ఎట్టకేలకు భూమి మీదకు సునీతా విలియమ్స్.. ఎప్పుడొస్తున్నారంటే?

by D.Reddy |
ఎట్టకేలకు భూమి మీదకు సునీతా విలియమ్స్.. ఎప్పుడొస్తున్నారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: అంతరిక్ష పరిశోధనకు వెళ్లి అనుకోని పరిస్థితుల్లో గత ఎనిమిది నెలలుగా ISSలో భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్‌మోర్ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని భూమికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు పలు మార్లు నాసా చేపట్టిన అవి విఫలమయ్యాయి. అయితే, ఎట్టకేలకు ఈ వ్యోమగాములు భూమి మీదకు తిరిగి రానున్నారు. వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా (NASA) ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ సహాయం తీసుకుంటోంది. స్పేస్ ఎక్స్ 10 మిషన్ కోసం గతంలో ఉపయోగించిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను ఉపయోగించనున్నట్టు నాసా తెలిపింది.

ఇక క్రూ-10ని మార్చి 12న ప్రయోగించేందుకు నాసా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటివారంలో వీరిని అంతరిక్షం నుంచి కిందకు రప్పించేందుకు ప్లాన్ చేశారు. ప్రణాళికలో ఈ మార్పుతో సునీతా విలియమ్స్, ఆమె తోటి వ్యోమగాములను త్వరగా భూమికి తీసుకురావచ్చని అమెరికా అంతరిక్ష సంస్థ భావిస్తోంది. ఇక డ్రాగన్ వ్యోమనౌక ఇప్పటి వరకు మొత్తం 3 సార్లు అంటే క్రూ-3, క్రూ-5, క్రూ-7 మిషన్‌లలో ISSకి వెళ్లింది. ఇప్పుడు నాలుగోసారి ఈ స్పేస్‌క్రాఫ్ట్ క్రూ-10తో ప్రయాణించేందుకు సిద్ధమవుతోంది.

క్రూ-10 ISSకు చేరుకున్న తర్వాత క్రూ-9లో నాసాకు చెందిన నిక్ హైగ్, సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, రష్యాకు చెందిన అలెగ్జాండర్ గోర్బునోవ్‌ భూమికి తిరిగి రానున్నారు. అయితే అంతరిక్షంలో చిక్కుకున్న ఈ వ్యోమగాములు భూమికి తిరిగి ఎప్పుడు వస్తారనే దానిపై మాత్రం నాసా, స్పేస్​ఎక్స్​ ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు.

కాగా, సునీతా విలియమ్స్, బుచ్ మిల్ మోర్ 2024 జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అంతరిక్షానికి మానవసహిత రాకెట్ ప్రయాణానికి సంబంధించిన ప్రయోగంలో భాగంగా ఎనిమిది రోజుల టూర్ కోసం స్టార్ లైనర్ బోయింగ్ రాకెట్‌లో చేరుకున్నారు. అంతరిక్షానికి చేరుకున్న తర్వాత సునీతా బృందం ప్రయాణించిన స్టార్ లైనర్ బోయింగ్‌లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమస్యలతో అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్, విల్ మోర్ చిక్కుకున్నారు.

Next Story