మీ కారులో ఈ ఫీచర్స్ ఉంటే తోపులే!!

by Gantepaka Srikanth |   ( Updated:2024-06-09 10:59:50.0  )
మీ కారులో ఈ ఫీచర్స్ ఉంటే తోపులే!!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటోమేషన్​ ఇప్పుడు అన్ని రంగాల్లో వచ్చేస్తున్నది. అంటే మనుషుల పనులను మిషీన్లు చేసేయడమే ఆటోమేషన్​ పని. ఐటీ ఫీల్డులో ఇప్పుడు అందరికీ టెన్షన్​ పెట్టిస్తున్న ఈ ఆటోమేషన్ ఆటోమొబైల్ రంగంలో మాత్రం ఫుల్లు ఎంటర్​టైన్​ చేస్తున్నది. ఇప్పుడు కొత్తగా వస్తున్న కార్లలో ఆటోమేషన్​ టెక్నాలజీ కిర్రాక్​గా ఉన్నది.

ఆటోమేషన్​గా మారుతున్న ఆటోమొబైల్​

ఆటోమొబైల్​ రంగంలో ఆటోమేషన్​ జోరు పెరుగుతుండటం మనుషులకు అత్యంత సౌకర్యంగా మారుతున్నది. ఆటోమేషన్​లో ప్రస్తుతం ఐదు స్థాయిలకు వరకు ఉండగా ఆరోస్థాయి ప్రయోగదశలో ఉన్నది. భారత్​లో మాత్రం ఆటోమేషన్​ రెండవస్థాయి అందుబాటులో ఉన్నది. ఇప్పుడు ఆ ఆరు దశలు ఏమిటో చూద్దాం..

ఆటోమేషన్​ 0

వాహనాన్ని అన్ని దశల్లో కంట్రోల్​ చేయాల్సింది డ్రైవరే.. వాహనం ఎటువైపు మళ్లుతున్నా దృష్టిపెట్టాల్సింది డ్రైవరే.. యాక్సిలరేషన్​ ఎంత పెరగాలన్నా.. ఎప్పుడు బ్రేకులు వేయాలన్నది డ్రైవర్​ మ్యానువల్​గా కంట్రోల్​ చేయాల్సిందే.

ఆటోమేషన్​ 1

ఈ స్థాయిలో ఆటోమేషన్​ డ్రైవర్​కు హెచ్చరికలు చేస్తుంది. ఇప్పుడు 2015నుంచి వస్తున్న అన్ని మిడిల్​ రేంజ్​కార్లలో ఈ వ్యవస్థ ఉంటున్నది. అంటే కారు 80 కిలోమీటర్లకంటే ఎక్కువ స్పీడ్​లో వెళ్తుంటే కచ్చితంగా బీప్​ అలారం రావడంతోపాటు స్పీడోమీటర్​ బోర్డ్​పై ఓవర్​లిమిట్​ స్పీడ్​ ఐకాన్​ బ్లింక్​ అవుతుంది. సీట్​బెల్ట్​, కార్​ డోర్​ సరిగా పడకున్నా అలర్ట్​ వస్తుంది.

ఆటోమేషన్​ 2

ఇక్కడినుంచే అడాస్​ (ADAS) టెక్నాలజీ ప్రారంభం అవుతుంది. ఇది పూర్తిగా ఆటోమేషన్​ కాదు. కానీ పాక్షికంగా డ్రైవర్​తోపాటే కారు నడపంలో సహాయపడుతుంది. అంటే కారులో ఒక అసిస్టెంట్​ డ్రైవర్​ను పెట్టుకోవడం అన్నమాట. ఈ సిస్టమ్​ ఉన్న కార్లలో ఆటోమేషన్​ పార్ట్​ ఈ విధంగా ఉంటుంది.

కొలిషన్​ అవాయిడెన్స్​ సిస్టమ్స్​: హైవేపై కారులో వేగంగా వెళ్తున్నప్పుడు ముందు ఉన్న వాహనం సడెన్​గా ఆగితే.. ఆ సమయంలో మనం చూడకపోతే అంతే వేగంగా వెళ్లి ఆ వాహనాన్ని ఢీకొంటాం. కానీ, కొలిషన్​ అవాయిడెన్స్​ సిస్టమ్​ ఉంటే కారు దానంతట అదే వేగాన్ని తగ్గిస్తుంది. మొత్తంగా కాకపోయినా సెకన్లలో 100 నుంచి 40, 30కి వేగాన్ని తగ్గించేస్తుంది.

లేన్​ అసిస్టెన్స్​: హైవేలో ప్రమాదాలకు మూలకారణం వాహనం నడిపేవారు నిద్రమత్తులో ఉండటం. వాహనం ఒకవైపుకు వెళ్తున్నా.. నిద్రమత్తులో ఉన్నవారు దానిని గుర్తించరు. దీంతో వాహనం డివైడర్లకు, రోడ్డు పక్కన ఉన్న చెట్లను ఢీకొని ప్రమాదాలు జరుగుతాయి. అయితే, లేన్​ అసిస్టెన్స్​ ఉన్న కార్లలో వాహనం లేన్​ దాటుతున్నప్పుడు అలారం వస్తుంది. అప్పటికీ వాహనం అలానే పక్కకి వెళ్తుంటే ఆటేమెటిక్​గా బ్రేకులు వేసి కారును నెమ్మదిగా ఆపుతుంది.

ఇంటలిజెంట్​ హెడ్​ల్యాంప్​ కంట్రోల్​: రాత్రవేళ్లలో ఎదురుగా వాహనాలు వస్తున్నప్పుడు హెడ్​ల్యాంప్​ను హైబీమ్​ నుంచి లోబీమ్​కి దించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ లైట్​ ఎదురుగా వచ్చే వాహనం డ్రైవర్​ కళ్లకి పడటం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల ఎదురుగా వాహనం రాగానే డ్రైవర్​ ప్రమేయం లేకుండా హెడ్​ల్యాంప్​ లోబీమ్​కి షిఫ్ట్​ అవుతుంది. వాహనం వెళ్లిపోగానే తిరిగి హైబీమ్​కి మారుతుంది.

అడాప్టివ్​ క్రూయిజ్​ కంట్రోల్​: ఇప్పుడు హైవేలు అన్నీ వన్​వే డ్రైవ్​ కాబట్టి.. ఎదురుగా ఏదైనా వాహనం వస్తుందోనన్న టెన్షన్​ వాహనదారులకు లేకుండా పోయింది. దీంతో పెద్దగా మలుపులు లేకపోతే అడాప్టివ్​ క్రూయిజ్​ కంట్రోల్​ మోడ్​లో పెడితే 60, 70 స్పీడ్​లో లాక్​ చేస్తే అదే స్పీడ్​లో వెళ్తుంది. డ్రైవర్​ యాక్సిలర్​ పెడల్​ నుంచి కాలు తీసేసి రిలాక్స్​ కావచ్చు.

ట్రాఫిక్​ సిగ్నల్​ రికగ్నేషన్​: నగరంలో ట్రాఫిక్​ సిగ్నల్​ జంప్​ కావడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే, మనం చూడకపోయినా, ఇకపై కార్లే ఆ సిగ్నల్స్​ను గమనించి అలారం బీప్​ ఇస్తాయి.

ఆటోమేషన్​ 3

ఇప్పటికే ఈ రకం కార్లు అందరినీ ఊరిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు మార్కెట్​లోకి వస్తాయా? అని ఆత్రంగా వేచిచూస్తున్నారు. 2019లో ఆటోమేషన్​ మూడో లెవల్​ కారును జర్మనీ కంపెనీ ఆడి మార్కెట్​లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది. ఆకస్మిక ప్రమాదాలను కూడా నివారించడం ఈ కారు ప్రత్యేకత. అంటే మనం కారులో వెళ్తున్నప్పుడు సడెన్​ ఓ బైక్​ లేదా ఓ వ్యక్తి ఎదురుగా రావడంతో జరిగే ప్రమాదాలను కూడా ఈ కారు అరికడుతుంది. ఆడి A8L కారు ప్రస్తుతానికి ఆటోమేషన్​ లెవల్​ 2 గానే గుర్తిస్తున్నా ఈ టెక్నాలజీ మాత్రం దీనిని ఆటేమేషన్​ లెవల్​ 3 కారుగా గుర్తింపు దక్కించుకున్నది.

ఆటోమేషన్​ లెవల్​ 4

ఈ కారు తనంతట తానే కారును స్వయంగా నడుపుకోగలదు. ఈ కారులో యాక్సిలర్​, బ్రేకు ఉన్నా డ్రైవర్​ అవసరం ఏమాత్రం లేదు. కారులో సీటు వెనక్కి వాల్చుకుని ఎక్కడికి వెళ్లాలో డైరెక్షన్స్​ ఇస్తే చాలు కారు దానంతట అదే వెళ్తుంది. అయితే, వాహనం డ్రైవర్​ నడుపుకునే అవకాశం అయితే ఈ కారులో ఉంటుంది.

ఆటోమేషన్​ లెవల్​ 5

ఈ కారు స్పెషాలిటీస్​ మాత్రం పీక్స్​ లెవల్​లో ఉంటాయి. కారులో కనీసం స్టీరింగ్​, బ్రేకులు, యాక్సిలరీ పెడల్స్​ ఏమాత్రం ఉండవు. ఎక్కడికి వెళ్లాలో చెప్పి కారులో టీవీ చూస్తూ కూర్చోవడమే. ఈ రకం కార్లు క్యాబ్​లకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఏదిఏమైనా టెక్నాలజీ మాత్రం అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నది. అదే సమయంలో టెక్నాలజీ మనుషులను సోమరిపోతులుగా మార్చుతున్నదని మాత్రం మరిచిపోవద్దు. ఎంత టెక్నాలజీ వచ్చినా సొంతంగా తన పనులు తాను చేసుకోవడం మరిచిపోనంతకాలం టెక్నాలజీ మనిషికి బానిస అవుతుంది.. లేకపోతే టెక్నాలజీకి మనషులు బానిసలు కావాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed