- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుట్‌బాల్ లీగ్స్‌ను మించిపోనున్న క్రికెట్?
దిశ, స్పోర్ట్స్: ‘ఫుట్‌బాల్‌తో క్రికెట్‌కు పోటీనా? ప్రపంచంలోని అత్యధిక దేశాలు ఆడే ఫుట్‌బాల్ ఎక్కడ? కొన్ని దేశాలకే పరిమితమైన క్రికెట్ ఎక్కడ? ఫిఫా వరల్డ్ కప్‌లో 32దేశాలు పాల్గొంటుంటే, ఐసీసీ వరల్డ్ కప్ 10దేశాలకే పరిమితమైంది. ఇవన్నీ చూసి కూడా ఫుట్‌బాల్‌ను క్రికెట్ దాటేస్తుందని ఎలా ఊహిస్తారు’.. ఎవరైనా ఫుట్‌బాల్ ఫ్యాన్‌ని కదిపితే ఇలాంటి మాటలే అంటారు. నిజమే! ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఆట ఫుట్‌బాలే. కానీ చాపకింద నీరులా క్రికెట్ అన్ని దేశాల్లోకి వ్యాపిస్తున్నది. ముఖ్యంగా టీ20 జమానాలో క్రికెట్ ఆటను చూసే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. క్రికెట్ ఆటను చూడటానికే ఇష్టపడని అమెరికా వంటి దేశాల్లో కూడా క్రికెట్ లీగ్స్ ప్రారంభం కావడం దీనికో నిదర్శనం. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక మార్కెట్ ఉన్నది ఫుట్‌బాల్‌కే. అయినా ఆయా దేశాలు నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్స్‌తో ఆదరణ పెరుగుతున్నది. ఇటీవల ఒక క్రీడా వెబ్‌సైట్ జరిపిన సర్వేలో ఫుట్‌బాల్‌కు పోటీగా క్రికెట్ అభివృద్ధి చెందుతున్నట్లు తేలింది. రాబోయే దశాబ్దంలో రూ.లక్ష కోట్ల మార్కెట్‌కు క్రికెట్ లీగ్స్ చేరువవుతాయని అంచనా వేసింది.
ఈపీఎల్‌ను దాటేసిన ఐపీఎల్
ప్రపంచంలో టాప్ ఫుట్‌బాల్ లీగ్‌గా పేరున్న ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్)ను 27 ఏళ్ల క్రితం ప్రారంభించారు. అలాగే స్పెయిన్‌లో పాపులర్ అయిన ‘లా లీగ’ ఫుట్‌బాల్ లీగ్‌ను 90ఏళ్ల క్రితం ప్రారంభించారు. గతేడాది ఈపీఎల్ 6.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.47వేల కోట్లు) బ్రాండ్ వాల్యూ సాధించింది. ఇక లా లీగ బ్రాండ్ వాల్యూ 4.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.31వేల కోట్లు)గా ఉంది. యూరోపియన్ దేశాల్లో ఫుట్‌బాల్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ వల్ల ఏటా ఈ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. క్రికెట్ వరల్డ్ కప్ కూడా ఇంత బ్రాండ్ వాల్యూను సంపాదించుకోలేకపోయింది. కానీ, 13ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గత ఏడాది 6.7బిలియన్ డాలర్ల(దాదాపు రూ.50వేల కోట్లు) బ్రాండ్ వాల్యూను నమోదు చేసినట్లు డఫ్ అండ్ ఫెల్ఫ్స్ సంస్థ తేల్చింది. కేవలం 12ఏళ్లలోనే ఈపీఎల్‌ను ఐపీఎల్ దాటేసింది. కాగా, ఈపీఎల్‌లోని టాప్ 5 క్లబ్స్ వాల్యూను మాత్రం ఐపీఎల్‌లోని టాప్ 5 ఫ్రాంచైజీలు అందుకోలేకపోయాయి. ఐపీఎల్ వాల్యూకు సమానంగా ఫ్రాంచైజీల విలువ పెరగక పోవడం గమనార్హం. బ్రాండ్ వాల్యూ పరంగా ఈపీఎల్‌ను ఐపీఎల్ దాటేసినట్లు కనపడినా.. ఆటను చూసేవాళ్ల సంఖ్యలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. గత సీజన్ ఈపీఎల్‌ను ప్రపంచవ్యాప్తంగా 4.7 బిలియన్ మంది చూడగా, ఐపీఎల్‌ను చూసింది కేవలం 462 మిలియన్ మందే.
విస్తరిస్తున్న క్రికెట్
జెంటిల్మన్ క్రీడగా పేరున్న క్రికెట్ కొన్ని దేశాలకే పరిమితం కావడానికి కారణం ఆట నడిచే వ్యవధి. టెస్టులు 5రోజులు, వన్డేలు అయితే దాదాపు 7 గంటల పాటు ఆడుతుంటారు. అదే ఫుట్‌బాల్ అయితే 90 నిమిషాల వ్యవధిలో మ్యాచ్ ముగుస్తుంది. ఒక వేళ ఫలితం తేలకుంటే మరో 30 నిమిషాల ఎక్స్‌ట్రా టైం ఉంటుంది. అందుకే పాశ్చాత్య దేశాల్లో ఫుట్‌బాల్‌కు అమితమైన ఆదరణ లభిస్తున్నది. అయితే టీ20ల రంగ ప్రవేశంతో ఫుట్‌బాల్‌కు గట్టి పోటీ మొదలైంది. ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) ప్రారంభించిన ఈ టీ20 ఫార్మాట్ అతి తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది. 2007 టీ20 వరల్డ్ కప్‌ను ఇండియా గెలిచిన తర్వాత ఇండియాలో కూడా ఈ ఫార్మాట్‌లోని మజా తెలిసొచ్చింది. దీంతో బీసీసీఐ ఈ ఫార్మాట్‌లో ప్రారంభించిన ఐపీఎల్ తొలి ఎడిషన్ నుంచే సూపర్ హిట్ అయ్యింది. ఇంగ్లాండ్‌లో ప్రారంభించిన నాట్‌వెస్ట్ టీ20 బ్లాస్ట్ మొదటి క్రికెట్ లీగ్. కానీ కాస్త వైవిధ్యమైన ఫార్మాట్‌లో ప్రారంభించిన ఐపీఎల్ మాత్రం మిగతా లీగ్స్ అన్నింటికీ ఒక దారి చూపించింది. ప్రస్తుతం 7 క్రికెట్ లీగ్స్‌ను ఆయా బోర్డ్స్ నిర్వహిస్తున్నాయి. రాబోయే రోజుల్లో క్రికెట్ లీగ్స్‌కు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని అమెరికా, లాటిన్ దేశాల్లోనూ క్రికెట్ విస్తరణకు టీ20 ఫార్మాట్ అనుకూలంగా ఉంటుందని ఐసీసీ భావిస్తున్నది.
టాప్ క్రికెట్ లీగ్స్
1. ఇండియన్ ప్రీమియర్ లీగ్
2. బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా)
3. నాట్‌వెస్ట్ టీ20 బ్లాస్ట్ (ఇంగ్లాండ్)
4. పాకిస్తాన్ సూపర్ లీగ్
5. కరేబియన్ ప్రీమియర్ లీగ్
6. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్
7. రామ్ స్లామ్ టీ20 ఛాలెంజ్ (సౌత్ ఆఫ్రికా)
8. లంకన్ ప్రీమియర్ లీగ్
టాప్ ఫుట్‌బాల్ లీగ్స్
1. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఇంగ్లాండ్)
2. లా లీగ (స్పెయిన్)
3. బందెల్సిగా (జర్మనీ)
4. సిరీస్ ఏ (ఇటలీ)
5. లీగ్ 1 (ఫ్రాన్స్)
6. బ్రెసిలేరో సిరీస్ ఏ (బ్రెజిల్)
7. సూపర్ లీగ (అర్జంటీనా)
8. డచ్ ఎరిడివసే (నెదర్లాండ్)
9. ప్రీమియర్ లీగ (పోర్చుగల్)
10. మేజర్ లీగ్ సాకర్ (యూఎస్ఏ)