అలాంటి ఉపాధ్యాయులు మాకొద్దు.. మా పిల్లలను పాఠశాలకు పంపము..

by Shyam |
students
X

దిశ, దుబ్బాక : విద్యార్థులను బావిభారత పౌరులుగా మార్చే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి, అలాంటి వృత్తి పట్ల నిర్లక్ష్యం వహించరాదని జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంఈఓ ప్రభుదాస్ అన్నారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఉపాధ్యాయుడు శ్రద్ధ వహించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభంపల్లిలో శుక్రవారం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినప్పటికీ పాఠశాలలో పనిచేస్తున్న మిగతా ఉపాధ్యాయులు ఎందుకు స్పందించలేదని సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

రెండు రోజులు సెలవు ఉండడంతో సోమవారం గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సర్పంచ్ పరుశరాములుతో కలిసి పాఠశాల వద్ద మిగతా ఉపాధ్యాయులను నిలదీశారు. తోటి ఉపాధ్యాయుడు విద్యార్థులను విచక్షణారహితంగా కొడితే మీరు ఏం చేశారని ప్రశ్నించారు. మిగతా ఉపాధ్యాయులపై కూడా తమకు నమ్మకం లేదంటూ మా పిల్లలను పాఠశాలకు పంపమని ఉపాధ్యాయులతో ఘర్షణకు దిగారు. పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ కనకయ్య రాజీనామా చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ ప్రభుదాస్, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి వెంటనే పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించడంతో తిరిగి విద్యార్థులను పాఠశాలలకు పంపించారు.

Advertisement

Next Story