"చుట్టూ ప్రతికూల పరిస్థితులు… అయినా అరుదైన ఘనత"

by Harish |
చుట్టూ ప్రతికూల పరిస్థితులు… అయినా అరుదైన ఘనత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటో మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాంక్ విభాగంలో టాటా మోటార్స్ కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్ మోడల్ అరుదైన ఘనతను సాధించింది. దాదాపు రెండేళ్లుగా కొవిడ్ పరిణామాలతో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ గణనీయమైన అమ్మకాలను నమోదు చేసింది. ప్రధానంగా భద్రతా పరంగా మెరుగైన రక్షణ అందించే లక్ష్యంతో దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ మోడల్ 2020, జనవరిలో విడుదలైంది. ఇప్పటివరకు 20 నెలల్లోనే ఏకంగా లక్షల యూనిట్ల అమ్మకాల రికార్డును సాధించింది.

మంగళవారం పూణెలోని టాటా ప్లాంట్‌లో ఆల్ట్రోజ్ 1 లక్ష యూనిట్‌ను కంపెనీ విడుదల చేసింది. టాటా ఆల్ట్రోజ్ మోడల్ కారు భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత సగటున నెలకు 6,000 కార్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది మార్చి నెలలో అత్యధికంగా 7,500 కార్లు విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. అయితే, ఆ నెల తర్వాత కరోనా సెకెండ్ వేవ్ పరిస్థితుల వల్ల వెనకబడ్డామని, లేదంటే ఇంకా త్వరగానే లక్ష యూనిట్ల మార్కును చేరుకునే వాళ్లమని టాటా మోటార్స్ సేల్స్ విభాగానికి చెందిన రాజన్ చెప్పారు. 2020లోనే ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటికీ ఈ ఏడాదిలోనే ఎక్కువమంది దీన్ని కొనేందుకు ఆసక్తి చూపించారని కంపెనీ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం కార్ల విక్రయాల్లో 20 శాతం వాటా ఆల్ట్రోజ్ మోడల్ దక్కించుకుంది. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటాకు ఇండికా తర్వాత ఆల్ట్రోజ్ ఎక్కువ ఆదరణ కలిగిన మోడల్‌గా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed