తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు టీచర్ దారుణ హత్య

by Sumithra |
murder
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని కోరిన టీచర్‌ను రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణంగా హత్య చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నచింతకుంట మండలం ఉద్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నరహరి(40), భార్య, కూతురు, ఇద్దరు కుమారులతో కలిసి క్రిస్టియన్‌పల్లి‌లోని వైష్ణోదేవి కాలనీలో నివాసముంటున్నారు. అతని భార్య అరుణ హన్వాడ మండలం వేల్పూరు ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే, మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎ.జగదీశ్‌తో నరహరికి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట జగదీశ్‌కు అప్పుగా నరహరి రూ.కోటి ఇచ్చారు. ఇటీవల ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందన ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

ఇదే విషయమై బుధవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాక ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్ నుంచి క్రిస్టియన్‌పల్లికి బైక్‌పై బయలుదేరిన నరహరిని కారులో కొంతమందితో కలిసి జగదీశ్ వెంబడించాడు. భగీరథ కాలనీలో సమీపంలో పథకం ప్రకారం నరహరి బైక్‌ను జగదీశ్ కారుతో వేగంగా ఢీకొట్టాడు. అప్పటికే నరహరి కోసం వెతుకుతున్న బంధువుల్లో ఒకరు ఈ ఘటనను చూశారు. అతని ముందే దుండగులు కత్తితో నరహరి గొంతు కోసి పారిపోయారు. నరహరి అక్కడికక్కడే మృతి చెందాడు. బంధువు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు సమాచారంతో పోలీసులు సాక్షాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పరామర్శించిన మంత్రి..

విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, జిల్లా అధ్యక్షకార్యదర్శులు సత్తయ్య, శివయ్య డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed