‘ఈదడం’ తెలియని టీచర్లు బయటకు రావొద్దు..

by Aamani |   ( Updated:2021-07-22 05:11:21.0  )
teacher-swim
X

దిశ, ఉట్నూరు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘ఈదడం’ తెలిసిన ఉపాధ్యాయులు మాత్రమే విధులకు హాజరుకావాలని, లేనియెడల ఇంట్లోనే ఉండాల్సిన అధ్వాన పరిస్థితులు అక్కడ తలెత్తాయి. ఉట్నూర్ మండలంలోని చెరువు గూడా గ్రామ పంచాయతీ పరిధిలోని జెండాగూడ కోలాం ఆదివాసీ గ్రామంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విధులకు వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయలుదేరిన ఓ ఉపాధ్యాయుడు గురువారం వరద ప్రవాహంలో చిక్కుకున్నాడు. మూడు రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.

వివరాల్లోకి వెళితే.. ఉట్నూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చౌహాన్ రవీందర్, జాదవ్ జితేందర్‌లు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఉపాధ్యాయుడు చౌహన్ రవీందర్ పాఠశాలకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో వాగు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించింది. అయితే, ప్రవాహం తగ్గే వరకు ఉపాధ్యాయుడు ఎదురుచూడకుండా వాగు దాటేందుకు యత్నించి అందులో చిక్కుకుపోయాడు. వెంటనే సమాచారం అందించడంతో తోటి గ్రామస్తుడు తొడసం యశ్వంత్ రావ్ వచ్చి రక్షించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, వెంటనే జెండా గూడ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి, వాగుపైన వంతెన నిర్మించండి మహాప్రభో అంటూ ఉపాధ్యాయులు, గ్రామ పటేల్ అత్రం భగవంతరావు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

కేటీఆర్ ఇలాక.. లీకేజీలు, వరదలతో చెరువును తలపిస్తున్న కొత్త కలెక్టరేట్

Advertisement

Next Story

Most Viewed