- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వసూళ్ళు తక్కువ.. ఖర్చు ఎక్కువ
ఆర్థిక కష్టాల్లో డిస్కంలు
ప్రత్యేక ప్యాకేజీ కోసం వెయిటింగ్
దిశ, న్యూస్‌బ్యూరో :
ఇప్పటికే వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) కష్టాలు.. కరోనా లాక్‌డౌన్‌తో డబుల్ అయ్యాయి. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాల్సి రావడంతో కొనుగోలుకు డబ్బులు వెచ్చించక తప్పడంలేదు. కానీ వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్లు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. కరెంటు రీడింగ్ తీసుకోడానికి విద్యుత్ సిబ్బంది ఇళ్లకు రావడం లేదు. గతేడాది నెలకు అయిన బిల్లును అంచనాగా తీసుకుని ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని డిస్కంలు కోరుతున్నాయి. కానీ అది ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. ఈ కారణంగా దక్షిణ డిస్కంకు మార్చి నెలలో గృహ, వాణిజ్య విద్యుత్ బిల్లులు సుమారు రూ. 600 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ. 200 కోట్లు కూడా వసూలు కాలేదు. ఉత్తర డిస్కం పరిధిలో గృహ, వాణిజ్య రంగాల బిల్లుల వసూళ్లదీ దాదాపు అదే పరిస్థితి. అయినా ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించడం, విద్యుత్ కొనుగోలుకు ఖర్చు చేయక తప్పడంలేదు.
సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా చేసే ఉత్తర డిస్కం (ఎన్‌పీడీసీఎల్)కు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు నిధులు విడుదలవుతున్నందున పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఎక్కువ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నందున ప్రభుత్వం నుంచి సకాలంలో సబ్సిడీ విడుదల కావడం కాస్త ఉపశమనం. కానీ హైదరాబాద్ సహా దక్షిణ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే సదరన్ డిస్కం (ఎస్‌పీడీసీఎల్) పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ఈ డిస్కం పరిధిలోనే ఉన్న హైదరాబాద్ నగరంలో వాణిజ్య కనెక్షన్లు, పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, లాక్‌డౌన్‌లో ఇవన్నీ మూతపడటంతో వినియోగం బాగా తగ్గిపోయింది. కాగా, ఆ ప్రభావం వసూళ్లపైనా పడింది. వసూళ్లున్నా లేకపోయినా కొనుగోళ్ళ కోసం చెల్లింపులైతే తప్పడంలేదు. వార్షిక ఒప్పందాలతో పాటు ప్రతీ వారం లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద ఖర్చు పెట్టడాన్ని వాయిదా వేసుకోలేని పరిస్థితే.. ఇప్పుడు డిస్కంలు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం.
రెండు డిస్కంలు కూడా ఏప్రిల్‌లో ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి, ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలోకి వచ్చే రాజధాని నగరం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా ఉండే హెచ్‌టీ కేటగిరీలోకి వచ్చే పారిశ్రామిక కనెక్షన్లకు మార్చిలోనే మీటర్ రీడింగ్‌లు తీసి ఫుల్ బిల్లులు వసూలు చేసింది. ఆ రూపంలో దాదాపు రూ.1000 కోట్ల మేర నిధులు సమకూరాయి. కానీ ఏప్రిల్ నెలలో పూర్తి లాక్‌డౌన్ వల్ల కొన్ని తప్ప చాలావరకు పరిశ్రమలు మూతపడ్డాయి. లాక్‌డౌన్ వల్ల పరిశ్రమలకు విద్యుత్ ఫిక్స్‌డ్ చార్జీలను ప్రభుత్వం వాయిదా వేయడంతో మార్చిలో వచ్చిన హెచ్‌టీ కనెక్షన్ల బిల్లుల మొత్తం కూడా ఏప్రిల్‌లో ఎస్పీడీసీఎల్‌కు వసూలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఆ రకంగా ఉత్తర డిస్కం కంటే దక్షిణ డిస్కం ఎక్కువ స్థాయిలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిజానికి కేంద్ర ప్రభుత్వ ‘ఉదయ్’ స్కీంలో రాష్ట్రం చేరిన తర్వాత అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ నష్టాల్లో(ఏటీ అండ్ సీ) కేవలం 9 శాతంతో మెరుగైన స్థితికి వచ్చింది దక్షిణ డిస్కం. కానీ ఇప్పుడు మాత్రం విద్యుత్ డిమాండ్ పడిపోయి విద్యుత్‌కు బిల్లులే వసూలు కాక సతమతమవుతోంది.
ఉత్తర డిస్కంలో సైతం ఎల్‌టీ కేటగిరీలో మొత్తం విద్యుత్ బిల్లులు ఏప్రిల్‌లో రూ. 200 కోట్లు వసూలు కావాల్సి ఉండగా సగం మాత్రమే వసూలైనట్టు సమాచారం. మార్చి నెల తరహాలోనే ఏప్రిల్, మే నెలల్లోనూ మీటర్ రీడింగ్ తీయకుండానే గతేడాది ఈ నెలల్లో జరిగిన వినియోగాన్ని ఆధారంగా చేసుకుని బిల్లులు చెల్లించాల్సిందిగా సూచించింది. చిరు వ్యాపారాలు, ప్రైవేటు ఉద్యోగాలు, రోజువారీ కూలీపనులు స్థంభించిపోయాయి. చేతిలో ఎలాంటి డబ్బులు లేవు. చివరకు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కూడా సగానికి పడిపోవడంతో బిల్లులు చెల్లించడానికి ఎవరూ మొగ్గుచూపలేదు. దీంతో ఆశించిన స్థాయిలో వసూలు కాక డిస్కంలు చిక్కుల్లో పడ్డాయి.
విద్యుత్ కొనకపోయినా జెన్‌కోలకు తప్పని పేమెంట్లు..
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం తక్కువగానే ఉంది. దీంతో ప్రభుత్వం 24 గంటల కరెంటు సరఫరాకు తగ్గట్టు డిమాండ్‌ను అందుకోవడానికిగాను ప్రైవేటు, ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ(జెన్ కో)లతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు భారీగా చేసుకుంది. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో విద్యుత్ డిమాండ్ పడిపోవడంతో పీపీఏలు చేసుకున్న ప్రైవేటు విద్యుత్ ఉత్తత్తి కంపెనీల నుంచి తెలంగాణ డిస్కంలు కరెంటు కొనడం దాదాపుగా ఆపేశాయి. అయినప్పటికీ పీపీఏ ఒప్పందాల ప్రకారం ఆయా జెన్‌కోలకు ప్రతి నెలా అయ్యే ఫిక్స్‌డ్ ఖర్చులను డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. అసలే విద్యుత్ డిమాండ్ పడిపోయి, బిల్లులు పూర్తిగా వసూలు కాక మూలుగుతున్న డిస్కంలకు.. జెన్‌కోలకు చెల్లించాల్సిన ఈ ఫిక్స్‌డ్ చార్జీలు తలకు మించిన భారంగా మారాయి. కేంద్రం ఆధీనంలో ఉండే సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు (సీజీఎస్) మాత్రం పేమెంట్ల విషయంలో డిస్కంలను ఇబ్బందిపెట్టకుండా కేంద్ర విద్యుత్ శాఖ కాస్త మినహాయింపు ఇవ్వడం కొంత మేరకు ఉపశమనం కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు దేశంలోని అన్ని డిస్కంలు కలిపి రూ.90 వేల కోట్లకు పైగా బకాయి పడ్డట్టు అంచనా. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన డిస్కంల బకాయిల వాటా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్ఈసీ, పీఎఫ్‌సీ ప్యాకేజీ కోసం వెయిటింగ్..
అసలే మూలిగే నక్కల్లా ఉన్న దేశంలోని ఆయా రాష్ట్రాల డిస్కంలపై లాక్‌డౌన్ రూపంలో తాటికాయ పడటంతో కేంద్రం వాటికి తక్కువ వడ్డీ సౌకర్యంతో ప్రత్యేక రుణ సదుపాయాన్ని కల్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ఈసీ, పీఎఫ్‌సీ లాంటి విద్యుత్ రంగ రుణ సంస్థలతో ప్రత్యేక లిక్విడిటీ విండో ఏర్పాటు చేయించి డిస్కంలకు భారీగా రుణాలిప్పించే ప్రయత్నంలో ఆర్బీఐ, కేంద్రం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీ విధివిధానాల రూపకల్పనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్యాకేజీ గనుక వస్తే రాష్ట్రంలోని డిస్కంలకు నిర్వహణ వ్యయం విషయంలో కాస్త ఊరట కలిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Tags: telangana, discoms, lockdown, debt relief package