Disha Special: మానవాళికి AI.. వరమా? శాపమా? చైనా జోరు పెరిగితే మనుషులు జూలో ఉన్నట్లేనా!

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-28 10:06:33.0  )
Disha Special: మానవాళికి AI.. వరమా? శాపమా? చైనా జోరు పెరిగితే మనుషులు జూలో ఉన్నట్లేనా!
X

మారుతున్న పరిస్థితులను బట్టి చూస్తే రానున్న రోజుల్లో రోబోలే రాజ్యాలను ఏలడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రమాద ఘంటికలు మోగించాడు. పెరిగిపోతున్న కృత్రిమమేధ సంస్కృతి మానవాళికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని తెలిపాడు. భూమ్మీద ఉన్న మానవులందరి తెలివిని కలిపినా ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​ముందు దిగదుడుపేనని త్వరలోనే ఈ ఫలితాన్ని చూస్తారని హెచ్చరించాడు. కానీ నిజంగా కృత్రిమమేధ విలువలు, నిజానిజాలతో పని చేయగలదా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోలు హల్ చల్ చేస్తుండగా.. ఫొటో నుంచి వీడియో.. న్యూస్ రీడింగ్ మాత్రమే కాకుండా పిల్లల హోమ్​వర్క్​కూడా వారి సొంత చేతిరాతతో కూడా కృత్రిమమేధ సిద్ధం చేస్తున్నది. ఇలా అన్నింటా AI పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చింది. కాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో డెవలప్ చేసిన లేటెస్ట్ టెక్నాలజీ, దాని వినియోగం గురించి తెలుసుకుందాం. - సుజిత

పోటీతత్వంతో ఆటోమేషన్​

ఆటోమేటెడ్ రోబోలతో ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌లో మాన్యుఫాక్చరింగ్ రీషేప్ జరుగుతున్నది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, అమెరికా వంటి దేశాలు అధునాతన రోబోలను తయారుచేయడంలో ముందున్నాయి. రోబోలు ఇప్పటికే కొన్ని దేశాలలో ఆధిపత్య శక్తిగా ఉన్నాయి. ఈ దేశాలు ఆటోమేషన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. వేగంగా మారుతున్న ప్రపంచ మార్కెట్‌లో పోటీతత్వాన్ని జోడిస్తూ.. తయారీ రంగంలో ఉత్పాదకత, కచ్చితత్వం, కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడానికి వీలు కల్పిస్తున్నాయి. చైనాలోని పలు మొబైల్​సంస్థలు పూర్తి ఆటోమేషన్​సాధించాయి. ఇటీవల కొన్ని నిమిషానికో ఫోన్​ఉత్పత్తి చేస్తూ ప్రత్యర్థి కంపెనీలకు సవాల్​విసురుతున్నాయి.

దేశం రోబోలు సంఖ్య

అమెరికా

3,42,000

జర్మనీ

2,90,500

ఇటలీ

87, 600

ఫ్రాన్స్

54,000

కెనడా

35,640

స్విట్జర్లాండ్

23,680




(2013లో చైనాలోని పరిశ్రమల్లో 10వేలమంది కార్మికులకు ఒక రోబో ఉంటే.. 2017కల్లా ఆ సంఖ్య 97కి పెరిగింది. 2023కి అది 392కి చేరింది. ప్రస్తుతం ప్రతి పరిశ్రమలో దాదాపుగా 52% ఇండస్ట్రియల్​రోబోలు పనిచేస్తున్నాయి. భవిష్యత్​లో 100శాతానికి చేరినా ఆశ్చర్యం లేదు)

డాక్టర్ ఆఫీసు

యూఎస్‌కు చెందిన ఫార్వర్డ్ హెల్త్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ ఆఫీసును లాంచ్ చేసింది. కేర్ పాడ్స్ గా పిలవబడుతున్న వీటిని మాల్స్, ఆఫీసు బిల్డింగ్స్ లాంటి ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. పూర్తిగా కృత్రిమమేధతో నిర్వహిస్తున్న ఈ పాడ్స్ యూజర్లను సెల్ఫ్‌గా హెల్త్ టెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. మెడికల్ స్టాఫ్ లేకుండానే బ్లడ్ శాంపిల్స్​కలెక్ట్ చేయడం, బీపీ చెక్ చేయడం లాంటివి చేస్తుంది. వెంటనే రిజల్ట్స్ ఇచ్చి.. ప్రిస్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఇందుకోసం నెలకు దాదాపు రూ.8000 చెల్లించాల్సి ఉంటుంది. 100 మిలియన్ డాలర్ల ఫండింగ్ తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ.. ఏడాదిలో 3,200 కేర్ పాడ్స్ సెట్ చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నది. దీంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా డాక్టర్​అపాయింట్​మెంట్​తీసుకోవడం దానికోసం ఒకరోజు లేదంటే కనీసం ఒకపూట సమయం వృథా చేసుకునే బాధలు తప్పుతాయి.

https://www.instagram.com/p/C-6GFH_h2QP/?igsh=dTJ1dHZrdnFtYTJm

యుద్ధక్షేత్రంలోనూ..

భవిష్యత్తులో అన్ని యుద్ధాల్లోనూ కృత్రిమమేధ ఆధిపత్యం చెలాయించబోతున్నదని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే డ్రోన్​వంటి మానవరహిత విమానాలను కంట్రోల్​రూమ్​నుంచి ఆపరేట్​చేస్తూ నిఘా సమాచారం సేకరించడంతోపాటు బాంబింగ్​కూడా చేస్తున్నారు. ఇటీవలే అమెరికా సిమ్యులేటెడ్ ఎయిర్ కంబాట్‌లో మానవ పైలట్‌తోపాటు AIని పరీక్షించింది. AI- కంట్రోల్డ్ X-62A రోబోటిక్ జెట్ హ్యూమన్-పైలట్ F-16 కంటే మెరుగైన పనితీరును సైతం కనబర్చడం విశేషం. ఇకపై యుద్ధాల్లోనూ, టెర్రరిస్టుల ఏరివేతలోనూ రోబోలను వినియోగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆర్మీలోనూ జనరల్​ డ్యూటీలాంటి క్షేత్రస్థాయి ఉద్యోగాలకు భారీగా కోత పడనున్నది.

https://www.instagram.com/p/C-z7KPGvkCD/?igsh=MW5scXR5enc5bjYwNA%3D%3D

కృత్రిమ వర్షం..

అరిడ్ జిన్‌జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్‌లో హైటెక్ TB-A డ్రోన్‌లను ఉపయోగించి చైనా ప్రతిష్టాత్మకమైన క్లౌడ్-సీడింగ్ ట్రయల్‌ను ప్రారంభించింది. ఈ డ్యూయల్- యూజింగ్ డ్రోన్‌లు... గతంలో నిఘా కోసం మోహరించబడ్డాయి. ప్రస్తుతం హమీలోని కరువు పీడిత డోంగ్టియన్ పర్వత ప్రాంతంలో వర్షపాతాన్ని ప్రేరేపించడానికి దీనికే వెండి ఐయోడైడ్ రాడ్‌లను అమర్చారు. ఈ 45-రోజుల ట్రయల్ వాతావరణ మార్పు కోసం మానవరహిత వైమానిక వాహనాల వినియోగంలో భారీ పురోగతిని సూచిస్తుంది. ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న తీవ్రమైన నీటి కొరతను తగ్గించడమే లక్ష్యంగా పని చేస్తున్నది. ఇప్పటికే రైతులు పొలాల్లో పురుగుల మందు చల్లడానికి డ్రోన్లసాయం తీసుకోవడం తెలుగురాష్ట్రాల్లోనూ అడపాదడపా కనిపిస్తూనే ఉన్నది.

https://www.instagram.com/p/C-blmYaPvs0/?igsh=cnMxbDQ1cW04bXly

ఫిజికల్ యాక్టివిటీ..

