బలవంతపు భూ సేకరణ సరికాదు.. పరిహారం తేల్చాకే సర్వే

by Sridhar Babu |
బలవంతపు భూ సేకరణ సరికాదు.. పరిహారం తేల్చాకే సర్వే
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లా నుంచి సూర్య‌పేట మీదుగా దేవరపల్లి మరియు నాగపూర్‌ నుంచి అమరావతి కింద గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవేరోడ్ల క్రింద, సీతారామ ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. బలవంతపు భూ సేకరణ సరికాదని ప్ర‌భుత్వానికి హిత‌వు ప‌లికారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే కింద భూములు కోల్పోతున్న రైతుకు సుడా పరిధిలో నూతన కలెక్టరేట్‌ భూ సేకరణ ధర ఎకరాకు రూ.కోటి రూపాయలను పరిగణలోకి తీసుకొని నష్టపరిహారం చెల్లించాల‌న్నారు.

ఇతర ప్రాంతాల్లో ఎకరానికి రూ.50 లక్షలు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ముందస్తుగా రైతులతో చర్చలు జరిపి, నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలన్నారు. అలా కాకుండా బలవంతంగా భూ సేకరణ కోసం సర్వేచేయడం తగదన్నారు. రిజిస్ట్రేషన్‌ ధర ప్రకారం చెల్లిస్తే రైతు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇప్పుడున్న బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం 4 రెట్లు కలిపి వారికి నష్టపరిహారం చెల్లించాలని చట్టం చెబుతుందని గుర్తుచేశారు. ఎలాంటి నోటీస్‌లు లేకుండా పొలాల్లో మార్కింగ్‌ చేస్తున్నారని తెలిపారు. భూ నిర్వాసితుల తరపున ఐక్య పోరాటం నిర్వహిస్తామని తెలిపారు. కరోనాను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యు పొన్నం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed