టీమ్ ఇండియా ఘోర ఓటమికి కారణాలేంటి..?

by Anukaran |
టీమ్ ఇండియా ఘోర ఓటమికి కారణాలేంటి..?
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫేవరెట్లలో టీమ్ ఇండియా ఒకటి. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు కూడా టీమ్ ఇండియా బలంపై అనేక విశ్లేషణలు చోటు చేసుకున్నాయి. భారత జట్టులోని ఆటగాళ్లు అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ గత కొన్నాళ్లుగా నిలకడైన ఆట ఆడుతున్నారు. ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్, కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశారు. బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజాలు కూడా వికెట్లు తీస్తూ వారి జట్ల విజయం కోసం తమదైన పాత్ర పోషించారు. పేపర్‌పై భారత జట్టును చూస్తే అత్యంత బలంగా కనిపించింది.

తీరా మ్యాచ్ ప్రారంభమైన నిమిషాల్లోనే టీమ్ఇండియా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. టాప్ ఆర్డర్ విఫలమైన చోట భారత జట్టుకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఎప్పటి లాగానే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ సరైన ఫినిషర్ లేక భారత జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. బ్యాటింగ్ సమయంలోనే భారత జట్టును పాక్ మానసికంగా దెబ్బకొట్టింది. భారత జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. అసలు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడ మంచు ప్రభావం కారణంగా బౌలర్లు విఫలం అయ్యారని కోహ్లీ సమర్దించుకున్నాడు. కానీ కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పాండ్యా పరిస్థితి ఏంటీ..?

భారత జట్టు కూర్పులోనే పలు లోపాలు కనపడుతున్నాయి. ఫామ్ లేమితో పాటు ఫిట్‌నెస్ సరిగా లేని హార్దిక్ పాండ్యాను తుది జట్టులో తీసుకోవడం పొరపాటని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఐపీఎల్ 2021లో కూడా సరిగా రాణించని.. బౌలింగ్ కూడా చేయని పాండ్యాకు కీలక మ్యాచ్‌లో చోటు కల్పించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. మ్యాచ్ ఫినిషర్ కావాలనుకుంటే ఆ పాత్రను రిషబ్ చేతిలో పెట్టాలని.. తుది జట్టులోకి ఇషాన్ కిషన్‌ను తీసుకోవాలని పలువురు సూచించారు. అయినా కెప్టెన్ కోహ్లీ కానీ.. కోచ్ రవిశాస్త్రి కానీ పట్టించుకోలేదు.

పాండ్యా, భువనేశ్వర్‌లు ఐపీఎల్‌లో పూర్తిగా విఫలమయ్యారు. వారి స్థానంలో శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్‌ను తీసుకొని ఉంటే.. టాప్ ఆర్డర్ విఫలమైన చోటే వాళ్లు ప్లాన్ బి లాగా ఉపయోగపడేవాళ్లని అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేని వరుణ్ చక్రవర్తి బదులు తడి బంతితో కూడా స్పిన్ రాబట్టే రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు భారత జట్టు పాకిస్తాన్ మ్యాచ్‌లో పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో ఆడుతున్నది. కాస్త దూకుడు పెంచితే కానీ, భారత జట్టు విజయాల బాట పట్టడం కష్టమవుతుంది. భారత జట్టులో ప్రతీ ఆటగాడు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనే చేశారు. విడివిడిగా బలంగా కనపడుతున్న జట్టు.. కలిసినప్పుడు మాత్రం పేలవంగా మారిపోవడం ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నది. ఐపీఎల్ వల్ల క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నా.. జాతీయ జట్టులో సరిగా ఆడలేకపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

ఇకపై అన్ని మ్యాచ్‌లు కీలకమే..

గ్రూప్ 2లో నుంచి రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ఈ గ్రూప్‌లో పాకిస్తాన్, ఇండియా, న్యూజీలాండ్‌కు సెమీస్ చేరే అవకాశం ఉన్నది. భారత జట్టు ఇప్పటికే పాకిస్తాన్‌తో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌లు అన్నింటిలో భారత్ గెలవాల్సి ఉంటుంది. న్యూజీలాండ్, అఫ్గానిస్తాన్ జట్లపై తప్పకుండా గెలిస్తే కానీ భారత జట్టు సెమీస్ అవకాశాలు మెరుగు పడవు. మరోవైపు రేపు జరుగనున్న పాకిస్తాన్-న్యూజీలాండ్ మ్యాచ్ కూడా కీలకంగా మారనున్నది. ఈ మ్యాచ్‌లో కనుక న్యూజీలాండ్ గెలిస్తే.. గ్రూప్ 2లో సెమీస్ పోరు మరింత రసవత్తరంగా మారుతుంది. ఇకపై రాబోయే మ్యాచ్‌లలో అయినా టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తేలిగ్గా వికెట్లు పారేసుకోకుండా.. కనీసం సరైన శుభారంభాన్ని అందించాల్సి ఉన్నది. వారు కనుక లయను అందుకుంటే తర్వాత బ్యాటర్లపై భారం తగ్గుతుంది. బౌలింగ్ విభాగం పూర్తి పేలవంగా కనపడుతున్నది. శార్దుల్ ఠాకూర్‌, దీపక్ చాహర్‌లను తుది జట్టులోకి తీసుకోవడం ద్వారా భారత జట్టు కాస్త బలపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed