- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమ్ ఇండియా ఇంగ్లాండ్ ప్రయాణం రేపే ..
దిశ, స్పోర్ట్స్ : ఒక్క పర్యటన.. రెండు టాస్కులు. టీమ్ ఇండియా బుధవారం బీసీసీఐ అరేంజ్ చేస్తున్న చార్టెడ్ ఫ్లైట్‌లో ఇండియా వదలి ఇంగ్లాండ్ గడ్డ మీదకు అడుగు పెట్టబోతున్నది. మూడున్నర నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ పర్యటనలో భారత జట్టు ముందు రెండు టాస్కులు ఉన్నాయి. మొదటిది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ గెలవడం.. రెండవది ఇంగ్లాండ్ జట్టును వారి గడ్డపైనే ఓడించడం. ఐసీసీ నిర్వహిస్తున్న అరంగేట్రం టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజీలాండ్‌తో తలపడనున్నది జూన్ 18 నుంచి 22 వరకు జరుగనున్న ఈ ఏకైక మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధిస్తే అది ఒక చరిత్రే అవుతుంది. ఇక గత 14 ఏళ్లుగా ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ గెలవలేదు. అందుకే ఈ మూడున్నర నెలల పర్యటన భారత క్రికెట్ జట్టుకు చాలా కీలకమైనది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ భవిష్యత్‌ను కూడా ఈ పర్యటన నిర్ణయించనున్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఫస్ట్ టాస్క్ కోహ్లీకే..
డబ్ల్యూటీసీ ఫైనల్ టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పెద్ద టాస్క్‌గా నిలవనున్నది. డిసెంబర్ 2014లో టెస్టు కెప్టెన్సీ, జనవరి 2017లో పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. కోహ్లీ హయాంలో భారత జట్టు నెంబర్ వన్ టెస్ట్ జట్టుగా ఎదిగింది. ప్రస్తుతం కూడా భారత జట్టు టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ 1 జట్టుగానే ఉన్నది. మరోవైపు పరిమిత ఓవర్లు క్రికెట్‌లో కూడా భారత జట్టు స్వదేశంలోనే కాకుండా విదేశీ గడ్డపై కూడా చెప్పుకోదగిన విజయాలే సాధించింది. టీమ్ ఇండియాకు ధోనీ తర్వాత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఏడేళ్లుగా భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ఖాతాలో ఇంత వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదంటే నమ్మశక్యం కాదు. కానీ అది నిజమే.. కోహ్లీ నేతృత్వంలో టీమ్ ఇండియా టీ20, వన్డే వరల్డ్ కప్‌లతో పాటు చాంపియన్స్ లీగ్ కూడా ఆడింది. కానీ ఏ ఒక్క టైటిల్ గెలవలేదు. 2011లో ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు చివరి సారిగా ఐసీసీ టైటిల్ గెలిచింది. 2018లో ఐసీసీలోని మూడు ప్రతిష్టాత్మక అవార్డులు ఒకే సారి గెలిచిన కోహ్లీ.. ఐసీసీ ట్రోఫీని మాత్రం తన కెప్టెన్సీలో గెలవలేక పోయాడు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ రూపంలో కోహ్లీకి మంచి అవకాశం వచ్చింది. ఇంగ్లాండ్‌లో జరుగనున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కోహ్లీ ఖాతాలో ఐసీసీ టైటిల్ చేరడమే కాకుండా.. టీమ్ ఇండియా ప్రతిష్ట అమాంతం పెరగనున్నది.
ఇంగ్లాండ్ సిరీస్ మరో టాస్క్..
కోహ్లీ సేన ముందు ఉన్న మరో టాస్క్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన ఐదు వారాల తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్నది. భారత జట్టు చివరి సారిగా 2007లో టెస్ట్ సిరీస్ గెలిచింది. అప్పటి నుంచి మూడు సార్లు భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. 2011లో వన్డే ప్రపంచ కప్ గెలిచిన వెంటనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి 0-4తో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత 2014లో మరోసారి పర్యటనకు వెళ్లింది. ఆ సిరీస్‌లో 3-1 తేడాతో ఓడిపోయింది. కోహ్లీ కెప్టెన్సీలో 2018లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. తొలి టెస్టు గెలిచి 1-0 ఆధిక్యంలోకి దూసుకొని వెళ్లింది. కానీ తర్వాత నాలుగు మ్యాచ్‌లు కూడా ఓడిపోయి సిరీస్ కోల్పోయింది.
మూడేళ్ల తర్వాత భారత జట్టు మరోసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్నది. ఈ మధ్య కాలంలో భారత జట్టు వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ పర్యటనలకు వెళ్లింది. ఒక్క న్యూజీలాండ్ పర్యటనలో తప్ప భారత జట్టు మిగతా రెండు దేశాల్లో గెలుపొందింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టును వారి గడ్డపైనే రెండు సార్లు ఓడించింది. ఇక ఇటీవల స్వదేశంలో ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్‌లో కూడా భారత జట్టు విజయం సాధించింది. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఇంగ్లాండ్‌లో వారిని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని రాహుల్ ద్రవిడ్ వంటి సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ జట్టును ఓడించగలిగే సత్త ప్రస్తుత భారత జట్టుకు ఉందని పలువురు మాజీ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అందరూ ఒకే ఫ్లైట్‌లో..
భారత జట్టు పురుషుల జట్టు మూడున్నర నెలలు ఇంగ్లాండ్‌లోనే గడపాల్సి ఉంది. ఇప్పటికే బయోబబుల్ పేరుతో కుటుంబాలకు దూరమై క్రికెటర్లు మానసికంగా ఆందోళన చెందుతున్నారు. అందుకే వారితో పాటు కుటుంబ సభ్యులను, వ్యక్తిగత సిబ్బందిని తీసుకొని వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించినట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే క్రికెటర్లకు తప్ప మిగతా వాళ్లకు 10 రోజుల క్వారంటైన్ తప్పని సరి అని ఈసీబీ తెలిపింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చూడటానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషాకు కూడా అనుమతి లభించలేదని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు పురుషుల జట్టుతో పాటే మహిళల జట్టు కూడా ఒకే ఫ్లైట్‌లో ఇంగ్లాండ్ చేరుకోనున్నారు. భారత మహిళా జట్టు అక్కడ ఇంగ్లాండ్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. ఏడేళ్ల తర్వాత భారత మహిళా జట్టు టెస్టు మ్యాచ్ ఆడనుండటం విశేషం.
పర్యటన వివరాలు..
జూన్ 2 – భారత మహిళ, పురుష క్రికెటర్లు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు
జూన్ 3- లండన్‌లోని హీత్రో విమానాశ్రయానికి చేరుకుంటారు. టీమ్ ఇండియా మెన్స్ జట్టు అక్కడి నుంచి నేరుగా సౌతాంప్టన్‌లోని హోటల్‌కు చేరుకొని మూడు రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉంటారు.
జూన్ 18 నుంచి 22 – న్యూజీలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్
జూన్ 23 – డబ్ల్యూటీసీ ఫైనల్ రిజర్వ్ డే
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్
అగస్టు 4 నుంచి 8 – తొలి టెస్టు (నాటింగ్‌హామ్)
అగస్టు 12 నుంచి 16 – రెండోటెస్టు (లండన్)
అగస్టు 25 నుంచి 29 – మూడో టెస్టు (ది లీడ్స్)
సెప్టెంబర్ 2 నుంచి 6 – నాలుగో టెస్టు (లండన్)
సెప్టెంబర్ 10 నుంచి 14 – ఐదో టెస్టు (మాంచెస్టర్)
మహిళల టూర్
జూన్ 16 నుంచి 19 – ఏకైక టెస్టు (బ్రిస్టల్)
జూన్ 27 – తొలి వన్డే (బ్రిస్టల్)
జూన్ 30 – రెండో వన్డే (టాంటన్ డే/నైట్)
జులై 3 – మూడో వన్డే (వోర్సెస్టర్)
జులై 9 – తొలి టీ20 (నార్తాంప్టన్ డే/నైట్)
జులై 11 – రెండో టీ20 (బ్రిగ్టన్)
జులై 14 – మూడో టీ20 (ఛెమ్స్‌ఫోర్డ్ డే/నైట్)