టీ-హబ్‌కు ఐదేళ్లు..!

by Anukaran |   ( Updated:2020-11-06 09:56:03.0  )
టీ-హబ్‌కు ఐదేళ్లు..!
X

దిశ, వెబ్‌డెస్క్: వినూత్న ఆవిష్కరణలతో మొదలైన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన టీ-హబ్‌కు గురువారంతో ఐదేళ్లు పూర్తయ్యాయి. 2015, నవంబర్ 5న ప్రారంభమైన టీ-హబ్ దేశీయంగా స్టార్టప్ కంపెనీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది. టీ-హబ్ ఇప్పటీవరకూ 1100 స్టార్టప్ కంపెనీలు, 430 కార్పొరేషన్‌లకు సేవలను అందించింది. ఈ కంపెనీలన్నీ కలిసి మొత్తం 15 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించాయి. అంతేకాకుండా రూ. 18 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఈ కంపెనీలు ఆకర్షించడంలో టీ-హబ్ పాత్ర ప్రముఖమైనది.

అదేవిధంగా స్టార్టప్ కంపెనీలు మార్కెట్లో తమదైన ముద్ర వేసుకునేందుకు తోడ్పాటుగా 75 సరికొత్త కార్యక్రమాలను టీ-హబ్ రూపొందించింది. ఆయా కంపెనీలు తమ కస్టమర్లను సంప్రదించేందుకు, పెట్టుబడులను సమీకరించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన సదుపాయాలను కల్పించేలా ప్రణాళికలను అందించారు. అలాగే, దేశీయ, అంతర్జాతీయ సంస్థలు, పరిశోధన, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో స్టార్టప్ కంపెనీల అభివృద్ధి కోసం టీ-హబ్ ఎంతో కృషి చేసింది.

టీ-హబ్‌కు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ..ఇటీవల చాలామంది యువ పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు సిద్ధమవుతున్నారు. వారికి టీ-హబ్ సరైన వేదికలా ఆహ్వానం పలుకుతోంది. కొత్త ఆలోచనలతో ఉత్సాహం కలిగిన వారికి ప్రోత్సాహం కల్పిస్తూ వారి విజయంలో టీ-హబ్ తోడ్పాటును అందిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీ-హబ్ సీఈవో రవి నారాయణ్.. యువతలో నూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ-హబ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. టీ-హబ్ కృషి కారణంగా తక్కువ కాలంలోనే రాష్త్రంలో స్టార్టప్ కంపెనీలు 400 నుచి 2000 వరకూ పెరిగాయని తెలిపారు.

Advertisement

Next Story