టీడీపీని వీడని ‘హై’ వే ప్రమాదాలు..

by srinivas |
టీడీపీని వీడని ‘హై’ వే ప్రమాదాలు..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ:

టీడీపీ పార్టీకి రోడ్డు ప్రమాదాల బెడద వీడడం లేదు. నాడు టీడీపీ కీలక నేత లాల్ జాన్ బాషా మృతి దగ్గరి నుంచి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయేవరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు టీడీపీకి తీరని విషాదాన్ని మిగిల్చాయి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది. వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలు టీడీపీకి ఏ మాత్రం కలసి రావడం లేదు. నార్కట్పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి వద్ద టీడీపీ కీలక నేత లాల్ జాన్ బాషా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ నియోజకవర్గం పరిధిలోని మునగాల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ ప్రాణాలు వదిలాడు. కొంతకాలానికి నార్కట్పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై నందమూరి హరికృష్ణ సైతం రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌కి ప్రమాదం జరిగిందని తెలియగానే ఒక్కసారిగా పార్టీ శ్రేణులు కలవరపడ్డాయి. పెద్ద ప్రమాదం లేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ తీరని నష్టాన్ని చవిచూసింది. ఆ పార్టీ నేతలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల పట్ల ఇటు పార్టీ శ్రేణులు.. అటు అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటివరకు టీడీపీ నేతలకు జరిగిన ప్రమాదాలు ప్రత్యేక కథనం.

లాల్ జాన్ భాషా మృతి ఇలా..

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై 15 ఆగస్టు 2013న జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ కీలక నేత లాల్ జాన్ బాషా మృతి చెందారు. తన వాహనంలో హైదరాబాద్ నుంచి గుంటూరు నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బాషా ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయాలపాలై మృతిచెందారు.

హరికృష్ణ మృతి ఇలా..

అది ఆగస్టు 29, 2018. తెల్లవారు జామున నార్కట్ పల్లి – అద్దంకి జాతీయ రహదారిపై ఓ కారు దూసుకెళ్తోంది. ఉన్నట్టుండి ఆ కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. కారు లోంచి ఓ వ్యక్తి పక్కనే ఉన్న రాళ్ల మీద పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే కారు దగ్గరికి చేరుకొని చూడగా అతను మరెవరో కాదు టీడీపీ నేత నందమూరి హరికృష్ణ. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంతకీ ఆ ప్రమాదం ఎలా జరిగిందంటే.. నందమూరి హరికృష్ణ కారులో హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తున్నారు.

నల్గొండ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో అన్నెపర్తి సమీపంలోకి వెళ్లగానే హరికృష్ణ వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. మలుపు వద్ద కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. అటువైపు నుంచి వచ్చిన కారుపైకి హరికృష్ణ కారు ఎక్కి.. తర్వాత రోడ్డు అంచున ఉన్న ముళ్ల పొదలోకి దూసుకెళ్లింది. హరికృష్ణ కారులోంచి దాదాపు 30 మీటర్ల దూరంలో ఉన్న కల్వర్టు అంచున రాళ్ళ మీద పడ్డారు. దాంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన హరికృష్ణను వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు.

నందమూరి జానకీరామ్ మృతి ఇలా..

టీడీపీ పొలి ట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్(42) హైదరాబాద్-విజయవాడ 65 నంబర్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద 2014 డిసెంబరు 6 న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. జానకిరామ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు టాటా సఫారీ వాహనం (ఏపీ 29 బీడీ 2323)లో వెళుతుండగా.. సాయంత్రం సమయంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో వరినారు తీసుకొని రాంగ్‌రూట్‌లో వెళుతున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి దాని ట్రాలీని ఆయన వాహనం ఢీకొంది.

ఈ సమయంలో వాహనాన్ని నడుపుతున్న జానకిరామ్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. జానకిరామ్‌ను చికిత్స నిమిత్తం కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కుడిచేయి విరగడంతో పాటు, కడుపులో తీవ్రగాయాలు కావడంతో జానకిరామ్ మృతి చెందారు. ఇక 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా మోతే వద్ద ఆయన ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురయ్యింది.

Advertisement

Next Story

Most Viewed