Google DeepMind కు చెందిన AI రోబోట్ ఇప్పుడు మానవుడి మాదిరిగానే టేబుల్ టెన్నిస్ ఆడగలిగే స్థాయికి చేరుకుంది. ఈ డెవలప్మెంట్ క్విక్ రియాక్షన్స్, కచ్చితమైన కదలికలు అవసరమయ్యే ఫిజికల్ యాక్టివిటీని మాస్టరింగ్ చేయడంలో AI సామర్థ్యాలను పెంచుతుంది.

https://www.instagram.com/reel/C-fqGlpvYd9/?igsh=ZWNyc2duZGMzb3Bh

మనం జంతువులమే..

Gmail క్రియేటర్ పాల్ బుచ్చేయిట్ ప్రపంచ దేశాలకు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. AI రేస్ లో చైనా ముందున్నట్లయితే.. మనుషులను జంతువులుగా జూలో బంధించినట్లు బంధిస్తుందని హెచ్చరించాడు. ఇది లైఫ్ టైం లాక్ డౌన్ అవుతుందని.. బయటకు వచ్చే చాన్స్ ఉండదని అభిప్రాయపడ్డాడు. అంతెందుకు మన ఆలోచనలు కూడా నియంత్రించబడుతాయని, సెన్సార్ చేయబడతాయని చెప్పాడు. ఎలాన్​మస్క్​రూపొందించిన న్యూరాలింక్​ప్రోగ్రాం మనిషి మెదడును నియంత్రించే అవకాశం ఉండటంతోనే పాల్​ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే, టెక్నాలజీ గతంలో పోల్చితే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పాల్​భయాలు నిజాలు అయ్యే ప్రమాదం లేకపోలేదని టెక్​నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిజంగా కృత్రిమ మేధ మానవాళిని ఇంత చీకటి మార్గంలోకి తీసుకెళ్తుందా? లేక మనమే ఎక్కువ భయపడుతున్నమా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

https://www.instagram.com/p/C-nfaQOPKAs/?utm_source=ig_web_copy_link

కృత్రిమమేధతో లాభాలు

లాభాలు, నష్టాలు మాట ఎలా ఉన్నా.. నిపుణులైన మానవ వనరుల కొరత అందులోనూ భారీ వ్యయాలు, ఇతర భత్యాలు ఇచ్చేకన్నా చౌకగా అందుబాటులోకి వస్తున్న కృత్రిమమేధ ఎంతో మేలని 2015నుంచే మల్టీనేషనల్​కంపెనీలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కరోనా తదనంతర పరిణామాలను కంపెనీలు అనువుగా మార్చుకుని ఉద్యోగులనుంచి ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఆటోమేషన్​ను ఇబ్బడిముబ్బడిగా పెంచేశాయి. వినియోగదారుల్లోనూ మానవవనరులతోకంటే కృత్రిమమేధతో పనులు చేయించుకోవడం సులువుగా ఉందని ఫీడ్​బ్యాక్​కూడా ఇవ్వడం కంపెనీలకు కలిసివచ్చింది. దీంతో ప్రతి సంస్థ కాల్​సెంటర్ల స్థానంలో చాట్​బాట్​లను అందుబాటులోకి తెచ్చాయి. పైగా ఆటోమేషన్​లో వర్షన్​అప్​డేట్​కూడా అత్యంత సులువు కావడంతో మానవవనరులకు ఈ విభాగంలో చాలా కోతలు పడుతున్నాయి.

మానవ తప్పిదాలకు చెక్​

ఎంతటి నిపుణులైనా మానవ తప్పిదాలు సహజం. అయితే, ఆటోమేషన్​లో ఇది దాదాపుగా సున్నా అని చెప్పుకోవచ్చు. పైగా ఉద్యోగుల ప్రాణాలకు ముప్పును కూడా దాదాపుగా తప్పించడానికి ఆటోమేషన్​ఉపయోగపడుతున్నది. రేడియేషన్​అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ ఇప్పటివరకు మనుషులే పనిచేశారు. వారి ఆరోగ్యం, ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా.. చేయాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు రోబోలు ఆ పనులను సులువుగా చేసేస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా.. రోబోను రిపేర్​చేయించడం పెద్ద కష్టమైన పనేమీ కాదన్నది వ్యాపారులు చెప్తున్న మాట.

24/7 అందుబాటులో..

ఉద్యోగం అంటే సాధారణంగా 8 గంటల పని. వారానికి రెండు రోజులు సెలవు ఇచ్చే సంస్థల్లో రోజూ 9గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంతకుమించి పనిచేయించాల్సి వస్తే వారికి ఆహారం, ట్రాన్స్​పోర్ట్​తోపాటు అలవెన్సులూ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, రోబోలకు ఆ అవసరమేమీ ఉండదు. వారంలో 24/7 అందుబాటులో ఉంటాయి.

పక్షపాతాలకు తావులేదు..

మానవులు తాము తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడో ఒక చోట ఎంతోకొంత పక్షపాతం చూపడం సహజం. కానీ, రోబోలకు ఆ అవసరం ఉండదు. 100%పక్షపాతరహితంగా తనకు అప్పగించిన పనులు చేస్తుంది.

బోరింగ్​జాబ్​లకు బెస్ట్​చాయిస్​

కొన్ని ఉద్యోగాలు ఒకేపనిని వందలు, వేలసార్లు చేయాల్సి ఉంటుంది. డేటా అనలైజ్​చేయడం, రిపోర్టులు తయారు చేయడం, సమాచారాన్ని నిర్ధారించుకోవడంవంటి పనులు అత్యంత బోరింగ్​జాబ్​లుగా నిపుణులు చెప్తారు. ఇలాంటి విభాగాల్లో ఉద్యోగాలు చేయడంపై చాలామంది అనాసక్తిగా ఉంటారు. అయితే, ఇలాంటి పరిస్థితులకు ఆటోమేషన్​అద్భుతమైన చాయిస్​గా నిపుణులు చెప్తున్నారు.

ఏఐతో నష్టాలు

ఖరీదైన వ్యవహారం

కృత్రిమ మేధ సంచనాలను సృష్టిస్తున్నదని ప్రపంచంలోని అన్ని కంపెనీలు ఒప్పుకుంటున్నా.. వాటిని అమలుచేయడంలో మాత్రం వెనుకాడుతున్నాయి. అందుకు ఏకైక కారణం.. కృత్రిమమేధను కొనుగోలుచేసేందుకు అవుతున్న ఖర్చు. దాని నిర్వహణ కూడా అత్యంత ఖరీదైన వ్యవహారం. దాదాపుగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలకు కనీసంగా రూ.16 లక్షలనుంచి గరిష్ఠంగా వందలకోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఉద్యోగులను తీసేయడం వల్ల వచ్చే లాభంకంటే ఏఐని తీసుకుంటే వచ్చే ఖర్చే అధికంగా ఉన్నదని కొందరు సీఈవోలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం కొసమెరుపు.

క్రియేటివిటీకి చోటులేదు..

రోబోలు కృత్రిమంగా పనిచేస్తాయి. అల్గారిథమ్, ప్రోగ్రామ్​చేసిన మేరకే పనిచేస్తాయి. తప్ప క్రియేటివ్​ఆలోచనలు చేయడం ప్రస్తుతానికైతే దాదాపుగా శూన్యం. మనుషులతో పనిచేసినప్పుడు కలిగే భావోద్వేగాలు, సృజనాత్మకత యంత్రాలతో పనిచేసినప్పుడు రావడం అసాధ్యమే. నవల రాసేందుకు గూగుల్​లో అందుబాటులో ఉన్న ఐడియాలను ఇస్తుందే కానీ, సొంతంగా నవల రాయడం ఆటేమేషన్​వల్ల కాదు.

అనుభవం శూన్యం

మనుషులకు పనిలో వచ్చే అనుభవం అపారం. కానీ, రోబోలకు ఆ పరిస్థితి ఉండదు. కీలకమైన విషయాల్లో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడంలో మనుషులకు ఉన్న వెసులుబాటు యంత్రాలకు ఉండదు.

Advertisement

Next Story