అమిత్ షాతో తీన్మార్ మల్లన్న భార్య భేటీ

by Shyam |
అమిత్ షాతో తీన్మార్ మల్లన్న భార్య భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న తీన్మార్ మల్లన్నపై నమోదైన కేసుల గురించి ఆయన భార్య మాతమ్మ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఆయనపై నమోదు చేసిన కేసుల వివరాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మల్లన్నపై కేసులు పెట్టి వేధిస్తున్నదని, కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నదని, ఇప్పటికే ఆయనపై 35కు పైగా కేసులు నమోదయ్యాయని అమిత్ షా కు ఆమె వివరించారు. ఒక కేసులో కోర్టు నుంచి బెయిల్ రాగానే మరో కేసు పెట్టి బైటకు రాకుండా పీటీ వారెంట్ పేరుతో మళ్ళీ జైలులోకే పంపుతున్నదని, కుటుంబం పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టిందన్న విషయాన్ని కూడా వివరించారు. ఈ మేరకు ఒక లేఖను కూడా అమిత్ షా కు అందజేశారు. ఆమె వెంట మల్లన్న సోదరుడు వెంకటేశ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళినట్లు ఎంపీ అరవింద్ మీడియాకు వివరించారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు చర్చించినట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed