టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదా.. వారి నోటా అదే మాట..!

by Anukaran |
టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదా.. వారి నోటా అదే మాట..!
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు వారాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనుండగా.. ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఓట్లు కీలకంగా మారనున్నాయి. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో అవకాశం వచ్చిందని.. ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామనే ధోరణిలో ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నట్టు తెలుస్తోంది.

మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఆరేళ్ల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ సంఘం నాయకుడైన జీ.దేవీ ప్రసాదరావును బరిలోకి దించితే విజయం ఖాయమని టీఆర్ఎస్ పార్టీ భావించింది. అయితే, అప్పట్లో ప్రభుత్వం పట్ల ఉద్యోగులలో అంతగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ దేవీ ప్రసాదరావు బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఎన్నో రెట్లు బీజేపీ పుంజుకోగా ఇదే సమయంలో ప్రభుత్వం తీరు పట్ల ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో ఉపాధ్యాయులు, పెన్షనర్లు అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలనే సంకల్పంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఈ పర్యాయం కూడా ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం అంత సులువు కాదనే అభిప్రాయాలు అంతటా విన్పిస్తున్నాయి .

మమ్మల్నే పక్కన పెడతారా..?

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించిన సమయంలో ప్రభుత్వం ఉపాధ్యాయులను పక్కన పెట్టింది. వారి పదోన్నతుల విషయం పరిగణలోకి తీసుకోకుండా ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేర్వేరు అంటూ ప్రకటించింది. ఈ వ్యవహారంపై టీచర్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు సైతం పదోన్నతుల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసి తమ సత్తాచాటాలనే నిర్ణయంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో సుమారు 30 వేలకు పైగానే పట్టభద్ర ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నట్లు ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు తెలిపారు.

ఉపాధ్యాయుల బాటలోనే పెన్షనర్లు

ఉపాధ్యాయుల బాటలోనే పెన్షనర్లు ముందుకు కదులుతున్నారు. ముఖ్యంగా 70 ఏండ్లు పైబడిన వారందరికీ 10 శాతం పించన్ పెంచాలని, వెల్ నెస్ సెంటర్‌లో మందులు అందుబాటులో ఉంచాలని,
మెడికల్ రీయింబర్స్‌మెంట్ వీలైనంత త్వరగా ఇవ్వాలని, పీఆర్సీ ప్రకటించాలని పెన్షనర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో 70 యేండ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం అదనపు పెన్షన్, 27 శాతం ఐఆర్ ఇస్తోందని, తెలంగాణలో ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతుండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. మూడు నెలల పీఆర్సీ ఇస్తానని ప్రకటించి మూడేళ్లయినా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ అధికార పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయబోమని పెన్షనర్ల సంఘం నాయకులు తేల్చి చెబుతున్నారు.

ఎవరికి లాభం చేస్తుంది..?

తెలంగాణలో అధికార పార్టీపై ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ఉన్న ప్రతికూలత ఎవరికి లాభం చేస్తుందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. అధికార పార్టీని మినహాయించి ఎవరు వెళ్లి ఓట్లు అడిగినా ఓటర్లు ఓకే
చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులలోనూ టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయబోమని వారు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఎవరికి లాభం చేకూరుతుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. పట్టభద్రుల ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది రాజకీయ పార్టీలు ఒక అంచనాకు రాలేకపోతున్నాయి.

Advertisement

Next Story