- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఉద్యమకారుల సమావేశం’ పేరుతో మాజీ మంత్రి చంద్రశేఖర్ నివాసంలో జరిగిన సమావేశం బీజేపీ రంగు పులుముకున్నది. ఉద్యమంలో పాల్గొన్నవారందరినీ ఒక్కతాటిపైకి తేవాలని పైకి చెప్తున్నా ఆచరణలో మాత్రం అది ఒక్క పార్టీకే పరిమితమైంది. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిందో ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో అవి నెరవేరడం లేదన్న అంశంపై చర్చించుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోడానికి ఏర్పాటైన ఈ సమావేశానికి బీజేపీ నేతలే ఎక్కువ మంది హాజరయ్యారు. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంను ఆహ్వానించినట్లు ఈ సమావేశం నిర్వాహకులు చెప్తున్నా తనకు ఆహ్వానం అందలేదని ఆయన వివరణ ఇచ్చారు. హుజూరాబాద్‌లో బీజేపీ తరఫున పోటీచేస్తున్న ఈటల రాజేందర్‌ను ఒక ఉద్యమకారుడిగా గెలిపించుకోవాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది.
హుజురాబాద్‌లో ఈటల గెలుపు అంశం ప్రధానమైనదిగా ఉన్నప్పటికీ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ఉద్యమకారులంతా ఏకం కావాలని, ఒకే వేదిక మీదకు రావాలని ఈ సమావేశం పిలుపునిచ్చింది. వరుస సమావేశాల్లో ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు జరుగుతాయని, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడమే ఈ సమావేశాల లక్ష్యమని నిర్వాహకులు వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి గాదె ఇన్నయ్య, బెల్లయ్యనాయక్ తదితరులు హాజరయ్యారు. కానీ కోదండరాం, రాములునాయక్ లాంటి వారు దూరంగానే ఉండిపోయారు.
తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఆశయం కోసం ఉద్యమంచేసి సఫలీకృతం అయినా ప్రజల ఆకాంక్షలు మాత్రం ప్రస్తుత పాలనలో సాకారం కాలేదని, ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ రాజకీయ పార్టీలాగానే వ్యవహరిస్తున్నదని కపిలవాయి దిలీప్‌కుమార్ వ్యాఖ్యానించారు. వేలాది కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేసినా వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. ఈటల రాజేందర్‌ని హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిపించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. రాష్ట్ర పాలకుడు నియంతగా మారారన్నారు.
క్రింది స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకు ఉద్యమంలో పాల్గొన్న వారేనని, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా సమిష్టిగా సాగిందని, రేపటి భవిష్యత్తు కోసం పిడికిలి ఎత్తారని, కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొమ్మనకుండానే పోయేలాంటి పరిస్థితిని పాలకులు సృష్టించారని స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. ఉద్యమ ద్రోహులను, మోసకారులను అందలం ఎక్కించిన కేసీఆర్ ఉద్యమంలో కష్టపడ్డవారిపై మాత్రం కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్ ఎన్నికను ఒక అవకాశంగా తీసుకొని ప్రజాస్వామ్య వేదిక సిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొన్నవారందరినీ ఆహ్వానిస్తున్నామని, హుజురాబాద్ ఉప ఎన్నిక రాబోయే ప్రజాస్వామ్యానికి గట్టి పునాదిగా ఉంటుందన్నారు.