జైల్లో తీన్మార్ మల్లన్న ఆమరణ దీక్ష

by Shyam |
జైల్లో తీన్మార్ మల్లన్న ఆమరణ దీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న తీన్మార్ మల్లన్న మంగళవారం రాత్రి నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నట్లు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న యూ ట్యూబ్ ఛానెల్ ‘క్యూ న్యూస్’ సిబ్బంది పేర్కొన్నారు. పోలీసులు కొత్తగా నమోదు చేస్తున్న కేసులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికే పలు కేసులు పెట్టిన పోలీసులు తాజాగా జగదేవ్‌పూర్ స్టేషన్‌లో కొత్తగా మరో కేసును పెట్టినట్లు తెలిపారు.

చిలకలగూడ పోలీసు స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో జైలు నుంచి బైటకు రాకుండా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఆయనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నట్లు సిబ్బందిలో ఒకరు ఆరోపించారు. ఈ కేసులో కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు మంగళవారం నిరాకరించడంతో బుధవారం తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్‌ విచారణకు రావాల్సి ఉన్నది. కానీ బెయిల్ మంజూరు కాకపోవడంతో ఆయన జైల్లోనే ఉన్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా ములుగు ఎమ్మెల్యే సీతక్క బుధవారం ఉదయం తీన్మార్ మల్లన్న నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను వేధిస్తున్నారంటూ ఆరోపించిన సీతక్క కాంగ్రెస్ పార్టీ తరఫున నైతిక మద్దతును తెలియజేశారు. ప్రశ్నించే గొంతును నొక్కివేసే ప్రయత్నంలో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పుతున్నట్లు ఆరోపించారు. పలు జర్నలిస్టు సంఘాలు సైతం తీన్మార్ మల్లన్నను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇంకోవైపు ట్విట్టర్ ద్వారా ‘రిలీజ్ తీన్మార్ మల్లన్న’ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో మద్దతు పలుకుతుకున్నారు నెటిజెన్లు.

Advertisement

Next Story