చూపు తిప్పుకోనివ్వని ‘ఐ ఆర్ట్’

by Shyam |   ( Updated:2020-11-29 08:21:44.0  )
చూపు తిప్పుకోనివ్వని ‘ఐ ఆర్ట్’
X

దిశ, వెబ్‌డెస్క్ : ఓ పెయింటింగ్‌లో.. సాగరకన్య నదీతీరాన సేదతీరుతూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. మరోదాంట్లో గులాబీపై వాలిన సీతాకోకచిలకలన్నీ.. ఒక్కసారిగా అలా ఎగిరిపోతుంటాయి. ఈ చిత్రాలు కాన్వాస్ మీద వేసినవో, గోడ మీద తీర్చిదిద్దినవో కాదు. రెప్పవాల్చకుండా చూడాల్సిన ఆ చిత్రరాజాలన్నీ కూడా ఆ కను రెప్పలపైనే రంగులద్దుకున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ‘తాల్ పెలెగ్’ అనే చిత్రకారిణి కనుబొమ్మలకు, కనురెప్పలకు మధ్య చిత్రిస్తున్న ‘పెయింటింగ్స్’ నిజంగా కనులకు విందే.

మేకప్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్న పెలెగ్.. ఈ కళను ఓ ‘మ్యాజిక్’తో పోల్చుతుంది. అందుకే ఈ టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్.. స్టాండర్ట్ మేకప్ కిట్స్, వాటర్ కలర్స్‌తో అత్యద్భుతమైన చిత్రాలను సృష్టిస్తోంది. సగటున ఒక చిత్రం గీయడానికి 2.5 గంటల సమయం తీసుకునే పెలెగ్.. కష్టతరమైన పెయింటింగ్స్ కోసం 5 గంటల వరకు వెచ్చిస్తుంటుంది. కానీ కనురెప్పల మీద ప్రాణం పోసుకున్న ఆ చిత్రాలు నిజంగా మన చూపు తిప్పుకోనివ్వవు. పెలెగ్ వాళ్ల అమ్మ సెరామిక్ ఆర్టిస్ట్. దాంతో పెలెగ్‌కు కూడా ఆర్టిస్ట్ స్కిల్స్ వచ్చాయని ఆమె అంటోంది.

‘నేను చిన్నప్పటి నుంచే పెయింటింగ్ వేశాను. నా యంగ్ సిస్టర్‌ మీదే ఫొటో షూట్స్, మేకప్ ఎక్స్‌పరిమెంట్స్ చేసేదాన్ని. హైస్కూల్‌లో ఉండగా, థియేటర్ అండ్ యాక్టింగ్ క్లాసులకు వెళ్లాను. అక్కడి నటీనటులందరికీ స్టేజ్ మేకప్ వేశాను. ప్రొఫెషనల్ మేకప్ వేయడం అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత విజువల్ కమ్యూనికేషన్స్ స్టడీ కూడా చేశాను. డిజైన్, ఫొటోగ్రఫీ, ఇల్యూస్ట్రేషన్స్.. ఇలా అన్నీ చదివేశాను. దాంతో ప్రొఫెషనల్ కెరీర్ ఎంచుకోవడం చాలా కష్టంగా మారింది. మేకప్, ఫొటోగ్రఫీ, పెయింటింగ్ అన్నింటినీ కలిపి ‘ఐ ఆర్ట్’‌కు జీవం పోశాను’ అని పెలెగ్ తెలిపింది.

పెలెగ్ బాడీ ఆర్ట్ కూడా వేస్తుంది. కానీ ఐ షాడోస్, ఐ లైనర్స్ వేయడంలో తనదైన ప్రత్యేకత ఉంటుందని ఆమె అంటోంది. ఒక్కో ఐ ఆర్ట్ వేయడానికి ఎంతో టైమ్, ఓపిక కావాలి, కానీ ఆ ఆర్ట్ వేయడంలో ప్రతి సెకన్ ఎంజాయ్ చేస్తానని పెలెగ్ తెలిపింది. అంతేకాదు ఆమె తన పెయింటింగ్స్ ద్వారా మెంటల్ డిజార్డర్స్ పైనా అందరిలోనూ అవగాహన కల్పిస్తుంది. ఆమె ఇన్‌స్టా అకౌంట్‌కు 2 లక్షలకు పైగా అభిమానులున్నారు.

Advertisement

Next Story

Most Viewed