమ్మి అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నారు. గత 20 ఏళ్లుగా కాంట్రాక్టర్‌గా చేస్తున్నా ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎన్నడూ చూడలేదని పలువురు కాంట్రాక్టర్లు కన్నీటిపర్యంతమయ్యారు.
నిలిచిపోతోన్న నిర్మాణాలు
మరోవైపు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో పలువురు కాంట్రాక్టర్లు నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపి వేసినట్లు ఓ కాంట్రాక్టర్ ‘దిశ ప్రతినిధి’తో తెలిపారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తుండటంతో పనులు వేగవంతంగా చేపట్టాలని కాంట్రాక్టర్ల పై ఒత్తిడి చేయలేక పోతున్నట్లు ఒక ప్రభుత్వ అధికారి ‘దిశ’తో చెప్పారు.
చిక్కుల్లో చిన్న కాంట్రాక్టర్లు…
కాంట్రాక్ట్ పనులు చేపడితే కాస్తంత అయినా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చనే అభిప్రాయంతో బినామీ పేర్లతో పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉన్న ఆస్తిని కుదువబెట్టి అప్పుతెచ్చి చిన్న చిన్న పనులు చేపట్టిన చోటా కాంట్రాక్టర్లు బిల్లుల కోసం సంవత్సరాల కొద్ది ఖజానా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కొందరు పలుకుబడి ఉన్న కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖలో ముడుపులు ముట్టజెప్పి బిల్లులు పొందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇకనైనా కాంట్రాక్టర్ల బాధలు గుర్తించి ప్రభుత్వం నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.
అప్పులు తెచ్చి పనులు చేపడుతున్నాం…
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టాను. ఇప్పటివరకు కోట్లాది రూపాయలు అప్పు తెచ్చి పనులు చేశాను. కానీ ఇంతవరకు ఎలాంటి బిల్లులు ప్రభుత్వం నుండి రావడం లేదు. నిర్మాణాలను మధ్యలో ఆపేయాలంటే మనసొప్పడం లేదు. ఇలాగే బిల్లుల చెల్లింపులో ఆలస్యమైతే వచ్చిన లాభం వడ్డీకే సరిపోయేలా లేదు. భవిష్యత్తులో కాంట్రాక్టు పనులు చేయాలంటేనే భయం వేస్తోంది. ఇలాగైతే మన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోంది. నాలాంటి క్లాస్ వన్ కాంట్రాక్టర్ అప్పులపాలు అయితే చిన్న కాంట్రాక్టర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇకనైనా ప్రభుత్వం గుర్తించి బిల్లులను వెంటవెంటనే ఇవ్వాలి.
-కామన్న పటేల్, కాంట్రాక్టర్