తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: ఏ శాఖకు ఎన్ని నిధులిచ్చారంటే..!

by Anukaran |   ( Updated:2024-05-31 15:57:42.0  )
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: ఏ శాఖకు ఎన్ని నిధులిచ్చారంటే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​ రూ. 2.30 లక్షల కోట్లుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్​రావు అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్​లో గతంలో కంటే దాదాపు రూ. 48 వేల కోట్లను పెంచారు. మొత్తం రూ. 2,30,825.96 కోట్ల బడ్జెట్​లో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు కాగా క్యాపిటల్​ వ్యయం రూ. 29,046.77 కోట్లు. రెవెన్యూ మిగులు వ్యయం రూ. 6,743.50 కోట్లు చూపించగా… ఆర్థిక లోటు రూ. 45,509.60 కోట్లుగా అంచనా వేశారు.

రైతుబంధుకు రూ. 14,800 కోట్లు

రాష్ట్ర బడ్జెట్​లో అధికంగా గ్రామీణాభివృద్ధి శాఖకే కేటాయింపులు చేశారు. పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,271 కోట్లు ప్రతిపాదించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు కోసం ఈ బడ్జెట్​లో రూ. 14,800కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి రుణమాఫీ కోసం కూడా నిధులు పెట్టారు. రుణమాఫీ కోసం రూ. 5,225 కోట్లు ఇచ్చారు. ఇక వ్యవసాయ రంగానికి రూ. 25 వేల కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 1730 కోట్లు కేటాయింపులు చేశారు. సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు కేటాయించగా.. సమగ్ర భూ సర్వే కోసం ఈసారి రూ. 400 కోట్లు ప్రతిపాదించారు. ఇక ఆసరా పింఛన్ల కోసం రూ. 11,728 కోట్లను బడ్జెట్​లో ప్రతిపాదించారు.

అసెంబ్లీలో హరీష్​రావు… మండలిలో ప్రశాంత్​రెడ్డి

తెలంగాణ శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో మంత్రి హరీష్​రావు బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. బడ్జెట్​ను ప్రవేశపెట్టే ముందు మంత్రి తన్నీరు హరీష్​రావు నగరంలోని జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజలు చేసి అసెంబ్లీకి వచ్చిన ఆర్థిక మంత్రి తొలి కాపీని అసెంబ్లీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డికి అందించారు.

Advertisement

Next Story