తన మాటలను వెనక్కి తీసుకున్న అచ్చెన్నాయుడు

by srinivas |   ( Updated:2021-09-14 04:24:44.0  )
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులోని అసెంబ్లీ కార్యాలయంలో మంగళవారం జరిగిన అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. అచ్చెన్నాయుడుపై ఫిర్యాదు ఆధారంగా ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి విచారణ జరిపారు. ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు అనుమతి లేకుండా న్యాయవాదిని తీసుకువచ్చారు. అందుకు ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం తెలపడంతో ఆయన ఒక్కరే విచారణకు హాజరయ్యారు. అనంతరం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గతంలో స్పీకర్‌ తమ్మినేనిపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది.

మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఈనెల 21న నిర్ణయం: కాకాణి

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రివిలేజ్ కమిటీ ఎదుట తెలిపారని కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు వివరణను కమిటీ సభ్యులకు పంపిచనున్నట్లు స్పష్టం చేశారు. కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వ మాజీ విప్ కూన రవి అందుబాటులో లేనని సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌, ఎమ్మెల్యే రామానాయుడులపై ఈ నెల 21న జరిగే సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story