- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ సర్కార్ రికార్డు.. చెట్ల నరికివేతలో ఫస్ట్.. షాకింగ్ లెక్కలు బట్టబయలు
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 31,019 ఎకరాల అటవీ ప్రాంతం మాయమైంది. దానిని ఇతర అవసరాలకు డైవర్ట్ చేశారు. మరో 8,191 ఎకరాల అటవీ ప్రాంతాన్నీ వినియోగించుకుంటామంటూ 57 ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపంది. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 48,526 ఎకరాలు ధ్వంసమైతే ఆ తర్వాతి స్థానం తెలంగాణే కావడం గమనార్హం. చెట్ల నరికివేతలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉండటం గమనార్హం. రెండేళ్ల (2019-21) వ్యవధిలోనే 1,584 ఎకరాల అటవీ భూమి ఇతర అవసరాలకు మళ్లీ డీగ్రేడ్ అయింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి అవసరాల కోసం భారీ సంఖ్యలో చెట్లు నరికివేశారు. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ సైతం దీన్ని ధ్రువీకరించింది. 2015 ఏప్రిల్ మొదలు 2020 మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రంలో మొత్తం 16,51,408 చెట్లను నరికినట్లు లెక్క తేలింది. ఇవన్నీ అభివృద్ధి అవసరాల కోసం నరికినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో నరికివేతకు గురైన మొత్తం 16.51 లక్షల చెట్లలో 2017-19 మధ్యకాలంలోనే 11.80 లక్షలు ఉన్నాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మూడింట రెండు వంతుల చెట్లు ధ్వంసమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన సోషియో ఎకనమిక్ ఔట్‌లుక్ 2015 ప్రకారం రాష్ట్రంలో సుమారు 27.43 లక్షల హెక్టార్ల అడవి ఉన్నదని, ఇది మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో 23.89%. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్టు రిపోర్టు సైతం 2015 గణాంకాల్లో దీన్నే ప్రస్తావించింది. ప్రతి రెండేళ్ళకోసారి ఉపగ్రహాల ద్వారా జరిపే సర్వే ప్రకారం చూస్తే 2017 నాటి నివేదికలో ఇది 23,08,800 హెక్టార్లకు తగ్గింది. మొత్తం విస్తీర్ణంలో 20.60%కి పడిపోయింది. 2019 నివేదిక నాటికి అడవి మరింతగా క్షీణించి 20,58,200 హెక్టార్లకే పరిమితమైంది. మొత్తం విస్తీర్ణంలో 18.36 శాతానికి దిగజారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదేళ్లలో అటవీ విస్తీర్ణం 5.53% (6,84,800 హెక్టార్లు) మేర తగ్గిపోయింది.
ప్రాజెక్టులకే సింహభాగం..
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకే అటవీ భూములు ఎక్కువగా డైవర్ట్ అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7,551 ఎకరాల అటవీ భూమి దురాక్రమణకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అడవితో పోలిస్తే పచ్చదనం పెరిగినా ఏపుగా పెరిగిన చెట్లు మాత్రం దాదాపు 8,648 ఎకరాల్లో మాయమైనట్లు తేలింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో జరిగిన ఫారెస్టు సర్వే వివరాలతో పోలిస్తే 2019 నివేదికలో అటవీ విస్తీర్ణం 728 చ.కి.మీ. మేర పెరిగినట్లు తేలినా ‘ట్రీ కవర్’ మాత్రం 35 చ.కి.మీ. మేర తగ్గింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం సుమారు 25% ఉన్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా సర్వే నివేదిక ప్రకారం అది 18.36% ఉన్నట్లు తేలింది. రాష్ట్రం ఏర్పడేనాటికి మొత్తం అటవీ విస్తీర్ణం 20,419 చ.కి.మీ. ఉంటే 2019 సర్వే నివేదిక ప్రకారం 163 చ.కి.మీ. మేర పెరిగి 20,582 చ.కి.మీ.కు చేరుకున్నది. కానీ చెట్లు మాత్రం పెరగలేదని తేలింది.
7.12 లక్షల ఎకరాల అటవీభూమి కబ్జా..
అటవీ భూముల కబ్జా మాత్రం తగ్గలేదు. రాష్ట్రం ఏర్పడే నాటికి 7.12 లక్షల ఎకరాల మేర అటవీ భూమి కబ్జాకు గురైనట్లు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో ఏడున్నర వేల ఎకరాలు కబ్జాకు గురైంది. ఒకవైపు పోడు భూములకు పట్టాలు ఇచ్చే అంశం తేలకపోగా అటవీ భూమి కబ్జాకు గురైనట్లు ప్రభుత్వమే గుర్తించడం విశేషం. దురాక్రమణ జరగకుండా నివారించడంలో ప్రభుత్వం విఫలం కాగా అడవిని ఇతర అవసరాల కోసం వాడుకోవడంతో చెట్లు మాయమవుతున్నాయి.
మరింత విధ్వంసానికి ప్లాన్..
ఒకవైపు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటూనే ఇప్పటివరకు వాడుకున్న అటవీ భూమికి తోడు ఇంకా కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతూ ఉండడం విశేషం. ఎక్కువగా సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్, థర్మల్ ప్రాజెక్టు అవసరాలకే అటవీ భూమిని ప్రభుత్వం కోరుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మొత్తం 157 అవసరాలకు 12,553 హెక్టార్ల భూమిని వాడుకున్నది. ఇందులో సాగునీటి ప్రాజెక్టుల కోసం, రిజర్వాయర్ల కోసం మొత్తం 9,970 ఎకరాలు వాడుకోగా, సింగరేణి అవసరాల కోసం మరో 6,949 ఎకరాలు డైవర్ట్ అయింది. వీటికి తోడు తాగునీటి అవసరాల కోసం పైప్‌లైన్ల నిర్మాణానికి, భారత్ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్టులో భాగంగా ఓఎఫ్‌సీ లైన్లు వేయడానికి, రోడ్ల నిర్మాణానికి మిగిలిన అటవీ భూమి డైవర్ట్ అయింది.
రాష్ట్రం ఏర్పడేనాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన అటవీ విస్తీర్ణం 68.41 లక్షల ఎకరాలు. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఫారెస్టు సర్వే లెక్కల ప్రకారం 2019 చివరి నాటికి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 50.85 లక్షల ఎకరాలుగా తేలింది. దాదాపు 17.55 లక్షల ఎకరాల మేర తగ్గింది. రాష్ట్రం ఏర్పడే నాటికే 7.12 లక్షల ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైనట్టు అప్పటి ప్రభుత్వమే గుర్తించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6.84 లక్షల ఎకరాల అడవి ధ్వంసమైంది. ఏడేళ్లలో మరో ఏడున్నర వేల ఎకరాలు దురాక్రమణకు గురైంది.