బిగ్‌బాస్కెట్‌ను సొంతం చేసుకున్న టాటా

by Harish |   ( Updated:2021-05-28 05:20:04.0  )
బిగ్‌బాస్కెట్‌ను సొంతం చేసుకున్న టాటా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ టాటా సన్స్ తన అనుబంధ సంస్థ టాటా డిజిటల్ ఆన్‌లైన్ దిగ్గజ కిరాణా సంస్థ బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్టు ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థల మధ్య పోటీ తీవ్రం కానుంది. దేశీయ ఈ-కిరాణా రంగంలో ఇప్పటికే ఉన్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ రిటైల్ సంస్థలకు గట్టి పోటీ ఉండనుంది. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించి ఆర్థికపరమైన వివరాలను వెల్లడించనప్పటికీ, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం.. బిగ్‌బాస్కెట్‌లో టాటా డిజిటల్ 64.3 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. సుమారు రూ. 9 వేల కోట్లకు పైనే ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఈ వారం ప్రారంభంలో బిగ్‌బాస్కెట్ సంస్థ బోర్డు ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపినట్టు సమాచారం.

గత నెలలో బిగ్‌ బాస్కెట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా సంస్థలకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) లైన్ క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. “భారత్‌లో ఆన్‌లైన్ కిరాణా విభాగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న బిగ్‌బాస్కెట్‌ను కొనుగోలు చేయడం సంతోషంగా ఉంది. ఈ కొనుగోలు ద్వారా డిజిటల్ ఈ-కామర్స్ రంగంలో వినియోగదారులను ఆకర్షించేందుకు మెరుగైన భవిష్యత్తు ప్రణాళికను కలిగి ఉన్నామని” టాటా డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతీక్ పాల్ శుక్రవారం ఓ ప్రకటనలో చెప్పారు. టాటా గ్రూప్ సంస్థతో భాగస్వామ్యం ద్వారా కంపెనీ మరింత వృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉందని బిగ్‌బాస్కెట్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ హరి మీనర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed