బియ్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ కసరత్తు

by Shyam |
బియ్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ కసరత్తు
X

దిశ, న్యూస్ బ్యూరో: రైసు మిల్లర్ల నుంచి బియ్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. గతేడాది వానాకాలానికి సంబంధించి మిల్లర్ల నుంచి 31.61 లక్షల టన్నుల మామూలు బియ్యం రావాల్సి ఉండగా ఇప్పటికే 27.99 లక్షల టన్నులు వచ్చింది. అయితే పారాబాయిల్డ్ రైస్ విషయంలో మాత్రం మొత్తం 43.63 లక్షల టరావాల్సి ఉంఠే ఇప్పటివరకు కేవలం 9.43 లక్షల టన్నులు మాత్రమే వచ్చాయి. మిగలిన 34.59 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించే పనిని వేగవంతం చేయాల్సిందిగా ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఆగస్టు మాసం మొదలు కావడంతో రేషను దుకాణాల ద్వారా పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఇవ్వాల్సిన బియ్యం సేకరణపై పౌరసరఫరాల శాఖ అధికారులతో శనివారం సమీక్ష జరిపిన సందర్భంగా మంత్రి పై ఆదేశాలు జారీ చేశారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతీ నెలా పేదలకు రేషను దుకాణాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం మోతాదుకు ఇప్పుడు రెట్టింపు ఇవ్వాల్సి వస్తున్నందున మామూలు బియ్యాన్ని వీలైనంత తొందరగా మొత్తాన్ని సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్దిష్ట గడువు లోగానే మిల్లుల నుంచి సేకరించాలని స్పష్టం చేశారు.

ప్రతీ నెలా మొదటి పక్షంలోనే రేషను దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ ప్రక్రియను ముగించాల్సి ఉన్నందున ఈ నెలకు రేషను దుకాణాలకు చేరవేయాల్సిన బియ్యం గురించి మంత్రి సమీక్షించారు. దుకాణాల దగ్గర రేషను బియ్యానికి కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేసి లోపం జరిగినట్లయితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. చాలాచోట్ల రేషను బియ్యం పక్కదారి పడుతున్నట్లు ఇటీవల జరిగిన తనిఖీలు, సోదాల సందర్భంగా వెలుగులోకి వచ్చిందని, టాస్క్ ఫోర్స్ ఇలాంటి తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని, అలాంటి అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. ఇకపైన ప్రతీ నెలా ఇలాంటి సమీక్షా సమావేశాలు ఉంటాయని, రేషను దుకాణాల్లో బియ్యానికి ఏర్పడుతున్నకొరత, అక్రమంగా జరుగుతున్న రవాణా తదితరాలన్నింటిపై సీరియస్‌గా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story