Cyclone Tauktae Highlights :‘తౌక్టే’ తుఫాన్ ప్రతాపం

by Shamantha N |   ( Updated:2021-05-16 20:39:58.0  )
Cyclone Tauktae Highlights :‘తౌక్టే’ తుఫాన్ ప్రతాపం
X

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్టే’ తుఫాన్ కేరళ, కర్ణాటక, గోవాల్లో తన ప్రతాపాన్ని చూపించింది. కేరళను శనివారం అతలాకుతలం చేసిన తుఫాన్ ఆదివారమూ అదేస్థాయిలో విరుచుకుపడింది. కర్ణాటక, గోవా తీర ప్రాంతాల్లో విలయం సృష్టించింది. కర్ణాటకలో నలుగురు తుఫాన్ కారణంగా మరణించగా(ఉత్తర కన్నడ, ఉడుపి, చిక్కమగళురు, శివమొగ్గలలో), గోవాలో బలమైన గాలులు, వర్షం కారణంగా చెట్టు కింద పడి ఒకరు, పోల్ విరిగిపడి మరొకరు దుర్మరణం పాలయ్యారు. కేరళలోనూ ఎర్నాకుళం, కోజికోడ్‌లలో ఇద్దరు మరణించారు. కేరళ తర్వాత కర్ణాటక, గోవా, డామన్ డయ్యూలో కుండపోతగా వర్షం పడిన తుఫాన్ ఆదివారం తీవ్రరూపం దాల్చింది. మంగళవారం ఉదయానికల్లా గుజరాత్‌లో పోర్‌బందర్ దగ్గర తీరం దాటనున్నట్టు కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్, డయ్యూలో యెల్లో అలర్ట్ జారీ చేసింది. కేరళలో కుంభవృష్టి కారణంగా చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా అలప్పూజ జిల్లాలో ఈ పరిస్థితులున్నాయి. మంకోంబు, తెక్కెకార, వేజపారా, పూవమ్‌లలో చాలా వరకు ఇళ్లు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి.

గోవా తీర ప్రాంతంలో తౌక్టే తుఫాన్ కారణంగా భారీగా ఆస్తినష్టం సంభవించింది. చెట్లు, కరెంట్ పోల్స్ కూలిపోయాయి. సుమారు 500 వృక్షాలు నేలకొరిగాయి. చాలా చోట్ల రోడ్లు బ్లాక్ అయ్యాయి. వీటన్నింటిని తొలగించడానికి రెండు రోజులైనా పడుతుందని సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. ఇందులో కొన్ని చెట్లు పార్కింగ్ ప్లేసుల్లో కూలడంతో ఖరీదైన కార్లూ డ్యామేజీ అయ్యాయి. ఈ ఘటనల్లో కనీసం 100 గృహాలు తీవ్రంగా డ్యామేజీ అయ్యాయి. మరో 100 గృహాలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి తోడు వేగంగా వీచే గాలులు తోడయ్యాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. విమానాశ్రయాన్ని మూసేశారు. విమాన సేవలను రద్దు చేశారు. కరోనా పేషెంట్లకు చికిత్సనందిస్తున్న హాస్పిటళ్లపైనా ప్రభావం పడింది.

ప్రధాని మోడీ, అమిత్ షాల సమీక్ష

కరోనాపై పోరుతోపాటు తౌక్టే తుఫాన్‌ను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు అండగా ఉంటామని తెలియజేసినట్టు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ కాలంలో అత్యవసర సరుకులను సరఫరా చేస్తామని, ప్రతి ఒక్కరి యోగక్షేమాల కోసం పరితపిస్తున్నట్టు వివరించారు. కాగా, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా సహాయక చర్యలపై మాట్లాడారు. పరిస్థితులను సమీక్షించారు. కరోనా చికిత్సపై ప్రభావం పడకుండా ఈ సవాల్‌ను అధిగమించాలని సూచించారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయాలను చేసి పెడతామని, అవసరమైతే కేంద్ర బలగాలనూ పంపిస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed