కరోనా సాయం కింద పాలమూరుకు రూ.139 కోట్లు

by Shyam |   ( Updated:2020-03-26 01:40:22.0  )
కరోనా సాయం కింద పాలమూరుకు రూ.139 కోట్లు
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా నియంత్రణ చర్యలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు రూ.139 కోట్ల నిధులు రానున్నాయి. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలు ఎవ్వరు బయటకు రాకుండా ఉండేందుకు, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు తెల్ల‌రేషన్ కార్డు
ఉన్న ప్రతి ఒక్కరికీ 12 కేజీల బియ్యంతోపాటు సరుకుల కొనుగోళ్ళు కోసం రూ.1500 ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ డబ్బులను ఎవ్వరి ద్వారా పంపిణీ చేస్తారనేది మాత్రం ఇంకా నిర్ధారించలేదు. జిల్లా అధికారుల లెక్కల ప్రకారం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా యూనిట్ గా తీసుకుంటే మొత్తం 9,30,054 తెల్లరేషన్‌కార్డు దారులు ఉన్నారు. వీరి కోసం 3,59,88,876 కేజీల బియ్యం అవసరం. రూ.139,50,81,000 నగదు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించి రెండు రోజులు గడుస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఈ నిధులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, వీటిని రేషన్ డీలర్ల ద్వారానే పంపిణీ చేస్తారా లేక రెవెన్యూ శాఖ అధికారులకు ఆ బాధ్యతలను అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే గ్రామాల్లో కూడా పనులు పూర్తిగా నిలిచిపోవడంతో చాలా మంది ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం పనులు కూడా నిలిచిపోయ్యాయి. అదే సమయంలో ప్రస్తుతం వ్యవసాయ పనులు కూడా ఏమి లేకపోవడంతోపాటు బయటకు వెళ్ళి ఏదైనా పని చేసుకుందామన్నా అలాంటి పరిస్థతి లేకపోవడంతో ప్రభుత్వ సాయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Tags: mahaboobnagar, corona funds, white rationcardholders, revenue department

Advertisement

Next Story

Most Viewed