త్వరలో టాటాసన్స్ నాయకత్వంలో మార్పులు ?

by Harish |
rathan-tata
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద గ్రూపు సంస్థల్లో ఒకటైన టాటాసన్స్‌లో నాయకత్వ నిర్మాణంలో చారిత్రాత్మక మార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. కార్పొరేట్ పాలనను మరింత మెరుగుపరుస్తూ టాటాసన్స్‌లో కొత్తగా సీఈఓ పదవిని సృష్టించనున్నట్టు సమాచారం. సీఈఓపై ఛైర్మన్ బాధ్యతల్లో ఉన్నవారి పర్యవేక్షణ ఉంటుంది. కొత్త పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక ప్రకారం.. సీఈఓ బాధ్యతలను తీసుకునే వ్యక్తి టాటాసన్స్‌ వ్యాపారాలను చూసుకోనున్నారు. సీఈఓ పనితీరును వాటాదారుల తరపున ఛైర్మన్ పర్యవేక్షిస్తారు. అయితే, ఈ ప్రతిపాదనలకు అంతిమంగా టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్న రతన్ టాటా ఆమోదం కీలకంగా ఉండనుంది. ఇటీవల రతన్ టాటాకు, సైరస్ మిస్త్రీకి మధ్య జరిగిన న్యాయ వివాదంలో కొన్నేళ్ల అనంతరం రతన్ టాటాకు అనుకూలంగా కేసు సాగడంతో ఆయన విజయం సాధించారు. దీని తర్వాతే సంస్థకు సీఈఓ పదవిని సృష్టించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ప్రస్తుతానికి టాటాసన్స్‌కు ఛైర్మన్‌గా ఉన్న ఎన్ చద్రశేఖరన్ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసింది. ఆ సమయంలో ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. ఇప్పటివరకు సీఈఓ పదవికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేయలేదు. టాటా గ్రూపులోని పలువురు సీఈఓ పదవి కోసం సిద్ధంగా ఉన్నారు. రెండు దశాబ్దాల పాటు సంస్థ బాధ్యతలు నిర్వహించిన రతన్ టాటా విశ్రాంతిలో ఉన్నారు. ఈ క్రమంలో సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బలమైన నాయకత్వం అందించాలని భావిస్తున్నారు. అయితే, ఈ అంశాలపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది. కాగా, ప్రస్తుతం టాటా గ్రూపు పరిధిలో 100కు పైగా వ్యాపారాలున్నాయి. అలాగే, 12కు పైగా లిస్టెడ్ కంపెనీలునాయి. 2020 నాటికి ఈ వ్యాపారాల విలువ సుమారు రూ. 7.86 లక్షల కోట్లు. వీటిలో మొత్తం 7.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed